Home » వారణాసికి ప్రధాని మోడీ.. సిక్స్ లేన్ హైవే ప్రారంభోత్సవం!
Published
2 months agoon
By
sreehariPM Narendra modi to tour Varanasi :భారత ప్రధాని నరేంద్రమోదీ వారణాసిలో పర్యటించనున్నారు. ఇప్పటికే సెక్యూరిటీ అధికారులు మోదీ పర్యటించే ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. వారణాసి-ప్రయాగ్‌రాజ్ సిక్స్ లేన్ హైవేను మోడీ ప్రారంభించనున్నారు.
73 కిలోమీటర్ల పొడవు గల ఈ హైవేను 2,447 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ హైవే ప్రారంభంతో ప్రయాగ్‌రాజ్, వారణాసి మధ్య రోడ్డు ప్రయాణం గంటసేపు తగ్గనుంది. నేడు కార్తీక పౌర్ణమి కావడంతో వారణాసిలో దేవ్ దీపావళి వేడుకలను మోడీ ప్రారంభించనున్నారు.
కార్తీక పౌర్ణమి నాడు దేవ్ దీపావళి పండుగను జరుపుకుంటారు. గంగానదికి ఇరువైపులా 11 లక్షల దీపాలను వెలిగించనున్నారు. మొదటి దీపాన్ని ప్రధాని మోడీ వెలిగించి ఈ వేడుకను ప్రారంభిస్తారు. ఇక ఇదే పర్యటనలో కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్ ప్రాజెక్టును సైతం మోడీ సందర్శించనున్నారు.
అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చాయన్న విషయాలను అడిగి తెలుసుకుంటారు. మరోపక్క కొద్ది రోజుల క్రితం మోడీ ప్రారంభించిన సార్నాద్ ఆర్కియాలాజికల్ సైట్లో జరిగే లైట్ అండ్ సౌండో షోలో కూడా ఆయన పాల్గొంటారు.
ఆ మూడు సంస్థలతో మోడీ భేటీ :
కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధిలో పాలుపంచుకున్న మరో మూడు సంస్థలతో ప్రధాని నరేంద్రమోడీ సోమవారం మాట్లాడనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. జెన్నోవా బయోఫార్మా, బయోలాజికల్ ఈ, డాక్టర్ రెడ్డిస్ సంస్థలతో ప్రధాని మోడీ మాట్లాడనున్నారు..
ఈ సంస్థలతో కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో పురోగతి, సవాళ్లు, పంపిణీ అంశాలపై ప్రధాని మోదీ చర్చించనున్నారు. కరోనా వ్యాక్సిన్ పనుల్లో పురోగతిపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించారు. పలు కంపెనీలు తయారు చేస్తున్న వ్యాక్సిన్ల కరోనా అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రధాని మోడీ.. దేశంలోని వ్యాక్సిన్ అభివృద్ధి సంస్థలతో భేటీ అవుతున్నారు.
రష్యన్ తయారీ స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ స్టేజ్ 2, స్టేజ్ 3 ట్రయల్స్‌ని రెడ్డీస్ సంస్థ చేపడుతోంది. బయోలాజికల్ ఈ, జెన్నోవా బయో ఫార్మా సంస్థలకు వ్యాక్సిన్ ట్రయల్స్‌కి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇటీవల అనుమతి ఇచ్చింది. అంతకుముందు వ్యాక్సిన్ టీకా పనులను పరిశీలించేందుకు దేశంలోని మూడు నగరాల్లో సుడిగాలి పర్యటన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.
ఒకే రోజు అహ్మదాబాద్, హైదరాబాద్, పుణెల్లో పర్యటించారు. కరోనా టీకాలను అభివృద్ధి చేస్తున్న జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్, సీరం సంస్థలను సందర్శించి.. వ్యాక్సిన్ ప్రయోగాల పురోగతిపై స్వయంగా సమీక్ష జరిపారు. వ్యాక్సిన్లు ఏఏ దశల్లో ఉన్నాయని స్వయంగా పరిశీలించారు. అక్కడి శాస్త్రవేత్తలతో మాట్లాడారు.