సీమను పూర్తిస్ధాయిలో అభివృధ్ది చేస్తా : రాయచోటికి వరాల జల్లు

  • Published By: chvmurthy ,Published On : December 24, 2019 / 10:56 AM IST
సీమను పూర్తిస్ధాయిలో అభివృధ్ది చేస్తా :  రాయచోటికి వరాల జల్లు

కృష్ణా , గోదావరి జలాలను రాయలసీమకు తరలించటం ద్వారా సీమను పూర్తి స్ధాయిలో అబివృధ్ది చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. కడపజిల్లా రాయచోటిలో రూ.3వేల కోట్లతో చేపట్టిన పలు అభివృధ్ది పనులకు ఆయన మంగళవారం శంకుస్ధాపన చేశారు. గత ప్రభుత్వాల వైఖరి వల్ల రాయచోటి నిర్లక్ష్యానికి గురయ్యిందని ఆయన అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే రాయచోటికి ఔటర్ రింగ్ రోడ్డు..తాగునీటికోసం పధకాలు అమలు చేసారని… తర్వాతి కాలంలో నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందన్నారు. తాగు సాగునీటి కోసం రాయచోటి అల్లాడుతోందని జగన్ అన్నారు.

రాయచోటితోపాటు  చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లోతాగునీటి సమస్య తీర్చేందుకు ప్రణాళికలు రూపోందించి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా గాలేరు నగరి సుజల స్రవంతిలో భాగంగా కాలేటివాగు రిజర్వాయరు సామర్ధ్యం పెంచబోతున్నాం. కాలేటివాగు రిజర్వాయరు బ్రాంచి కాలువల ద్వారా సమీప గ్రామాలకు నీటిని అందిస్తామని చెప్పారు. ఇక్కడి నుంచి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి, పీలేరు, చిత్తూరు నియోజక వర్గాలకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. గాలేరు నగరి, హంద్రీ నీవా కాలువలను కలపడం వల్ల ..హంద్రీనీవా నుంచి తీసుకు వెళ్లాల్సిన నీరు తగ్గుతుంది..కనుక చిత్తూరు జిల్లాలో మిగిలి ఉన్నప్రాంతాలు మదనపల్లి..పలమనేరు, పుంగనూరు, కుప్పం.. నియోజక వర్గాలకు మేలు జరుగుతుందని చెప్పారు. ఇందుకోసం రూ.1272 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్ వివరించారు.
 
వరదలు, వర్షాలు వచ్చినా జిల్లాలోని వెలిగల్లు రిజర్వాయరు నిండటంలేదు. రూ. 86.5 కోట్లు ఖర్చు చేసి రిజర్వాయరు వద్ద లిఫ్టు నిర్మించి రాయచోటి, గాలివీడు మండలాల్లో  చెరువులను నింపుతామని సీఎం హామీ ఇచ్చారు. మరో రూ .40 కోట్లతో సంబేపల్లి మండలంలో జరికోన నుంచి నీటిని ఎత్తిపోయటానికి ఖర్చు చేస్తామని కూడా ఆయన తెలిపారు.
రాయచోటి పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రయినేజికోసం, మంచినీటి కోసం, పట్టణాభివృధ్ధికోసం రూ.340 కోట్లు ఖర్చు చేస్తున్నాం. రాయచోటి లోని  50 పడకల ఆస్పత్రిని రూ.23 కోట్లతో 100 పడకల ఆస్పత్రిగా అభివృద్ది  చేస్తామన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన  గ్రామవార్డు సచివాలయాల అభివృధ్ది కోసం రూ.11.55 కోట్లు…మురుగు కాల్వల్లో  సిమెంట్ పనుల కోసం రూ.31 కోట్లు ఖర్చు చేసున్నాం. రాయచోటిలో పోలీసు కార్యాలయం కోసం రూ.20 కోట్లతో శంకుస్ధాపన చేశాము. రాయచోటిలో డీఎస్సీ ఆఫీసు, ట్రాఫిక్ పోలీసుస్టేషన్ మంజూరు చేశామని  సీఎం  జగన్ తెలిపారు.

