ఉధ్దానం కిడ్నీ రోగుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

  • Published By: chvmurthy ,Published On : September 3, 2019 / 03:00 PM IST
ఉధ్దానం కిడ్నీ రోగుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతి : ఉద్ధానం కిడ్నీ భాధితుల సమస్య పరిష్కారానికి ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కిడ్నీ బాధితుల కోసం శ్రీకాకుళం జిల్లా పలాసలో 200 పడకలతో  సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఆస్పత్రికి అనుసంధానంగా రీసెర్చ్‌ సెంటర్‌, డయాలసిస్‌ యూనిట్‌ ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, డయాలసిస్‌ యూనిట్‌కు రూ.50కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

రీసెర్చ్‌ సెంటర్‌లో రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో ప్రభుత్వం సిబ్బందిని నియమించనున్నారు. డాక్టర్లు సిబ్బందిని మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్‌ ప్రాతిపదికన 5 పోస్టులు, కాంట్రాక్‌ బేసిస్‌ కింద 98  పోస్టులు, సర్వీస్‌ ఔట్‌సోర్స్‌ కింద60 పోస్టులు మంజూరు చేసింది. కాగా ప్రభుత్వ నిర్ణయం పట్ల కిడ్నీ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి కాకముం‍దే తమ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు.

కాగా, ఏపీ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కిడ్నీ బాధితులకు నెలకు రూ. 10 వేల పెన్షన్‌ ఇస్తున్నారు. సీఎం జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం ప్రాంతంతో పర్యటించారు.  కిడ్నీ బాధితుల అవస్థలను చూసి ఆయన చలించిపోయారు. వారి  బాధలు విన్న వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే నెలకు రూ.10 వేల ఇస్తా’నని  హామీ ఇచ్చారు. అధి​కారంలోకి వచ్చిన వెంటనే  కిడ్నీ బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం వారికిచ్చే పింఛను రూ.10 వేలకు పెంచారు. 

రాష్ట్రంలో సుమారు 8,500 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలోని 112 గ్రామాల్లో ఉన్నారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా జి.కొండూరు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో డయాలసిస్‌ బాధితులు ఉన్నారు. వీళ్లందరూ పేదవాళ్లే.  గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 4 వేల మందికి మాత్రమే నెలకు రూ.2,500 చొప్పున పింఛను ఇచ్చేవారు. 2019 ఫిబ్రవరి తరువాత 8,500 మందికి రూ.3,500 చొప్పున రూ.2.80 కోట్లను వ్యయం చేశారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చాక  రూ.10 వేల చొప్పున 8,500 మందికి నెలకు రూ.8.50 కోట్లను చెల్లిస్తున్నారు. కేవలం కిడ్నీ బాధితులకు ఇచ్చే పింఛను వ్యయమే ఏడాదికి రూ.102 కోట్లు కానుంది. అంతే కాకుండా ఉద్దాన సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఇపుడు రూ.50 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, రీసెర్చ్‌ సెంటర్‌, డయాలసిస్‌ యూనిట్‌ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 

kidney super speciality hospitl go