విజయవాడ కరోనా సెంటర్‌లో అగ్నిప్రమాద ఘటనపై సీఎం జగన్‌కు ప్రధాని ఫోన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ.. ఏపీ సీఎం జగన్‌కు ఫోన్‌ చేశారు. అగ్నిప్రమాద వివరాలను సీఎంను అడిగి తెలుసుకున్నారు. రమేష్ అనే ప్రైవేటు హాస్పిటల్‌ హోటల్‌ను లీజుకు తీసుకుని కొవిడ్ సెంటర్ నిర్వహిస్తోందని, అందులో కరోనా పేషెంట్లను ఉంచిందని, ఆదివారం (ఆగస్టు 9,2020) తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించిందని ప్రధానికి తెలిపారు సీఎం జగన్. అధికారులు వెంటనే సహాయక చర్యలను చేపట్టారని, దురదృష్టవశాత్తూ కొంతమంది మృత్యువాత పడ్డారని వివరించారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా ఇదివరకే అధికారులను ఆదేశించామన్నారు. బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటున్నామన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం కూడా ప్రకటించామని ప్రధానికి సీఎం జగన్ తెలిపారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

రమేష్‌ ప్రైవేట్ ఆసుపత్రి కొవిడ్‌కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తున్న హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌లో ఆదివారం (ఆగస్టు 9,2200) తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9మంది చనిపోయారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని వేరే ఆసుపత్రులకు తరలించారు. కాగా, లోపల మరికొన్ని మృతదేహాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. 15మంది కరోనా బాధితులను సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. రమేష్ ప్రైవేట్ ఆసుపత్రి స్వర్ణ ప్యాలెస్ ని అద్దెకు తీసుకుని కరోనా సెంటర్ గా వినియోగిస్తున్నారు.

ప్రమాద సమయంలో ప్యాలెస్ లో 40మంది:
ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమంచి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో ప్యాలెస్ లో మొత్తం 40మంది వరకు ఉన్నట్టు సమాచారం. వీరిలో 30మంది కొవిడ్‌ బాధితులు కాగా 10మంది ఆసుపత్రి సిబ్బంది. దట్టంగా అలుముకున్న పొగ వల్ల బాధితులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ కిటికీల్లోంచి కేకలు వేశారు. బాధితులను లబ్బీపేట, మెట్రోపాలిటన్‌ హోటల్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు తరలించారు.

READ  ప్రజా క్షేమం కోరుతూ పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష

ఒకటో అంతస్తు నుంచి దూకిన నలుగురు:
అగ్నిప్రమాదంతో పొగలు దట్టంగా వ్యాపించాయి. దీంతో భవనంలో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌, మొదటి అంతస్తుల్లో మంటలు అలముకున్నాయి. ఇతర అంతస్తులకు పొగలు వ్యాపించాయి. ప్రాణ భయంతో ఒకటో అంతస్తు నుంచి నలుగురు వ్యక్తులు కిందకి దూకేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కిటికీ అద్దాలను పగలగొట్టి నిచ్చెన సాయంతో పలువురిని కిందికి తీసుకొచ్చారు.

షార్ట్‌ సర్క్యూట్‌తోనే ప్రమాదం:
తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుందని.. షార్ట్‌సర్క్యూట్‌తోనే మంటలు చెలరేగినట్లు విజయవాడ సీపీ శ్రీనివాసులు తెలిపారు. బాధితులను భవనంలోని మెట్ల మార్గం ద్వారా తీసుకురావడం కుదరలేదని చెప్పారు. దీంతో నిచ్చెనల ద్వారా బాధితులను కిందికి దించి ఇతర ఆస్పత్రులకు తరలించినట్లు వెల్లడించారు.

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం, మంత్రి వెల్లంపల్లి:
విషయం తెలిసిన వెంటనే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకున్నారు. బాధితుల ఆరోగ్యం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

అక్కడే ఉండి సహాయక చర్యలకు సంబంధించి అధికారులకు సూచనలు సలహాలు అందించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులతో చెప్పారు. ప్రమాదానికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఘోరమైన అగ్నిప్రమాదం జరిగిందని విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఘటనపై ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి దర్యాఫ్తు చేస్తామన్నారు.

Related Posts