అయోమయం లో ఏపీ బీజేపీ 

  • Published By: chvmurthy ,Published On : March 12, 2019 / 03:42 AM IST
అయోమయం లో ఏపీ బీజేపీ 

అమరావతి : ఎన్నికల ప్రకటన ఇంత తొందరగా వస్తుందని ఏపీ బీజేపీ అంచనా వేయలేకపోయింది. ఏప్రిల్ 11న పోలింగ్ జరుగుతుందని తెలిసి నిర్ఘాంతపోయింది. దీంతో బీజేపీ ప్లాన్ అంతా తారుమారైంది. ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలకు ఎవరితో పొత్తులేకుండా ఒంటరిగానే బరిలోకి దిగాలని కమలం పార్టీ నిర్ణయించింది. కాని అభ్యర్థుల ఎంపిక ఇంకా ఓ కొలిక్కిరాలేదు. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత తీవ్రంగా పీడిస్తోంది. దీంతో ఏం చేయాలో తోచని అయోమయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం పడిపోయింది.

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయినా, రాష్ట్రంలో మాత్రం బీజేపీది చాలా దయనీయమైన పరిస్థితి. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని నాలుగు పార్లమెంట్, 13 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసింది. కానీ 4 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అప్పట్లో బీజేపీ ఇచ్చిన ప్రధాన హామీల్లో ప్రత్యేక హోదా కీలకమైంది. ఐతే  ఇప్పటివరకు హోదా ఇవ్వలేదు. ఇతర విభజన హామీలను కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని టీడీపీ, ఇతర విపక్షాలతోపాటు ప్రజాసంఘాలు సైతం బీజేపీని టార్గెట్ చేశాయి. దీంతో బీజేపీకి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. దీంతో వీలైనంత త్వరగా అభ్యర్థుల వివరాలు తీసుకుని ఢిల్లీకి పంపే కసరత్తు మొదలుపెట్టింది. 

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం ఇచ్చిందో వివరిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి బస్ యాత్ర చేపట్టిన బీజేపీ నేతలకు ఆదినుంచి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పలాసలో బస్ యాత్రకు జెండా ఊపారు. అక్కడ ఏర్పాటు చేసిన సభకు జనం లేకపోవడంతో రద్దయింది. అక్కడ్నుంచి శ్రీకాకుళం వరకు వచ్చిన బస్‌యాత్ర  ఆ తర్వాత గుంటూరులో ప్రధానమంత్రి మోడీ సభ నేపథ్యంలో ఆగిపోయింది. ఆ తర్వాత విశాఖపట్నంలో సభకు ఏర్పాట్లు, ఇతరత్రా కార్యక్రమాలతో బస్‌యాత్ర శ్రీకాకుళం నుంచి ముందుకు కదల్లేదు. ఇక ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో బస్ యాత్ర పూర్తిగా రద్దయినట్లేననే వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు రాష్ట్ర బీజేపీకి పెద్ద చిక్కొచ్చిపడింది. ఎంపీ స్థానాల్లో బరిలో నిలిపేందుకు అభ్యర్థులు ఉన్నా ఎమ్మెల్యే స్థానాలకు మాత్రం అభ్యర్థుల కొరత సమస్యగా మారింది. ఇక రాయలసీమ జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండటంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం అందోళన చెందుతోంది.