కోర్టులో తర్వాత చూసుకుందాం..రాజధాని పని మొదలెట్టండి

  • Published By: chvmurthy ,Published On : February 3, 2020 / 12:35 PM IST
కోర్టులో తర్వాత చూసుకుందాం..రాజధాని పని మొదలెట్టండి

ఏపీలో 3 రాజధానుల ఏర్పాటు విషయంలో సీఎం జగన్ దూకుడు మీదే ఉన్నారు. కర్నూలులో జ్యుడిషియల్ రాజధానుల ఏర్పాటుకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన ఆయన విశాఖలో పరిపాలనా రాజధాని కోసం సోమవారం నిధులు విడుదల చేశారు. ఏపీలో రాజకీయ పరిణామాలు చూస్తుంటే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. కోర్టు కేసులు ఎన్ని ఉన్నా తాను అనుకున్నది చేసే క్రమంలో సీఎం జగన్ దూసుకు పోతున్నారు.

కర్నూలులో జ్యూడిషియల్ రాజధాని ఏర్పాటులో భాగంగా ఏపీ విజిలెన్స్‌ కమిషనర్‌ కార్యాలయం, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ఛైర్మన్‌, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ సభ్యుల కార్యాలయాల్ని తరలిస్తూ గత శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆఫీసుల్ని కర్నూలుకు తరలించడానికి తగిన భవనాలను గుర్తించాలని ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజినీర్, కర్నూలు జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ గా సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.  విశాఖలోని మిలీనియం టవర్స్ కు రూ.19.73 కోట్ల రూపాయలు  సోమవారం ఫిబ్రవరి 3న విడుదల చేసారు.  సెక్రటేరియట్ ను రెడీ చేసేందుకు ఈ డబ్బుని వినియోగించబోతున్నారు.

మరోవైపు విశాఖపట్నానికి సెక్రటేరియట్ ను తరలించడంపై అభ్యంతరం చెపుతూ  అమరావతి రైతులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  ఈ పిటిషన్ పై  (ఫిబ్రవరి 3న)ఈరోజు విచారణ జరిగింది.  కార్యాలయాలు మార్చొద్దని చెప్పినా జగన్ వినకపోతుండటంతో హైకోర్టు సీరియస్ అయ్యింది. ఫిబ్రవరి మూడో వారంలోగా విశాఖకు క్యాంపు కార్యాలయం తరలించే దిశగా ఏర్పాట్లు ముమ్మరమైనట్టు తెలుస్తోంది. మరోవైపు అమరావతి నుంచి ఒక్క ఫైలు తరలించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, అందుకయ్యే ఖర్చును సంబంధిత అధికారుల నుంచే వసూలు చేస్తామని హైకోర్టు స్పష్టంచేసింది. 

హై కోర్టు హెచ్చరికలతో రాజధాని తరలింపు ఇప్పట్లో ఉండదని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తారు మారు చేస్తూ.. జనవరి 31న అర్థరాత్రి గుట్టు చప్పుడు కాకుండా తరలింపు ప్రక్రియను ప్రారంభించేసింది జగన్‌ సర్కార్‌. ఇక ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు మండలిలో పెండింగులో ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా కాస్త ఆలోచించి తదుపరి చర్యలు తీసుకుంటారు. ముందుకెళ్లాలా.. వద్దా అని సందిగ్ధంలో ఉంటారు. కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ తాను అనుకున్నది చేసే దిశగా కదులుతున్నారు. ఉగాది రోజున విశాఖ నుంచి పాలన మొదలు కావాల్సిందేనన్న పట్టుదలతో జగన్ ముందుకెళ్తున్నారు. 

ప్రస్తుతం ప్రభుత్వం తీరు తీవ్ర ఉత్కంఠకు తెర తీస్తోంది. గతంలోనూ చంద్రబాబు సర్కారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలోనూ, అమరావతి  రాజధాని నిర్మాణం విషయంలోనూ ఇదే దూకుడు ప్రదర్శించింది. అమరావతి నిర్మాణంపై గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు ఉన్నప్పటికీ రాజధాని నిర్మాణాన్ని కొనసాగించింది. అలాగే పోలవరం ప్రాజెకు నిర్వాసితుల కేసు కోర్టులో పెండింగ్ లో ఉన్నా, పర్యావరణ అనుమతులు రాకున్నా నిర్మాణాలను నిరాఘాటంగా కొనసాగించింది. ఇప్పుడు సీఎం జగన్ కూడా అదే దూకుడులో రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు.