లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

పిఠాపురంలో ఎమ్మెల్యే పీఏదే రాజ్యం..!

Published

on

ఒకరేమో ఎమ్మెల్యే. మరొకరేమో ఎంపీ. ఇద్దరూ అధికారపార్టీ ప్రజాప్రతినిధులే. ఎమ్మెల్యే గారి అవినీతి, అక్రమాలపై స్వపక్ష నేతలే రచ్చ చేస్తుంటే… ఇటీవల ఎమ్మెల్యేగారి పీఏ ఓవరాక్షన్‌పైనా విమర్శలొస్తున్నాయి. సీన్‌ కట్‌ చేస్తే ఆ శాసనసభా నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పోటీకి తదేక దృష్టి కేంద్రీకరించారట ఎంపీగారు. ఈ క్రమంలో జరుగుతున్న రాజకీయాలేంటో తెలుసుకోవాలంటే పిఠాపురం నియోజకవర్గం వెళ్లి రావాల్సిందే. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, కాకినాడ ఎంపీగా వంగా గీత ఆప్యాయంగా అన్నాచెళ్లెల్ల మాదిరి పలకరించుకుంటారు.

కానీ ఇదంతా పైకి కనిపించే ఆప్యాయత మాత్రమేనని ఓ టాక్‌ వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఫ్యాన్‌ గాలి, నాటి టీడీపీ ఎమ్మెల్యే వర్మపై ఉన్న వ్యతిరేకతకు తోడు తనకున్న మంచితనంతో పెండెం దొరబాబు ఈజీగా విజయం సాధించారు. కానీ ఇప్పడదే మంచిపేరు కనుమరుగైపోతున్నా దొరబాబు పట్టించుకునే స్థితిలో లేరని పార్టీ శ్రేణులే వాపోతున్నాయట. సమస్యలపై పోరాటం చేసిన అనుభవంతో అందలమెక్కిస్తే …అభివృద్ధి మంత్రం జపిస్తాడనుకున్నాం కానీ.. తమకే అందుబాటులో లేకుండా ఉంటారనుకోలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి కేడర్‌ నుంచి. ఎమ్మెల్యే అయ్యాక దొరబాబు గారు ప్రజలు, కార్యకర్తలకే కాదు…తన సొంత వర్గానికి కూడా దూరం కావడం జరిగిందనే టాక్‌ గట్టిగా వినిపిస్తోంది.

ఎమ్మెల్యే పెండెం దొరబాబుపై కార్యకర్తలు బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కిన సందర్భాలుయి. గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామ సమీపంలోని పోలవరం కాలువ గ్రావెల్‌ తవ్వకంలో పెద్ద రగడ జరగడంతో దొరబాబు గారి ఇమేజ్‌ మరింత డ్యామేజ్‌ అయ్యింది. జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీచేసిన వైసీపీ నేత పిల్ల బుల్లి బాబ్జి… గ్రామస్తులతో కలిసి గ్రావెల్‌ తవ్వకాలను ఆపే యత్నం చేయడం అరెస్ట్‌లకు దారి తీసింది. పలువురు రైతులను గొల్లప్రోలు పోలీసులు అరెస్ట్‌ చేసి సొంతపూచీకత్తుపై వదిలారు. పిఠాపురం ఎమ్మెల్యే వల్లే తనకు ప్రాణాపాయం ఉందని ఓ సెల్ఫీ వీడియోను బుల్లి బాబ్జి సోషల్‌ మీడియలో పోస్ట్‌ చేయడంతో అధికార పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి.

అక్రమంగా తరలించుకుపోతున్న గ్రావెల్‌ను అడ్డుకుంటే… ఎమ్మెల్యే పీఏ చక్రీ బంధువులు ఫోన్లలో బెదిరిస్తున్నారని, తనపై తప్పుడు కేసులు బనాయించేందుకు ఎమ్మెల్యే రంగం సిద్ధం చేశారని ఆ వీడియోలో ఆరోపించారు బాధితుడు. 11 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీపై పోరాటం చేశానని, ఇప్పుడు అధికారపక్షంలో ఉండి కూడా ఎమ్మెల్యేపై పోరాటం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేయడం.. తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేకెత్తించింది.

