బీజేపీ జాతీయ నేతలపై పవన్ పొగడ్తల వర్షం, ఆందోళనలో ఏపీ బీజేపీ నేతలు

  • Published By: naveen ,Published On : July 18, 2020 / 03:21 PM IST
బీజేపీ జాతీయ నేతలపై పవన్ పొగడ్తల వర్షం, ఆందోళనలో ఏపీ బీజేపీ నేతలు

ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ అది. ప్రభుత్వాలను ప్రశ్నించడం వరకు బాగానే ఉంది. మిత్రులను పొగడటంలో తప్పు లేదు. కాకపోతే, అది కాస్త లిమిట్ లో ఉంటే బాగుంటుంది. రేపు పొద్దున ఆ మిత్రుడితో తేడా వస్తే, మళ్లీ ఇదే నోటితో తిట్టాల్సి వస్తుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. అది మిత్రుడైనా, శత్రువైనా. ఆ విషయం ఆయనకు తెలియదని కాదు సుమీ. కాకపోతే మిత్రపక్షాన్ని మరీ మోసేస్తుండటం ఆ మిత్రపక్ష పార్టీ రాష్ట్ర నేతలకు ఏదోలా అనిపిస్తోందట. అసలు ప్రశ్నించే పార్టీ అధినాయకుడు మరీ ఇంతలా ఎందుకు మిత్రులను మోసేస్తున్నారు?

బీజేపీతో పొత్తు తర్వాత పవన్‌లో ఊహించని మార్పు:
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూటు మార్చారని అంటున్నారు. సొంత పార్టీ కంటే మిత్రపక్ష పార్టీపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారట. కొంతకాలంగా పవన్ కల్యాణ్‌ వ్యవహరిస్తున్న తీరు కూడా అలానే కనిపిస్తోంది. బీజేపీ జాతీయ నేతల జపం చేయడంలో పవన్‌కల్యాణ్‌ ఇప్పుడు బీజేపీ నేతలను సైతం మించిపోతున్నారనే చర్చ జరుగుతోంది. బీజేపీతో కలిసినప్పటి నుంచి పవన్ రూట్ మొత్తం మార్చేసినట్టుగానే కనిపిస్తోందన్న వాదన ఉంది. రాజకీయాలు ప్రారంభించిన తర్వాత నుంచి మొదలుపెడితే.. బీజేపీతో పొత్తు పెట్టుకోక ముందు వరకూ పవన్‌లో వామపక్ష భావజాలం ఎక్కువగా కనిపించేవి. కానీ, ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక.. పూర్తిగా ఆ పార్టీ భావజాలాన్ని నింపేసుకున్నారని జనసైనికులే అంటున్నారు.

ఏపీ బీజేపీ నేతల్ని మించిపోయేలా పవన్ పొగడ్తలు:
రాజకీయ అంశాలే కాకుండా వ్యక్తిగత విషయాల్లోనూ పవన్‌ బీజేపీని అనుసరిస్తున్నారని అనుకుంటున్నారు. ముఖ్యంగా హిందువాదం ప్రతిబింబించేలా పవన్ వ్యవహరిస్తున్నారనే టాక్ ఏపీ రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. ఒక పక్క ఏపీలో అధికార పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే మరో పక్క కేంద్రాన్ని ఆకాశానికెత్తేస్తున్నారు. ఇక బీజేపీ ప్రధాన నేతల గురించి అయిత ఏపీ బీజేపీ నేతల్ని మించిపోయేలా పొగడ్తలుంటున్నాయని కొందరు జనసైనికులు ముక్కున వేలేసుకుంటున్నారు. పవన్‌తో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. సోషల్ మీడియాలోనూ ఇదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు జనసేన కార్యకర్తలు.

పవన్ కేంద్రానికి దగ్గర అవుతారేమోనని ఆందోళన:
పవన్ విషయంలో ఏపీ బీజేపీ నేతలు లోలోపల మధనపడుతున్నారట. వాస్తవానికి పవన్ నుంచి వచ్చిన ఎలాంటి ప్రకటన అయినా ప్రజల్లోకి వేగంగా వెళ్తుంది. ఈ నేపథ్యంలో బీజేపిని పవన్ పొగడ్తలతో ముంచెత్తడం కూడా అంతే ఫాస్ట్‌గా వెళ్తోంది. దీంతో రాష్ట్రంలోని బీజేపీ నేతల్లో ఈ అంశంపై చర్చ జరుగుతోంది. ఇటీవల బీజేపీ వర్చువల్ మీటింగ్‌లో నిర్మలా సీతారామన్ సైతం పవన్ పేరు ప్రస్తావించారట. ఈ విషయంపై రాష్ట్రానికి చెందిన కొంతమంది బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. పవన్ ఎక్కడ కేంద్రానికి దగ్గరవుతారోనని అందోళన చెందుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

పవన్ కున్న ప్లస్ పాయింట్ అదే:
ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపైనా, పథకాలపైనా ముందుగా తన వాయిస్‌ వినిపిస్తున్నారు పవన్‌. ఆ తర్వాత పనిలో పనిగా బీజేపీ ముఖ్య నేతలను ప్రశంసించడం మొదలుపెడుతున్నారు. అసలే బీజేపీ రాష్ట్ర నేతల్లో ఫాలోయింగ్‌ ఉన్న వాళ్లు అంతంత మాత్రమే. ఈ సమయంలో పవన్‌ ఇలా వ్యవహరిస్తుండడంతో బీజేపీ నేతలకు ఏమీ అర్థం కావడం లేదట. కాకపోతే, తొలి నుంచి పవన్‌ కల్యాణ్‌కు ఉన్న జనాదరణకు వాడుకోవాలన్నదే బీజేపీ కేంద్ర నాయకత్వ ఆలోచన. రాష్ట్ర బీజేపీ నేతల్లో అంత ఫాలోయింగ్‌ ఉన్న నేతలు లేనందున పవన్‌పై బీజేపీ అధినాయకత్వం ఆసక్తి చూపిస్తోందని కొందరు బీజేపీ నేతలు అంతర్గతంగా డిస్కస్‌ చేసుకుంటున్నారు.