ఆర్టీసీ కార్మికులకు మరో షాక్ : వేతనాలపై హైకోర్టులో విచారణ

  • Published By: madhu ,Published On : November 27, 2019 / 08:40 AM IST
ఆర్టీసీ కార్మికులకు మరో షాక్ : వేతనాలపై హైకోర్టులో విచారణ

ఆర్టీసీ కార్మికులకు మరో షాక్ తగిలింది. వేతనాల చెల్లింపు విషయంలో హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించలేమని ప్రభుత్వం మరోసారి హైకోర్టుకు స్పష్టం చేసింది. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్టు – 7 ప్రకారం ఒక్క రోజు విధులకు హాజరు కాకుంటే..8 రోజుల జీతం కట్ చేయవచ్చని ప్రభుత్వ తరపు పిటిషనర్ వాదించారు. 2019, నవంబర్ 27వ తేదీ బుధవారం హైకోర్టులో జీతాల చెల్లింపుపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా కార్మికుల తరపు, ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించారు. 

కార్మికులు 52 రోజులుగా సమ్మెలోనే ఉన్నారని కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. జీతాల చెల్లింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను హైకోర్టు ముందు ఉంచారు. పనిచేసిన సెప్టెంబర్ నెల జీతం ఇవ్వకపోవడం చట్ట విరుద్ధమని కార్మిక సంఘాల తరపు న్యాయవాది వాదించారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు..తదుపరి విచారణ డిసెంబర్ 4కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. 

2019, అక్టోబర్ 04వ తేదీ అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దసరా పండుగ నేపథ్యంలో సమ్మెలోకి వెళ్లడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. విధుల్లోకి హాజరు కావాలని ప్రభుత్వం సూచించినా..కార్మికులు విధులకు హాజరు కాలేదు. దీంతో సెప్టెంబర్ నెలకు సంబంధించిన జీతాన్ని కార్మికుల ఖాతాల్లో జమ చేయలేదు. చివరకు తాము సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. విధుల్లోకి చేర్చుకోవాలని సూచించినా..ఆర్టీసీ ఎండీ నిరాకరించారు. కోర్టు తీర్పు వచ్చేంత వరకు సంయమనం పాటించాలని సూచించారు. వేతనాలు అందక..విధుల్లోకి తీసుకోకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా హైకోర్టు వ్యాఖ్యలపై ఆర్టీసీ జేఏసీ ఎలా స్పందిస్తుందో చూడాలి. 
Read More : కూకట్ పల్లిలో ఘోరం : చైతన్య వాటర్ ట్యాంకర్ ఢీకొని నారాయణ ఉద్యోగి మృతి