లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

పార్టీ గుర్తుతో ఏపీ మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికలు..రాజకీయ పార్టీలు ఫోకస్‌

Published

on

municipal and corporation elections : ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై రాజకీయ పార్టీలు ఫోకస్‌ పెట్టాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ గుర్తుతో జరుగనున్న తొలి ఎన్నికలు కావడంతో సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. ఎలాగైనా గెలవాలని రాజకీయ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. పంచాయితీ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరుగలేదు కాబట్టి ఎవరి సంఖ్య వారిది. కానీ… మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు పార్టీ గుర్తుతో జరుగనుండటంతో అసలు బండారం బయటపడనుంది. దీంతో ఎన్నికల బరిలో తాడో పేడో తేల్చుకునేందుకు పార్టీలు సన్నద్ధమయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లో 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటి, నగర పంచాయతీలకు ఎన్నికల సంఘం నగారా మోగించింది. గతంలో కరోనా వైరస్ కారణంగా వాయిదా పడ్డ ఈ ఎన్నికలు మళ్లీ ప్రారంభం అయ్యాయి. 12కార్పొరేషన్లలో గతంలో రాజకీయ పార్టీల, స్వతంత్ర అభ్యర్ధులతో కలిపి 6 వేల 563 మంది నామినేషన్ దాఖలు చేశారు. 75 పురపాలక, నగర పంచాయితీల్లో వార్డు స్థానాలకు 12 వేల 86 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మార్చి 10న ఒకే విడతలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 14న ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఈసారి అధికారంలో ఉండటంతో అత్యధిక స్థానాలపై వైసీపీ కన్నేసింది. ఇటీవల జరిగిన అనేక రాజకీయ పరిణామాలు, మాజీమంత్రులు, వారి కుటుంబ సభ్యులు పలువురు కేసుల్లో ఇరుక్కోవడంతో ఆత్మరక్షణలో పడ్డ టిడిపి… ఈ ఎన్నికల్లో నిలదొక్కుకోకుంటే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో చావో రేవో అన్నట్లుగా టీడీపీ పోరాటం చేయనుంది. ఆధిపత్యాన్ని నిలబట్టుకొని టీడీపీని మరోసారి దెబ్బ తీయాలని వైసీపీ ప్రణాళికలు వేస్తోంది. దీంతో ఈ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలకు కార్పొరేషన్‌, మున్సిపల్ ఎన్నికలు అగ్ని పరీక్ష కానున్నాయి. గ్రామ పంచాయితీ ఎన్నికలు పార్టీల జెండాలు, ఎన్నికల గుర్తులు లేకుండా జరుగుతుండటంతో గెలిచిన వారందరూ తమ వారేనని పోటిపడి మరి వైసీపీ, టీడీపీ ప్రచారం చేసుకున్నాయి. అయితే మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయితీ ఎన్నికల పరిస్థితి అలా కాదు. పార్టీల ఎన్నికల గుర్తుతో ఎన్నికలు నిర్వహిస్తుండటంతో… ఎవరి బలం ఎంతో స్పష్టంగా తెలుస్తుంది. దీంతో ప్రచారాన్ని హోరెత్తించేందుకు వైసిపి, టిడిపి, కాంగ్రెస్, బిజెపి, జనసేన, వామపక్షాలు సిద్దమౌతున్నాయి. పార్టీల ఆర్భాటాలు ఎలా వున్నా… ప్రధాన పోటీ మాత్రం వైసిపి, టిడిపిల మధ్యే వుండే అవకాశం ఉంది. బిజెపి, జనసేనలు కలిసి పోటీ చేస్తుండటంతో కొంత మేర ప్రభావం చూపే అవకాశం వుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్, వామపక్షాలకు ఈ ఎన్నికలు కొత్తగా మేలు చేసేదేమీ లేదని వారంటున్నారు.

పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోమూ వీర్రాజు ఇద్దరూ కాపులే కాబట్టి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బిజెపి, జనసేనకు కొంత ఆశలు వున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేసి దారుణ పరాభవాన్ని చవిచూశాయి. ఈసారి రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తుండటంతో ఎంతో కొంత ఉనికి చూపొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలెండర్ ధరలు పెరుగుదలతో పాటు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటికరణ నెగిటివ్‌గా మారే అవకాశం ఉంది.

