గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చిన జగన్

  • Published By: chvmurthy ,Published On : September 30, 2019 / 06:21 AM IST
గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చిన జగన్

ఏపీలో అక్టోబరు 2 గాంధీ జయంతి రోజు నుంచి కొత్త ప్రజా పరిపాలనా వ్యవస్ధ అమల్లోకి  వస్తోంది.  గాంధీజీ కలలుకన్న స్వరాజ్య స్ధాపన స్ఫూర్తితో సీఎం జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇందుకోసం 1లక్షా 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలోని పలు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబరు 30న విజయవాడలోని ఎ-ప్లస్‌ కన్వెన్షన్‌ హాలులో జరిగిన  కార్యక్రమంలో  సీఎం జగన్ నియామక పత్రాలు అందచేసారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన దాదాపు 5 వేల మంది అభ్యర్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

ప్రజా సంబంధిత సేవలకు సంబంధించి ఇప్పుడు అమలవుతున్న విధానంలో  కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  మండల కేంద్రాల్లోని తహసిల్దార్, మండల పరిషత్,  వ్యవసాయ శాఖ,సహకార వ్యవస్ధలపై ప్రఝలు ఆధార పడాల్సి వస్తోంది.  చిన్నధృవీకరణ పత్రానికి సైతం  వారాలు తరబడి  వేచి చూడాల్సి వస్తోంది. ఇక ఇప్పుడా పరిస్ధితి ఉండదు. ప్రతి సచివాలయంలోనూ 10 మంది వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు  అందుబాటులో ఉంటారు. అక్టోబరు 2 నుంచి పౌర సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ కార్యాలయాల్లో  ఆర్జీలు అందించిన 72 గంటల్లో  పూర్తయ్యే 10 సేవలను ఈ సచివాలయాల ద్వారా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ సేవలను క్రమేపీ పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది.   ఈ కార్యాలయాల ద్వారా  జనన,మరణ ధృవీకరణ పత్రాల నమూనాలను  వెంటనే అందచేస్తారు.
ప్రతిరోజు గ్రామ సచివాలయాల్లో స్పందన కార్యక్రమం కొనసాగుతుంది.  

వైసీపీ ఎన్నికల మేని ఫెస్టోలో రూపోందించిన నవరత్నాలలోని అమ్మఒడి,ఆరోగ్యశ్రీ , రైతు భరోసా, ఫించన్లు,  ఫీజు రీఎంబర్స్ మెంట్  తదితర పధకాలకు సంబంధించిన సేవలన్నింటినీ సచివాలయాల ద్వారా అమలు చేస్తారు. ప్రతి గ్రామంలో  వార్డులో జనాభాను అనుసరించి  సచివాలయాలను ఏర్పాటు చేయటం జరిగిందని అధికారులు చెప్పారు. ఈ కార్యాలయాల పరిధిలో ఆయా పధకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. ప్రభుత్వం  ఇప్పటికే ఆయా సేవలకు సంబంధించిన ఉద్యోగులకు విధి విధానాలను, బాధ్యతలకు సంబంధించి అవగాహన సదస్సు, శిక్షణను అందచేసింది. ఆయా గ్రామాల్లో వార్డుల్లో  సచివాలయాలకు కార్యాలయాల నిర్వహణకు భవనాలను ఎంపిక చేసి వాటిలో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నారు.