కరోనా కట్టడికి పోలీసులు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు : ఏపీ డీజీపీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కరోనా కేసులు పెరిగాయని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వల్లే విపరీతంగా వ్యాప్తి పెరిగిందని పేర్కొన్నారు. మంగళవారం (జులై 14, 2020) ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు స్పందనలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. చెక్‌పోస్టు వద్ద అనుమతి పత్రాలు చెక్ చేసిన తర్వాతే ఏపీలోకి అనుమతిస్తామని తెలిపారు. నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

ఆపరేషన్ ముస్కాన్ కరోనా ద్వారా బాల కార్మికులు, వీధి బాలలపై కూడా దృష్టిపెట్టామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలను సమన్వయ పరుచుకుంటూ సీఐడీ ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తుందన్నారు. వారం రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్ సాగుతుందని వెల్లడించారు. వీధి బాలలు, బాల కార్మికులను గుర్తించి కోవిడ్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపారు. అవసరమైతే ఆసుపత్రులకు తరలిస్తామని చెప్పారు.

తల్లిదండ్రులు లేని పిల్లలను సంరక్షణా కేంద్రాలకు పంపుతామని తెలిపారు. ప్రభుత్వ చొరవతో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా గతేడాది 2500 మంది పిల్లలను రెస్క్యూ చేశామని వెల్లడించారు. పిల్లలు, మహిళల సంరక్షణతో పాటు విశాఖ ఘటనలపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని డీజీపీ తెలిపారు.

కరోనా కట్టడికి పోలీసులు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారని కొనియాడారు. కరోనా బారినపడుతున్నా ధైర్యంగా ప్రజారోగ్యం కోసం పాటు పడుతున్నారని ఆయన అభినందించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పని చేస్తున్న సిబ్బంది పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. లాక్ డౌన్ తర్వాత నలభై రోజుల్లో 800 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారని వెల్లడించారు.

Related Posts