ఇక టిడిపి చావో రేవో అన్నట్లుగా పోరాటానికి సిద్దమైంది. ఇప్పుడు పార్టీ బలపడకపోతే రాజకీయంగానే కాదు.. భవిష్యత్‌లో ఇంకా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొనక తప్పదని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నీరుగారిపోతే టిడిపి నేతలు జారిపోయే పరిస్థితులు ఎక్కువగానే ఉన్నాయి. దీంతో చంద్రబాబు కూడా కొత్తగా హిందుత్వ అజెండాను ఎత్తుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ కూడా ట్విట్టర్‌ వేదికగా క్రిస్టియన్‌ ముఖ్యమంత్రి అంటూ జగన్‌ మోహన్‌రెడ్డిపై విమర్శలు చేస్తూ… మెజారిటీ హిందువులను తమవైపు మళ్లించుకొనే ప్లాన్ వేస్తున్నారు.

అధికార వైసిపి మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికలపై ధీమాగానే ఉంది. గ్రౌండ్‌లో ఏం జరుగుతుందోనని సీఎం జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తూనే వున్నారు. అయితే హిందూ ఆలయాలపై జరిగిన దాడులు వైసిపికి కొంత నష్టం చేసే అవకాశం ఉంది. పైగా హిందూ ఆలయాలపై జరిగిన దాడుల వెనుక వైసిపి హస్తం ఉందంటూ బిజెపి, టిడిపి, జనసేన పార్టీలు చేసిన ఆరోపణలను తిప్పికొట్టడంలో ప్రభుత్వం వెనుకబడింది. ఈ గాయాన్ని మాన్పే సమయం కూడా లేకపోవడం వైసిపికి ఇబ్బందికరంగా మారింది. ఇంటింటికి ప్రభుత్వ పథకాలపైనే వైసిపి ఆశలు పెట్టుకుంది.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే మూడు రాజధానులు ఈ ఎన్నికల్లో కొంత ప్రభావం చూపే అవకాశం వుంది. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లను అధికార వైసిపి కైవసం చేసుకుంటే మూడు రాజధానులపై ఏ మాత్రం సంకోచించకుండా జగన్ ముందడుగు వేస్తారు. ఫలితాలు ఏమాత్రం తారుమారు అయినా ఎంతో కొంత ఆలోచిస్తారనటంలో సందేహం లేదు.

ఉక్కు సెంటిమెంట్‌ను ఎవరు క్యాష్ చేసుకుంటారనేది విశాఖ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలను నిర్ణయించనుంది. విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా చాలా కీలకమైనవి. ఈ ఎన్నికల్లో వైసిపికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని రాజధాని రైతులు నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు మున్సిపాలిటీల్లో టిడిపిని గెలిపించేందుకు రాజధాని రైతులు ప్రచారం చేసే అవకాశం వుంది. విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లలో వైసీపీ గెలిస్తే విశాఖకు రాజధాని తీసుకుపోతారని టిడిపి ప్రచారాస్త్రం ప్రయోగించనుంది. ఇది ఓటర్లపై కొంత ప్రభావం చూపొచ్చు. టిడిపి మేయర్ అభ్యర్థిగా ఎంపీ కేశినేని నానీ కూతురు శ్వేత రంగంలో ఉన్నారు. విజయవాడ మేయర్‌ బిసి అభ్యర్థికి ఇవ్వాలన్న ఆలోచనలో సిఎం జగన్.. ఎవరిని పోటీ పెట్టినా గెలిపించే బాధ్యతను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు భుజాలపై పెట్టారు. దీంతో పోటీ హోరాహోరీగా వుండనుంది. గుంటూరులో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది.

మొత్తం మీద రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు ఒక ఎత్తు అయితే విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లు మరో ఎత్తు అన్నట్లుగా ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో పలు మార్పులకు ఈ మూడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జయాపజయాలు ముడిపడి ఉండటంతో వైసిపి, టిడిపిలు సర్వశక్తులను ఒడ్డి పోరాడుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మూడు స్థానాల్లో విజయం ఎవరిని వరిస్తుందో..