టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కోడలి పదవి కష్టాలు, సొంత పార్టీ నేతలతోనే పొంచి ఉన్న ప్రమాదం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆయన రెండుసార్లు ఎమ్మెల్యే. అది కూడా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే. రెండోసారి పార్టీలోనే వ్యతిరేకత ఉన్నప్పటికీ పార్టీ వేవ్ లో నెగ్గుకొచ్చేశారు. ఆ నియోజకవర్గంలో ఉన్న నాయకులు కూడా ఎమ్మెల్యే రేంజ్ ఉన్నవారే. వాళ్లందరికి ఎమ్మెల్యే తీరు నచ్చడం లేదు. తన రాజకీయ వారసురాలిగా కోడలిని మున్సిపల్ పీఠంపై కూర్చోపెట్టి ఇబ్బందుల్లో పడ్డారు. ఏదో ఒకటి చేసి ఆమెని దించేద్దామని వ్యతిరేక వర్గం పని చేస్తుంటే, దాన్ని అడ్డుకునే పనిలో ఎమ్మెల్యే ఉన్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే?

పెద్దపల్లి టీఆర్ఎస్‌లో వర్గపోరు:
తెలంగాణలోని పెద్దపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌దే ఆధిపత్యం. కాకపోతే ఇక్కడ వర్గ పోరు స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి ఇబ్బందికరంగా మారిందంటున్నారు. ఇంటిపోరుతో ఆయనే కాదు పార్టీకి కూడా ఇబ్బందిగా ఉంది. పార్టీలో ఉన్న నాయకులంతా… అవకాశం వస్తే ఏకంగా ఎమ్మెల్యే సీటు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేసేవారే. దీంతో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్లేందుకు కిందా మీదా పడుతున్నారు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి. ఇలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూనే రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

అనూహ్యంగా కోడలిని తెరపైకి వచ్చిన ఎమ్మెల్యే:
తన కనుసన్నల్లోనే పెద్దపల్లి రాజకీయలు జరగాలని మనోహర్ రెడ్డి భావిస్తున్నారట. దీనిని ద్వితీయ శ్రేణి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో వారంతా ఎమ్మెల్యేను పక్కన పెట్టేసి మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, జడ్పీ చైర్మన్ పుట్ట మధులకు సన్నిహితంగా మెలగుతున్నారని టాక్‌. వారంతా కలసి లోకల్‌ పాలిటిక్స్‌ చేస్తూ ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డికి తలనొప్పులు సృష్టిస్తున్నారట. ఎమ్మెల్యే తన కొడుకును రాజకీయ వారసుడిగా తీసుకువస్తారని చాలా రోజులుగా ప్రచారం సాగుతున్నప్పటికీ కుదరడం లేదట. దీంతో ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్యంగా కోడలు మమతారెడ్డిని తెరపైకి తీసుకొచ్చారని చెబుతున్నారు.

ఇప్పుడు అదే మైనస్ గా మారింది:
మునిసిపల్‌ చైర్మన్ పదవికి రిజర్వేషన్ కలసి రావడంతో తన కోడలిని పోటీలోకి దించారు. ఏకగ్రీవంగా కౌన్సిలర్‌గా ఎన్నికయ్యేలా చేసి తన పలుకుబడితో మున్సిపల్ చైర్‌పర్సన్‌ సీట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు అదే ఆయనకు మైనస్‌గా మారుతుందని పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెబుతన్నారు. కోడలిని కీలకమైన స్థానంలో కూర్చో బెట్టడం ఆ కుర్చీని ఆశించిన వారికి నచ్చడం లేదంట. ఇప్పుడు మున్సిపాలిటీలో జరిగే పనుల్లో సైతం ఎమ్మెల్యే జోక్యం పెరగుతుండడంతో పార్టీలో అంతర్గతంగా గొడవలకు కారణమవుతుందని అంటున్నారు.

Telangana Polls: TRS Ahead in 7 Seats in Early Trends | India.com

మున్సిపల్ చైర్ పర్సన్ కనిపించడం లేదని కలెక్టర్ కు సొంత పార్టీ నేత ఫిర్యాదు:
కరోనా సమయంలో అధికార పార్టీ నేతలంతా ప్రజల్లోకి వెళ్లి వారిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తే…. మున్సిపల్ చైర్‌పర్సన్‌ మాత్రం కనిపించడం లేదంటూ కలెక్టర్‌కు మాజీ చైర్మన్ రాజయ్య ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలే అధికార పార్టీ చైర్‌పర్సన్‌పై ఫిర్యాదు చేయడం వెనుక ఆధిపత్య పోరే కారణమని అంటున్నారు. ఈ క్రమంలో రాజయ్యపై అనుహ్యంగా పోలీసులు రెండు కేసులు నమోదు చేయడంతో… ఇదంతా ఎమ్మెల్యే కుట్ర అంటూ రాజయ్య కస్సుబుస్సులాడుతున్నారు. ఎమ్మెల్సీ భానుప్రసాదరావు మొదట ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోసారి అవకాశం కోసం ప్రయతిస్తూనే ఉన్నారు. సీనియర్ నాయకులు ఈద శంకర్ రెడ్డి, రాజయ్య, నల్ల మనోహర్ రెడ్డి.. ఇలా నేతలంతా ఎమ్మెల్యేగా పోటీ పడేందుకు ఉత్సాహం చూపిస్తున్నవారే. మరి పార్టీలో ఈ పోటీని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారో చూడాలని ఆయన వర్గానికి చెందిన వారు అంటున్నారు.

READ  ఎన్నికల కసరత్తు : ఈసీ అఖిల‌ప‌క్ష స‌మావేశం

Related Posts