Home » కోర్టు ధిక్కరణ : రూపాయి జరిమానా కట్టేందుకు సిద్ధం…ప్రశాంత్ భూషణ్
Published
5 months agoon
కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. ఒక రూపాయి జరిమానా చెల్లించాలని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ(ఆగస్టు-31,2020)ఉదయం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. న్యాయవ్యవస్థ పనితీరును ప్రశ్నించిన కేసులో దోషిగా తేలిన ప్రశాంత్ భూషణ్.. క్షమాపణ చెప్పేందుకు నిరాకరించిన నేపథ్యంలో సోమవారం తుది తీర్పును వెల్లడించిన అత్యున్నత న్యాయస్థానం సీనియర్ అటర్నీ జనరల్ విజ్ఞప్తి మేరకు ప్రశాంత్ భూషణ్ కు ఒక్క రూపాయి జరిమాన విధించింది. సెప్టెంబర్ 15 నాటికి ఒక రూపాయిని కోర్టుకు డిపాజిట్ చేయాలని, డిపాజిట్ చేయకపోతే 3 నెలల జైలు శిక్ష, 3 ఏళ్ల పాటు ప్రాక్టీస్‌పై నిషేధం ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
కాగా, తనకు న్యాయస్థానంపై అపారమైన నమ్మకం ఉందని, సుప్రీం కోర్టు విధించిన ఒక రూపాయ జరిమానా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రశాంత్ భూషణ్ తెలిపారు. ఈ మేరకు తన లాయర్, సీనియర్ కొలీగ్ రాజీవ్ ధవన్ తనకు ఒక రూపాయి ఇచ్చారని ట్విటర్ ద్వారా ప్రకటించారు. రాజీవ్ ధవన్ తో దిగిన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. కాగా,ప్రశాంత్ భూషణ్ ఒక రూపాయి కాయిన్ చేతిలో పట్టుకుని దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గతంలో ట్విటర్లో ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తికి, ఆయనకు ముందు సీజేఐలుగా ఉన్న మరో నలుగురి గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని, ఇవి కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని ఇటీవల సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఇది కోర్టు ధిక్కరణకు సంబంధించిన తీవ్రమైన విషయం అని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవి, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.
ప్రశాంత్ భూషణ్‌ను దోషిగా ఈనెల 14న జస్టిస్ అరుణ్ మిశ్రా ఆధ్వర్యంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రకటించింది. రివ్యూ పిటిషన్ దాఖలు చేసి, దానిపై కోర్టు ఒక నిర్ణయానికి వచ్చేంత వరకూ తనకు వేసే శిక్షకు సంబంధించిన విచారణను వాయిదా వేయాలని ప్రశాంత్ భూషణ్ కోరారు. ఆ విజ్ఞప్తిని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోనే బెంచ్ తోసిపుచ్చింది.
కోర్టు శిక్ష విధించాలనుకుంటే ఎలాంటి శిక్షనైనా నవ్వుతూ భరిస్తాను’ అని మహాత్మాగాంధీని ఉటంకిస్తూ ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డట్టు భావించిన నా ట్వీట్లు… నా బాధ్యత. ఇంకేం కాదు. వాటిని వ్యవస్థను మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా చూడాలి. నేను రాసినది నా వ్యక్తిగత అభిప్రాయం. నా విశ్వాసాలు, అభిప్రాయాలను వ్యక్త పరిచే హక్కు నాకు ఉంది అని ప్రశాంత్ భూషణ్ అన్నారు. బేషరతుగా క్షమాపణలు చెప్పేందుకు సమయమిచ్చినా ఆయన నిరాకరించడం వల్ల చివరకు రూ. 1 జరిమాన విధిస్తూ సుప్రీం తీర్పును వెలువరించింది.
My lawyer & senior colleague Rajiv Dhavan contributed 1 Re immediately after the contempt judgement today which I gratefully accepted pic.twitter.com/vVXmzPe4ss
— Prashant Bhushan (@pbhushan1) August 31, 2020