నిన్న కేసీఆర్, నేడు జగన్ : ప్రధాని మోడీతో చర్చలు

  • Published By: veegamteam ,Published On : October 5, 2019 / 02:48 AM IST
నిన్న కేసీఆర్, నేడు జగన్ : ప్రధాని మోడీతో చర్చలు

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ బాట పడుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా పలు అంశాలపై ప్రధాని మోడీతో చర్చించనున్నారు. విద్యుత్ తో పాటు తెలంగాణ రాష్ట్రంతో కలిసి గోదావరి, కృష్ణా నదుల అనుసంధానికి చేపడుతున్న చర్యలపై ప్రధానితో సమాలోచనలు చేయనున్నారు. ఏపీ సీఎం జగన్, ప్రధాని మోడీతో శనివారం(అక్టోబర్ 5,2019) సమావేశం కానున్నారు. భేటీ అజెండాలో పోలవరం, విద్యుత్ కొనుగోళ్లు సహా రీ-టెండరింగ్‌ అంశాలున్నాయి. పోలవరం ప్రాజెక్టు రీ టెండర్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే రూ.782 కోట్లకుగా పైగా నిధులు ఆదా అయ్యాయని అధికారులు తెలిపారు. సగం కాంట్రాక్టు విషయంలోనే సుమారు రూ.782 కోట్లు మిగిలితే.. మిగిలిన పనుల్లో కూడా ఇదే పద్దతి అవలంభిస్తే.. వేల కోట్లు ఆదా అయ్యే అవకాశముందని ప్రధాని మోడీకి జగన్ వివరించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మిగిలిన ప్రాజెక్టులకు రీ టెండర్ సిస్టమ్‌ను.. ఇంప్లిమెంట్ చేసే విషయంపై ప్రధానితో చర్చించే అవకాశముంది.

విద్యుత్ కొనుగోళ్ల అగ్రిమెంట్ల విషయంలో ప్రధానితో సీఎం జగన్ చర్చించనున్నారు. పీపీఏల(పవర్ పర్జేస్ అగ్రిమెంట్) విషయంలో కేంద్రమంత్రి లేఖలు రాయడం, తమకు తోచిన విధంగా స్టేట్ మెంట్లు ఇవ్వడంతో రాజుకున్న వివాదాన్ని ప్రధానికి వివరించనున్నట్లు తెలుస్తోంది. పీపీఏలపై ఇప్పటికే ప్రధానితో పలుమార్లు చర్చించిన జగన్.. మరోసారి తన నిర్ణయాన్ని మోడీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో పీపీఏల్లో జరిగిన నష్టాన్ని ప్రధానికి వివరించనున్నారు జగన్. 

రెవెన్యూ లోటు సహా రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనా ప్రధానితో జగన్ చర్చించనున్నారు. రెవెన్యూ లోటు భర్తీకి సహకరించాలని కోరే అవకాశముంది. ఏపీని అన్ని విధాల ఆదుకుంటామని గతంలో ప్రధాని ప్రకటించారు. ఇదే విషయాన్ని మోడీ దగ్గర జగన్ ప్రస్తావిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో చేపడుతున్న అనేక సంక్షేమ కార్యకమాల వల్ల ఆర్ధిక భారం అదనం అవుతోంది. కేంద్రం తక్షణమే స్పందించి ఆర్ధిక సాయం చేస్తే.. కొంత వరకు రిలీఫ్ లభిస్తుంది. ఈ విషయంపైనా ప్రధానితో జగన్ చర్చించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

అక్టోబర్ రెండో వారం నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించాలనుకుంటున్న జగన్.. ఆ మేరకు ఆహ్వానం అందించనున్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి సమస్యలను ప్రధాని దగ్గర ప్రస్తావిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జగన్ చర్చించారు. కృష్ణా, గోదావరి నదీ జలాలను సక్రమంగా ఎలా వినియోగించుకోవాలనే సమాలోచనలు చేశారు. ఈ చర్చల సారాంశాన్ని ప్రధానికి జగన్ వివరించే అవకాశముంది.