కరోనా ఎఫెక్ట్‌తో అందరికీ ఎమ్మెల్యే దూరంగా ఉంటున్న సమయంలో …ఇదే మంచి సమయం అనుకున్నాడో ఏమో కానీ పీఏ చక్రి రచ్చ రచ్చ చేస్తున్నాడట. తానే ఎమ్మెల్యేననే రీతిలో బిల్డప్‌ ఇస్తుండేసరికి నియోజకవర్గ ప్రజలు విస్తుపోతున్నారట. వైసీపీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారట. అధికారులయితే బెంబేలెత్తిపోతున్నారట. తన స్వంత నిర్ణయాలను అమలుచేసేందుకు ఎమ్మెల్యే ఆదేశించారంటూ కలరింగ్‌ ఇస్తున్నాడట పీఏ. ఇష్టారాజ్యంగా సూచనలు ఇస్తున్న పీఏ తీరుతో అధికారులు విసిగిపోతున్నారట. తాను చెప్పినమాట వినకపోతే హుంకరిస్తున్నాడట. అప్పటికీ పట్టించుకోని అధికారులపై ఎమ్మెల్యే పీఏ నోటికొచ్చినట్లు విరుచుకుపడుతున్నాడట. అయినా సరే ఎమ్మెల్యే సార్‌.. లైట్‌ తీసుకుంటున్నారట. పీఏ చక్రికి అంత చనువు ఎమ్మెల్యే ఎందుకు ఇస్తున్నాడంటూ చర్చించుకుంటున్నారు పిఠాపురం ప్రజలు.

అధికారపార్టీ ఎమ్మెల్యే అవినీతి ఆరోపణల విషయానికి వస్తే చాంతాడంత లిస్టునే ప్రస్తావించాల్సి ఉంటుందని చెవులు కొరుక్కుంటున్నాయి వైసీపీ శ్రేణులు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే వర్మపై ఏ ఆరోపణలయితే చేశారో ఇప్పుడవే ఆరోపణలు దొరబాబుపైనే వినిపిస్తున్నాయి. గ్రావెల్‌, మట్టి తవ్వకాలు, ఇళ్ల స్థలాల కోసం భూసేకరణలో భారీ అవతవకలు జరిగాయని కోడై కూస్తున్నారు పార్టీ కార్యకర్తలు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోనే పిఠాపురం శాసననసభ నియోజకవర్గం ఉండడంతో…ఇక్కడేం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఎంపీ వంగా గీత ఓ కన్నేసి ఉంచారట.

2009 ఎన్నికల్లో ఇదే సెగ్మెంట్‌ నుంచి ప్రజారాజ్యం పార్టీ టికెట్‌పై పోటీ చేసి అసెంబ్లీకి వెళ్లారు గీత. తర్వాత కాలంలో వైసీపీలో చేరాక ఈ నియోజకవర్గ ప్రజలతో ఇప్పటికీ అదే ఆత్మీయ అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. గత ఎన్నికల్లో పిఠాపురం టికెట్‌ లభిస్తుందని ఆశించారు కానీ.. కాకినాడ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవాల్సి వచ్చింది. జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌, రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్యే, లోక్‌సభ ఎంపీ అన్ని పదవులూ అలంకరించినా రాష్ట్ర మంత్రి చేపట్టలేదనే వెలితి వేధిస్తోందట గీతను.

మంత్రి పదవిపై ఆశ బలంగా ఉండడంతో.. పిఠాపురంపై మరింత పట్టు పెంచుకునేందుకు ఏవేం చేయాలో అవన్నీ చేస్తూ వస్తున్నారట. లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లు ఉన్నా… పిఠాపురం నియోజకవర్గానికే ప్రత్యక స్థానం కల్పిస్తున్నారట. కేంద్ర ప్రభుత్వం పథకాల అమలు, నిధులు కేటాయింపు విషయంలో ఈ నియోజకవర్గానికే ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారట. ఇదంతా వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే చేస్తున్నారట. పిఠాపురం టికెట్‌ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి దక్కించుకోవచ్చనేది ఎంపీ గీత గారి మాస్టర్‌ ప్లాన్‌ అని వేరే చెప్పాలా?

సౌమ్యుడు, పార్టీకి విధేయుడు అనుకున్న పెండెం దొరబాబు, అతని పీఏ వ్యవహారశైలి ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. అందరికీ ఎమ్మెల్యే అందుబాటులో ఉండని సమయంలో పిఠాపురంలోనే క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటున్నారు ఎంపీ. ఎక్కడైనా ఆధిపత్యం కోసం కాలు దువ్వుకునే నేతలను చూస్తుంటాం కానీ.. ఇక్కడ ఎమ్మెల్యేపై వ్యతిరేకత పెరిగే కొద్దీ మస్త్‌ ఎంజాయ్‌ చేస్తోందట ఎంపీ వర్గం. దొరబాబుపై వ్యతిరేకత పెరిగేకొద్దీ అసెంబ్లీ టికెట్‌ గ్యారెంటీ అని భావిస్తున్నారట. చూద్దాం మరి…ఎమ్మెల్యే మారతారో. ఎంపీ గారి ఆశ నెరవేరుతుందో!

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *