రాజధాని తరలిస్తున్నామని జగన్ అధికారికంగా ప్రకటిస్తే జనసేన ఏం చేస్తుందో చెబుతా.. మంచి బట్టలు, బంగారం పెట్టుకుని ఉద్యమం చేయకూడదా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

pawan kalyan capital amaravati: అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీతో జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అమరావతి ఉద్యమం చేస్తున్న వారిపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు పవన్ కళ్యాణ్. మంచి బట్టలు, బంగారం పెట్టుకుని ఉద్యమం చేయకూడదా అని పవన్ ప్రశ్నించారు. ఉద్యమం అంటే చిరిగిన బట్టలు వేసుకునే ఉండాలా అని అడిగారు. ఉద్యమాన్ని సామాజిక వర్గానికి ముడిపెట్టడం మంచిది కాదన్నారు జనసేనాని.

రాజధాని అంశాన్ని మూడు ప్రాంతాల మధ్య సమస్యగా మార్చేశారని పవన్ వాపోయారు. అమరావతి రైతులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు పవన్. బీజేపీ కూడా అమరావతినే రాజధానిగా చూస్తోందని పవన్ స్పష్టం చేశారు. దీనిపై తనకు డిక్లరేషన్ కూడా ఇచ్చారని పవన్ చెప్పారు. అమరావతి నుంచి రాజధాని తరలిస్తున్నామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే జనసేన ఏం చేస్తుందో చెబుతా అని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

చాలా రోజుల తర్వాత మళ్లీ ఏపీకి పవన్:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిలో పర్యటిస్తున్నారు. కరోనా, ఆ తర్వాత సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న వకీల్ సాబ్ చాలా రోజుల తర్వాత ఏపీలో అడుగు పెట్టారు. జనసేన పార్టీ క్రియాశీలక సమావేశాలు రెండు రోజులపాటు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఈ సమావేశాలలో పాల్గొంటున్నారు.

నియోజకవర్గాల ఇంచార్జులు, నాయకులతో సమావేశం:
మంగళవారం(నవంబర్ 17,2020) ఉదయం మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇచ్చాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం అర్బన్ నియోజకవర్గాల ఇంచార్జులు, నాయకులతో సమావేశం నిర్వహించారు పవన్. ఆ 5 నియోజకవర్గాల్లో పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు. ఇందుకు సంబంధించి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి అమలు చేస్తున్న ప్రమాద భీమా వివరాలను వెల్లడించారు. ఈ సభ్యత్వం పొందినవారికి రూ.5 లక్షలు ప్రమాద భీమా సదుపాయం కల్పిస్తున్నారు. భీమా ధ్రువపత్రాలను పవన్ కళ్యాణ్ ప్రదానం చేశారు.

నాకు పారిపోవడం తెలీదు:
ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. జీవితంలో తనకు పారిపోవడం తెలియదని అన్నారు. అధికారం తాలూకు అంతిమ లక్ష్యం వేల కోట్లు వెనకేసుకోవడం కాదు.. ప్రజలు కోల్పోయిన వాటిని వారికి అందజేయడం కావాలి… జనసేన పార్టీ అది చేస్తుంది అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ”ఏదైనా అభిప్రాయం చెప్పాల్సి వచ్చినప్పుడు ధైర్యంగా చెబుతా. కార్యకర్తల నుంచే నాయకులను తయారు చేసుకోగల సత్తా పార్టీకి ఉంది. క్షేత్రస్థాయిలో నిజాయతీగా పార్టీ జెండా పట్టుకొని పోరాటం చేసే కార్యకర్తలను పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. క్రియాశీలక సభ్యత్వంలో కాన్షీరామ్, దళిత ఉద్యమాల నుంచి స్ఫూర్తిని తీసుకున్నాం. పోరాటయాత్రలో భాగంగా రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా పార్టీ జెండా పట్టుకొని నిస్వార్థంగా పని చేసే కార్యకర్తలను చూశాను.

తోపుడు బండి మీద వ్యాపారం చేస్తూ కూడా తమకు వచ్చిన కొద్దిపాటి ఆదాయంలో కొంత పార్టీ కోసం ఖర్చు చేసే జనసైనికులు తారసపడ్డారు. వారందరికి పార్టీ తరపున అండగా నిలబడాలనే సంకల్పంతో క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా 5 నియోజకవర్గాల్లో ప్రారంభించాం. ఈ ఐదు నియోజకవర్గాల్లో కార్యక్రమాన్ని విజయవంతం చేసి కొండంత ధైర్యం ఇచ్చారు. నా నమ్మకాన్ని నిలబెట్టినందుకు మీ అందరికి ధన్యవాదాలు’ అని పవన్ అన్నారు.

Related Tags :

Related Posts :