police arrest bandi sanjay

బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ అరెస్ట్‌

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం(జూన్ 22,2020) కోఠిలోని

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం(జూన్ 22,2020) కోఠిలోని కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ముట్టడించేందుకు యత్నించిన ఆయను పోలీసులు అరెస్ట్ చేశారు. బండి సంజయ్ తో పాటు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణ విషయంలో ప్రభుత్వం తీరు సరిగా లేదన్నారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలు భర్తీ చేయాలన్నారు. తెలంగాణలో కరోనా కట్టడిలో ప్రభుత్వ విఫలమైందంటూ సోమవారం బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. కరోనా వైరస్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని.. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్‌లో చేరాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ప్రశ్నిస్తే అరెస్టులు:
టీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని బండి సంజయ్ మండిపడ్డారు. పక్క రాష్ట్రాల్లో ఎన్ని టెస్టులు చేశారు, తెలంగాణలో ఎన్ని చేశారో చెప్పాలన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎక్కడిక్కడ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహించారు. డాక్టర్లకు కనీస సౌకర్యాలు కరువయ్యాయని ఆరోపించారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరినా పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని పిలుపు ఇచ్చామన్నారు.

కరోనా కట్టడి చర్యలపై మాటల యుద్ధం:
తెలంగాణలో కరోనా కట్టడి చర్యలు, టెస్టుల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. కరోనాను కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని.. టెస్టులు చేయకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయనపై తెలంగాణ మంత్రుల, టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రాజకీయాలు చేయాలని చూడటం సరికాదని ఈటెల, హరీష్ రావు హితవు పలికారు. జేపీ నడ్డా వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా మాట్లాడారని మండిపడ్డారు.

రాష్ట్రాలను విమర్శించడం రాజనీతా..?
మానవాళి మనుగడకే సవాలుగా మారిన కరోనా వైరస్ విషయంలో రాజకీయాలు చేయడం దేశ భద్రత విషయంలో చులకనగా మాట్లడడంతో సమానం అని హరీష్ రావు అన్నారు. ”సైనికుల స్థైర్యం దెబ్బతీస్తుందని ఉద్బోదిస్తారు. మరి కరోనా విషయంలో రాష్ట్రాలను విమర్శించడం రాజనీతి అవుతుందా? దేశానికి వైద్యశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న మీరే వైద్యులు చేస్తున్న కృషిని తక్కువ చేసి చూపడం సబబా? ఇది వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీసే చర్య కాదా?’’ అని హరీశ్‌ రావు ట్విటర్‌‌లో ప్రశ్నించారు.

నడ్డా గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు:
మంత్రి ఈటల రాజేందర్ సైతం జేపీ నడ్డాపై మండిపడ్డారు. తెలంగాణలో కరోనా మరణాలు రేటు జాతీయ మరణాల రేటు కంటే ఎక్కువగా ఉందంటూ.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు చిల్లరమల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. జేపీ నడ్డా జాతీయ స్థాయి నేతలా కాకుండా గల్లీ లీడర్‌లా ప్రవర్తిస్తున్నారని విరుచుకుపడ్డారు.

Read: విద్యార్థుల ఇంటికే సన్నబియ్యం 

Related Tags :

Related Posts :