ఇంద్రవెల్లి… ఓ నెత్తుటి జ్ఞాపకం

  • Published By: chvmurthy ,Published On : April 20, 2019 / 01:48 AM IST
ఇంద్రవెల్లి… ఓ నెత్తుటి జ్ఞాపకం

అదో హక్కుల పోరు. జల్‌, జమీన్‌, జంగిల్‌ నినాదంతో ఐక్యమైన ఆదివాసీ, గిరిజ ఉద్యమ జోడు. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన సభపై ప్రభుత్వం పోలీసులను ఎగదోసింది.  అడవిబిడ్డలపై తుపాకి గుళ్లు కురిపించింది. ఈ ఘటనలో వందమందికిపైగా  అడవిపుత్రులు నేలకొరిగారు. వందలమంది గాయపడ్డారు. అడవి బిడ్డల నెత్తుటితో ఇంద్రవెల్లి ఎరుపెక్కింది. వారిచ్చిన స్ఫూర్తితో రైతు ఉద్యమాలు ఉవ్వెత్తుగా ఎగసిపడ్డాయి. ఇంద్రవెల్లి కాల్పల ఘటన జరిగి 38 ఏళ్లు పూర్తయింది.

ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇంద్రవెల్లి పేరు వింటేచాలు ఆదివాసీ ప్రజలు, గిరిజనుల్లో సమరోత్సాహం స్ఫురిస్తుంది. సరిగ్గా 38 ఏళ్ల క్రితం.. 1981వ సంవత్సరం ఏప్రిల్‌ 20న జల్‌ – జంగిల్‌ – జమీన్‌ అనే నినాదంతో.. అటవీభూములపై హక్కులు కల్పించాలంటూ ఆదివాసీలు ఇంద్రవెల్లిలో సభ నిర్వహించారు. ఈ సభకు వేలాది సంఖ్యలో అదివాసులు తరలివచ్చారు. ప్రభుత్వం నుంచి సభకు అనుమతి లేదంటూ… సభను రద్దు చేసుకోవాలని పోలీసులు ఘీంకరించారు. పోలీసుల హెచ్చరికలను ఖాతరు చేయని ఆదివాసీలు సభను నిర్వహించి తీరుతామని తేల్చి చెప్పారు. దీంతో వాగ్వివాదం జరిగింది.  ఓ మహిళను పోలీసులు చేయిపట్టి లాగేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితిని ఆర్డీవోకు వివరించగా ఆయన కాల్పులకు అనుమతిచ్చారు. దీంతో పోలీసులు రెచ్చిపోయి ఆదివాసీలు, గిరిజనులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వందమందికి పైగా అమరులయ్యారు. ఆ ప్రాంతంగా ఆదివాసీల నెత్తుటితో తడిసి ఎర్రబడింది. మరికొంతమందికి తూటాలు దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. అయితే 13 మంది మాత్రమే చనిపోయారని నాటి సర్కార్‌ లెక్కలు వేసింది. కానీ అనధికారికంగా 113 మంది ఆదివాసీలు నేలకొరిగారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకుగానీ, గాయపడ్డ వారికిగానీ ప్రభుత్వం నేటికీ ఎలాంటి చేయూత నందించలేదు.

ఇంద్రవెల్లిలో పోలీసుల మారణకాండ అనంతరం 1982లో పీపుల్స్‌ వార్‌ రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో అమరుల జ్ఞాపకార్థం స్థూపాన్ని నిర్మించారు. 1986 వరకు ప్రతి ఏటా కాల్పులు జరిగిన రోజుల అమల వీరుల సంస్మరణ సభ నిర్వహించి శ్రద్దాంజలి ఘటించేవారు. కాగా అదే ఏడాది గుర్తు తెలియని దుండగులు డిటోనేటర్లతో అమరవీరుల స్థూపాన్ని పేల్చివేయగా, మూడేళ్ల తర్వాత అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం గిరిజన అభివృద్ధి సంస్థ నిధులతో మళ్లీ స్థూపాన్ని నిర్మించింది. 1989 తర్వాత స్థూపం దగ్గర సంస్మరణ సభను నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.  దీంతో ఆ ప్రాంతంలో ప్రతిఏటా ఏప్రిల్‌ 20న నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. సంస్మరణ దినోత్సవం రోజున 144 సెక్షన్‌ను ప్రభుత్వం కొనసాగిస్తోంది.

స్వరాష్ట్రంలోనూ ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం దగ్గర ఆదివాసీలు స్వేచ్ఛగా నివాళులు అర్పించుకుకోలేని దుస్థితి. ప్రతిఏటా పోలీసుల నిర్బంధాన్ని అడ్డుకుంటూ గిరిజనులు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన నివాళులు అర్పిస్తున్నారు.  ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు తెలంగాణ ఉద్యమ సమయంలో ఇంద్రవెల్లి అమరుల సంస్మరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా వారి మాటలు అమలుకు నోచుకోలేదు.  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా నిషేధాజ్ఞలు విధిస్తూ వస్తోంది. సమావేశాలు ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్వహించుకునేందుకు అనుమతలు లేవంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇంద్రవెల్లి పరిసర ప్రాంతాలు పోలీసుల వలయంలో ఉన్నాయి. ఇంద్రవెల్లి వైపు వచ్చే రహదారులను నిర్భంధించారు. రహదారులపై చెక్‌పోస్టులనూ ఏర్పాటు చేశారు.  48 గంటలు పోలీసులు ఆంక్షలు కొనసాగుతాయంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  రాజ్యం మారినా, రాజులు మారినా,  పాలన మారినా, పాలించే వారు మారినా, వారి విధానాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. స్వరాష్ట్రంలోనైనా స్వేచ్ఛగా అమరులకు నివాళులర్పించుకుంటామని భావించిన ఆదివాసీల ఆశలు అడియాసలే అవుతున్నాయి.