KTRకు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం

  • Published By: madhu ,Published On : January 31, 2020 / 12:50 AM IST
KTRకు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం అందింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కేటీఆర్‌ను తమ దేశంలో పర్యటించాల్సిందిగా ఆహ్వానించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక మంత్రిత్వ శాఖ తమ దేశంలో జరిగే యానువల్‌ ఇన్వెస్ట్మెంట్ మీటింగ్‌కు హాజరుకావాల్సిందిగా ఇన్విటేషన్‌ పంపించింది.

ఇన్వెస్టింగ్ ఫర్ ఫ్యూచర్ – షేపింగ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్‌ అనే థీమ్‌తో ఈ సమావేశం జరగబోతోంది. 2020, మార్చి 24 నుంచి 26 వరకు దుబాయ్‌లో ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. మూడ్రోజుల పాటు జరిగే సదస్సులో వివిధ దేశాలకు సంబంధించిన ఆర్థిక అంశాలు, పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక రంగం, ప్రభుత్వ విధానాల్లాంటి కీలక అంశాలపై ఆయా దేశాలకు చెందిన ప్రజంటేషన్లు, వర్క్‌షాప్‌లు ఎగ్జిబిషన్లు, ఇన్వెస్ట్మెంట్ అవార్డ్స్ లాంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తారు.

వివిధ దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లోని ప్రతినిధి బృందాలు ఒకరితో ఒకరు తమ దేశం, రాష్ట్రంలో ఉన్న అవకాశాల గురించి వివరించే అవకాశం కలుగుతుందని యూఏఈ ప్రభుత్వం మంత్రి కేటీఆర్‌కు పంపిన ఆహ్వానంలో తెలిపింది. ఈ సమావేశంలో వన్ రోడ్- వన్ బెల్ట్ అనే ప్రత్యేక కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొంది. ఈ కాన్ఫరెన్స్‌ ద్వారా తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాల్ని ప్రపంచానికి మరోసారి పరిచయం చేసే అవకాశం కలుగుతుందని కేటీఆర్‌కు పంపిన లేఖలో యూఏఈ ప్రభుత్వం తెలిపింది.

యూఏఈ ప్రభుత్వం నుంచి ఆహ్వానం రావడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పలు అంతర్జాతీయ వేదికల నుంచి వస్తున్న ఆహ్వానాలు తెలంగాణ ప్రభుత్వ విధానాలకు దక్కుతున్న ప్రశంసలుగా చెప్పారు.

Read More : పార్లమెంట్ సమావేశాలు : వైసీపీ వర్సెస్ టీడీపీ