కొత్తగూడెం రాజకీయాల్లో కుమ్ములాటలు.. ఆ ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరు!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఒకే పార్టీలో ఉండే ఇద్దరు ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరులో కార్యకర్తలు నలిగిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నియోజకవర్గంలో రాజకీయాలు విచిత్రంగా మారుతున్నాయి. అధికార పార్టీలో నేతల మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి. కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు… ఆ తర్వాత అధికార టీఆర్ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి కొత్తగూడెం రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతోంది. వనమా-జలగం వర్గాలుగా విడిపోయి, ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం కుమ్ములాటలు పెట్టుకుంటున్నారు. ఆ కుమ్ములాటలు ముదురుపాకాన పడ్డాయి.

ఇటీవల కాలంలో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు నియోజకవర్గానికి వచ్చిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రొగ్రాంకి పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలతో కొత్తగూడాన్ని ముంచేశారు. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు వర్గానికి చెందిన కొందరు కార్యకర్తలు… మంత్రి పువ్వాడ అజయ్, జలగం వెంకట్రావ్ ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఫొటో లేదనే సాకుతో కావాలనే వనమా వర్గానికి చెందిన కొందరు కార్యకర్తలు ఆ ఫ్లెక్సీలను చించి, పక్కకు పడేశారన్నది జలగం వర్గం వాదన. జలగం, వనమా వర్గానికి చెందిన వారు మంత్రి పువ్వాడ అజయ్ దృష్టికి తీసుకువెళ్లి వారిపై కేసులు పెట్టాల్సిందిగా వినతిపత్రం సైతం అందజేశారు.

మంత్రికి ఫిర్యాదు చేయటంతో ఆగకుండా అధిష్టానం ద్నష్టికి కూడా తీసుకెళ్లారు. ఇరువర్గాల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి కలిసి పని చేయాలని మంత్రి అజయ్ కుమార్ సూచించినా రోజు రోజుకు వారి మధ్య గొడవలు పెరుగుతూ ఉన్నాయి. వాట్సాప్, ఫేస్ బుక్‌లలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. మా నాయకుడు ఫలానా అభివృద్ధి పనులు చేయగా మీ నాయకుడు వాటిలో కమీషన్లు నొక్కేశాడంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు. కేసీఆర్ ఆశీర్వదాలు తమ నాయకుడికి ఉన్నాయంటే… కాదు కాదు మా నాయకుడికే ఉన్నాయంటూ డప్పు కొట్టుకుంటూ సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతున్నారు.

అసలు వివాదానికి ఇదే కారణమా? :
తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా అతిధులకు స్వాగతం తెలియజేస్తూ ఒక కార్యకర్త ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీ ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఆ ఫ్లెక్సీలో కొత్తగూడెం శాసనసభ్యులు వనమా రాఘవ గారికి స్వాగతం అని ఉండడమే ఈ వివాదానికి కారణం. దానిని ఆ కార్యకర్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతోపాటు స్థానిక వాట్సాప్ గ్రూప్‌లలో పెట్టడంతో ఒక్కసారిగా ఇరు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలు వారి ఫోన్లకు పని చెప్పారు. ఇరు వర్గాలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే కుమారుడు రాఘవ షాడో ఎమ్మెల్యేలా వ్యవహరిస్తూ, దౌర్జన్యాలకు దిగుతున్నారని జలగం వర్గానికి చెందిన వారు అన్ని పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.

READ  కమల్ నాథ్ కు ఝలక్....సొంత పార్టీకి వ్యతిరేకంగా రోడ్లపైకి వస్తానన్న సింధియా

వాట్సాప్ గ్రూప్‌లలో ఒకరిపై మరొకరు హద్దు దాటి విమర్శలు చేసుకుంటున్నారు. ఆడవారని చూడకుండా అసభ్య పోస్టులు చేశారని జలగం వర్గానికి చెందిన ఓ మహిళా కార్యకర్త జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఒకే పార్టీలో ఉంటూ ఈ కేసులు ఏంటి అంటూ జనాలు ముక్కున వేలేసు కుంటున్నారు. అధిష్టానం ఈ విషయంలో కలుగజేసుకొని పరిస్థితులను చక్కదిద్దకపోతే పార్టీ పరువు పోతుందని కార్యకర్తలు అంటున్నారు.

Related Posts