ప్రధాని ప్రకటించిన ప్యాకేజీ ఓ క్రూరమైన జోక్...విపక్షాల మీటింగ్ లో సోనియా

PM's Package "Cruel Joke On Country": Sonia Gandhi At Opposition Meet

ప్రధాని మంత్రి ప్రకటించిన 20లక్షల కోట్ల ఆత్మనిర్భర ప్యాకేజీపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా సెటైర్లు వేశారు. ప్రధాని ప్రకటించిన,నిర్మలా సీతారామన్ వివరించిన 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ దేశంపై ఓ క్రూరమైన జోక్ లా సోనియా సెటైర్లు వేశారు.ముందు చూపు లేని లాక్‌డౌన్ ఆంక్షల వల్ల అనేక మంది జీవనోపాది కోల్పోయారని, మోడీ ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీ ద్వారా వారికి ఎలాంటి మేలు జరుగుతుందని ఆమె సూటిగా ప్రశ్నించారు.

కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం(మే-22,2020) మధ్యాహ్నం జరిగిన విపక్షాల ఆన్ లైన్ మీటింగ్ జరిగింది. మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడతో పాటు, యూపీఏ కూటమిలోని ప్రధాన పార్టీల నేతలు ఈ మీటింగ్ కు హాజరయ్యారు. ఎన్సీపీ అధినేత శరద్ పవర్, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, డిఎంకే అధినేత ఎం.కే.స్టాలిన్, ఉమర్ అబ్దుల్లా, సీతారామ్ ఏచూరీ, ప్రొ.కోదండరామ్ తదితరులు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మీటింగ్ లో పాల్గొన్నారు. విపక్షాల సమావేశానికి ముందుగా ఊహించినట్టే మూడు ప్రధాన విపక్ష పార్టీలు గైర్హాజరయ్యాయి. సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఈ మీటింగ్ కు దూరంగా వున్నాయి.

ఈ సందర్భంగా బీజేపీ, కేంద్ర ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఘటు విమర్శలు చేశారు. మొత్తం అధికారం ఇప్పుడు PMO ఆఫీసులోనే కేంద్రీకృతమైందని సోనియా విమర్శించారు. కరోనాను ఎదుర్కోవడంలో మోడీ ప్రభుత్వానికి ఓ స్పష్టమైన విధానమంటూ లేదని సోనియా ఆరోపించారు. ఎలాంటి సంసిద్దత లేకుండా లాక్‌డౌన్ అమల్లోకి తేవడం, దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక మోడీ ప్రభుత్వం అయోమయ విధానాలను తెరమీదకు తీసుకొచ్చిందని సోనియా గాంధీ విమర్శించారు.

మార్చి 24 వ తేదీన కేవలం 4 గంటల వ్యవధిలో లాక్‌డౌన్ ప్రకటించారని, ఎలాంటి సంసిద్ధత లేకుండా లాక్‌డౌన్ అమల్లోకి తెచ్చారని, అయినా సరే ప్రభుత్వానికి విపక్షాలు మద్ధతు ప్రకటించాయని గుర్తు చేసారు. 21 రోజుల మొదటి విడత లాక్‌డౌన్‌తో సత్ఫలితాలు వస్తాయని ఆశించినా అలా జరగలేదని, కేవలం స్వీయ నియంత్రణ కఠినంగా అమలు చేస్తే వ్యాక్సిన్ కనిపెట్టే వరకు ప్రజలు సురక్షితంగా ఉండే వారని సోనియా అభిప్రాయపడ్డారు. వరుస లాక్‌డౌన్లు తీవ్ర దుష్ఫలితాలను అందించాయని సోనియా ఆవేదన వ్యక్తం చేసారు.

కరోనా మహమ్మారికి తోడు లాక్‌డౌన్ ఆంక్షల వలస కూలీలు బ్రతుకులు ఛిద్రమైపోయాయని, వారి సమస్యలకు బాద్యులు ఎవరని ప్రశ్నించారు. వారితో పాటు 13 కోట్ల మంది రైతులు, చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని సోనియా గాంధీ తెలిపారు. కరోనా వైరస్ కట్టడికి బీజేపి ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలు ఆమోదయోగ్యంగా లేవని, నిరుపేదలు, వలస కార్మికులు, దినసరి వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని ఈ సందర్భంగా విపక్ష పార్టీల నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
 

మరిన్ని తాజా వార్తలు