మూడు రాజధానుల రగడ, సేఫ్‌గా బయటపడేలా పవన్ వ్యూహం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏపీలో మూడు రాజధానుల విషయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొత్త ట్విస్ట్‌ ఇచ్చారు. అమరావతి విషయంలో ఆ ప్రాంత పరిధిలోని టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ, వైసీపీకి చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. వారికి చిత్తశుద్ధి ఉంటే పదవులను వదులుకుని ప్రత్యక్ష పోరాటంలోకి రావాలన్నారు. అంత వరకూ బాగానే ఉన్నా.. పవన్‌ డిమాండ్‌ వెనుక పెద్ద కారణమే ఉందంటున్నారు. మూడు రాజధానుల విషయంలో ఓ ప్రాంతానికి అనుకూలంగా వ్యవహరిస్తే మరో ప్రాంతంలో ఇబ్బంది తప్పదు. దీంతో ఈ విషయంలో తాను తప్పించుకొని, అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చిచ్చు పెడితే బెటర్‌ అన్న ఆలోచనతోనే ఈ వాదన ముందుకు తీసుకొచ్చారని అంటున్నారు.

రాజధాని వికేంద్రీకరణ పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు:
రాజధాని వికేంద్రీకరణ పేరిట మూడు ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతున్నారన్నది పవన్‌ కల్యాణ్‌ విమర్శ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రెండు రోజుల క్రితం ఆమోదం తెలిపారు. దీంతో మూడు రాజధానులకు రూట్ క్లియర్ అయింది. గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం రాజధాని వికేంద్రీకరణ వెంటనే అమల్లోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి అది అమలవుతుంది. ఇది ఒకేసారి అమల్లోకి వస్తుంది.

ఈ బిల్లు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ అమరావతిలో కొలువవుతుంది. రాజ్ భవన్, సచివాలయం, హెచ్ఓడీల కార్యాలయాలు కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో ఉంటాయి. జ్యుడీషియల్ రాజధానిగా కర్నూలు ఉంటుంది. హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చొరవ చూపుతుంది. ఏ కార్యాలయాలు ఎక్కడ ఉండాలి, అందుకు కారణాలు ఏంటనే అంశాన్ని ప్రభుత్వం రాతపూర్వకంగా తెలియజేస్తుంది.

తెరపైకి రాజీనామాల పర్వం:
మరోపక్క, మూడు రాజధానులకు వ్యతిరేకంగా, అమరావతికి మద్దతుగా టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపారు. స్పీకర్ ఫార్మాట్‌లో శాసనమండలి చైర్మన్‌కు పంపుతానని చెప్పారు. అమరావతికి మద్దతుగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేస్తున్నారు. ఇక వైసీపీలోని ఓ వర్గం మూడు రాజధానుల మీద అసంతృప్తితో ఉందని, రాజీనామాల గురించి ఓ సీక్రెట్ సమావేశంలో చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో పవన్‌ కూడా ఈ రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు రాజీనామాకు డిమాండ్‌ చేయడంతో రాజకీయాల్లో వేడి మొదలైంది.

తప్పించుకోవడానికి పవన్ ప్లాన్ ఇదే:
ఈ విషయంలో పవన్‌ పూర్తి స్థాయిలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని చెప్పలేని పరిస్థితి ఉంది. అలా చేస్తే విశాఖలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇది తనకు, తన పార్టీకి శ్రేయస్కరం కాదు. ఈ అంశాన్ని వైసీపీ, టీడీపీల పైకి నెట్టేస్తే తాము సేఫ్‌ కావచ్చనే అంచనాలో ఉన్నారని అంటున్నారు.

దమ్ముంటే, మళ్లీ ఎన్నికలు పెట్టండి:
టీడీపీ ఇప్పటికే అమరావతినే రాజధానిగా చెబుతోంది. అసెంబ్లీని రద్దు చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని సవాల్‌ విసురుతోంది. వైసీపీ మాత్రం అదంతా అవసరం లేదని విశాఖలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్తే తేలిపోతుందని అంటోంది. రాష్ట్రంలోని పార్టీలన్నీ రాజకీయాలు జోరుగా సాగిస్తున్నాయి. విశాఖలో తమకు మద్దతు లభిస్తుందని వైసీపీ భావిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తమకు మద్దతు ఉంటుందని టీడీపీ ఆశిస్తోంది. రైతుల కోసం తాము అండగా నిలబడుతున్నామని చెప్పుకోవడం ద్వారా లబ్ధి పొందారు జనసేన భావిస్తోంది.

తమకు ప్లస్ అవుతుందని పవన్ అంచనా:
ఎవరి రాజకీయ ఆలోచనల్లో వారున్నారు. పవన్‌ మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించేందుకు వీలుగా అంశాన్ని వైసీపీ, టీడీపీల మీదకే వదిలేశారు. ఆయన డిమాండ్‌ను వైసీపీ పట్టించుకొనే అవకాశం లేదు. అప్పుడు కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఆ పార్టీకి ఎఫెక్ట్‌ పడుతుందన్నది జనసేన అంచనా. వైసీపీ నేతలు రాజీనామా చేయకుండా టీడీపీ ముందుకొచ్చే అవకాశాలుండవు. దీంతో ఈ విషయంలో తమకు ప్లస్‌ అవుతుందని పవన్‌ భావిస్తున్నారట. రాబోయే రోజుల్లో మూడు రాజధానుల రాజకీయం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనని జనాలు అనుకుంటున్నారు.

Related Posts