మైనార్టీ వెల్ఫేర్ కు సంబంధించి 2 రెసిడెన్షియల్స్ స్కూల్స్ మంజూరు చేసి వాటికోసం రూ.36 కోట్లు మంజూరు చేస్తున్నామని జగన్ చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీమేరకు..రాయచోటిలో వక్ఫ్ బోర్డు, విద్యాశాఖ మధ్య గొడవలో ఉన్న 4 ఎకరాల భూమిని వక్ఫ్ బోర్డుకు అప్పగిస్తున్నామని ప్రకటించారు. రాయచోటి లో హైస్కూల్ గ్రౌండ్, జూనియర్ కాలేజీ విద్యార్ధులు ఉపయోగించుకుంటున్న ప్లే గ్రౌండ్ ను 2 కోట్లతో ఆధునికరిస్తామన్నారు.

శ్రీశైలం  ప్రాజెక్టులో నానాటికీ నీటినిల్వ సామర్ధ్యం తగ్గిపోతోందని..ఈ  ఏడాది వరదలు వచ్చి, 8 సార్లు  గేట్లు ఎత్తి ప్రకాశం బ్యారేజి నుంచి 800 టీఎంసీలు నీటిని సముద్రంలోకి వదిలామని చెప్పారు.  కృష్ణానది అంత నిండుగా ప్రవహించినా… వృధాగా పోతున్ననీటితో రాయలసీమలోని ప్రాజెక్టులు నిండని పరిస్ధితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాయల సీమలోని గండికోట ప్రాజెక్టు పూర్తిసామర్ధ్యం 27 టీఎంసీలు కాగా.. ఇంత వర్షాలు పడినా కూడా  12 టీఎంసీలు మాత్రమే నింపుకోగలిగామన్నారు.  10 టీఎంసీల సామర్ధ్యం ఉన్న చిత్రావతిలో 6 టీఎంసీలు నింపాం. బ్రహ్మసాగర్ లో కూడా అదే పరిస్ధితి ఉందని.. నీళ్లు ఉన్నా రిజర్వాయర్లను నింపుకోలేని పరిస్ధితి సీమలో ఉందన్నారు.

తాను అధికారంలోకి వచ్చినప్పటినుంచి  ఈ  పరిస్ధితులను అధిగమించటానికి ఏమేం చేయాలో అధికారులతో చర్చిస్తున్నానని ఆయన తెలిపారు. కాలువల సామర్ధ్యం లేకపోవటం వల్ల రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ప్రాజెక్టులు నీటిని నిల్వచేసుకోలేక పోతున్నాయి. గతంలోనే ఆర్ఆండ్ ఆర్ పనులు పూర్తి చేసి,డబ్బులు కేటాయించి ఉంటే  ఈ పాటికి రాయలసీమలోని ప్రాజెక్టులు నిండుకుండలా ఉండేవి. రాయలసీమలోని ఫ్రాజెక్టుల పరిస్ధితి మార్పు చేసేందుకు పూర్తిగా కృషి చేస్తానని జగన్ హమీ ఇచ్చారు.

కృష్ణా నదికి 50 రోజులు  వరద వస్తుంది. ఆవరద వచ్చినప్పుడే ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలోని ప్రాజెక్టులు నింపేందుకు కృషి చేయాలన్నారు. అందులో భాగంగా వరదజలాలు వచ్చే సమయంలో  పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని 44వేల క్యూసెక్కులనుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచబోతున్నామన్నారు. తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, కేసీకెనాల్ నిప్పులవాగు, ఎస్ ఆర్బీసీ ల నీటి సామర్ధ్యం పెంచబోతున్నామని సీఎం తెలిపారు.

అవుకు, గండికోట గండికోట.చిత్రావతి పైడిపాలెం కాలువల అభివృధ్ధి పనులకు సంబంధించి రూ.23 వేలకోట్లతో  ప్రణాళికలు రూపోందించమని అధికారులను ఆదేశించానని సీఎంజగన్ చెప్పారు. రైతుల మేలు కోసం అధికారులు యుధ్ద ప్రాతిపదికన ప్రణాళికలు రూపోందిస్తున్నారు. ఒకవైపు రాను రాను శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్ధ్యం తగ్గిపోతోందని.. మరోవైపు గోదావరిలో 3వేల టీఎంసీలు నీరు సముద్రంలోకిపోతోందన్నారు. వృధాగా పోతున్న గోదావరి జలాలాను బొల్లేపల్లి నుంచి రాయలసీమకు తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం నడుం బిగించిందని దీన్నిరూ.60 వేల కోట్లతో పూర్తిచేస్తానని జగన్  హామీ ఇచ్చారు.