వైసీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు

  • Published By: veegamteam ,Published On : April 20, 2019 / 03:18 PM IST
వైసీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు

చిత్తూరు : వైసీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలు టీడీపీని ఆదరించారని, మరోసారి తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నా పోరాటం ఎన్నికల సంఘంపై కాదు.. ఈసీ అవలంభించే విధానాలపైనే అని చంద్రబాబు అన్నారు. తిరుపతిలో ఎన్టీఆర్ ట్రస్ట్ రక్తనిధి కేంద్రాన్ని చంద్రబాబు దంపతులు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల సంఘాన్ని ప్రధాని మోడీ దుర్వినియోగం చేయాలని చూశారని ఆరోపించారు. ప్రధాని మోడీ హెలికాపర్ట్ ను తనిఖీ చేసిన ఐఏఎస్ అధికారిని ఈసీ సస్పెండ్ చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  డ్యూటీ చెయ్యడం ఆ అధికారి తప్పు ఎలా అవుతుందన్నారు. అధికారిపై వేటు వేయడం ఈసీ వివక్షకు నిదర్శనం అన్నారు.

తన రివ్యూలను ఈసీ తప్పుపట్టడంపైనా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐబీ సహా ఇతర అధికారులతో ప్రధాని సమీక్షలు చేస్తున్నారని, అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చంద్రబాబు అన్నారు. ఈసీ దేశం కోసం పని చేయాలే తప్ప మోడీ కోసం కాదని చంద్రబాబు హితవు పలికారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏపీ ప్రజలను మోడీ మోసం చేశారని ఆరోపించారు. జగన్, కేసీఆర్, మోడీ మైండ్ గేమ్ ఆడుతున్నారని, వారి కుట్రలు ఫలించవు అని చంద్రబాబు అన్నారు. టీడీపీకి అనుకూలంగా అండర్ కరెంట్ ఉందని చంద్రబాబు చెప్పారు.