జగన్ ఫిక్సయ్యారు : 3 రాజధానులపై నేడే అధికారిక ప్రకటన..?

ఏపీ రాజధాని భవితవ్యం ఇవాళ(జనవరి 20,2020) తేలిపోనుంది. రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణలో కీలక ఘట్టానికి అసెంబ్లీ వేదిక కానుంది. మూడు రాజధానుల ప్రతిపాదనపై

  • Published By: veegamteam ,Published On : January 20, 2020 / 01:11 AM IST
జగన్ ఫిక్సయ్యారు : 3 రాజధానులపై నేడే అధికారిక ప్రకటన..?

ఏపీ రాజధాని భవితవ్యం ఇవాళ(జనవరి 20,2020) తేలిపోనుంది. రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణలో కీలక ఘట్టానికి అసెంబ్లీ వేదిక కానుంది. మూడు రాజధానుల ప్రతిపాదనపై

ఏపీ రాజధాని భవితవ్యం ఇవాళ(జనవరి 20,2020) తేలిపోనుంది. రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణలో కీలక ఘట్టానికి అసెంబ్లీ వేదిక కానుంది. మూడు రాజధానుల ప్రతిపాదనపై అసెంబ్లీలో చట్టం చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే రాజధాని పేరెత్తకుండానే వికేంద్రీకరణ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురావాలన్న యోచనలో జగన్ ప్రభుత్వం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇవాళ్టి నుంచి ఏసీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ఏర్పాటు… రాష్ట్రంలో మూడు రాజధానులు… అభివృద్ధి వికేంద్రీకరణ… సీఆర్డీఏ చట్టంలో మార్పు లాంటి కీలక నిర్ణయాలకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. ఈ నిర్ణయాలను ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ విభేదిస్తుండటంతో సమావేశాలు గతంలో కంటే వాడీవేడిగా జరిగే అవకాశముంది.

9 గంటలకు ఏపీ కేబినెట్‌.. 11 గంటలకు అసెంబ్లీ:
ఉదయం 9 గంటలకు జరిగే కేబినెట్‌ సమావేశం జరుగుతుంది. రాజధాని మార్పు అంశంపై హై పవర్ కమిటీ తన నివేదికను కేబినెట్‌కు సమర్పించనుంది. ఈ నివేదికపై మంత్రిమండలి కూలంకశంగా చర్చించి ఆమోదిస్తుంది. రాజధాని మార్పుతో ఏర్పడే సమస్యలపై కూడా చర్చించనుంది. ఉద్యోగుల సమస్యలపై కూడా మంత్రివర్గ సహచరులతో సీఎం జగన్‌ చర్చించనున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు నష్టపోకుండా ఏం చేయాలో ఆలోచించి తగిన సలహాలు ఇవ్వమని సీఎం జగన్ మంత్రివర్గ సహచరుల్ని ఇదివరకు కోరారు. వారి సలహాలు, సూచనలపై కూడా కేబినెట్‌లో చర్చించనున్నారు.

farmers

రైతులు నష్టపోకుండా చర్యలు‌:
ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్న భూములపైనా చర్చ జరగనుంది. ఈ విషయంపై హడావుడిగా నిర్ణయం తీసుకోరాదని ప్రభుత్వం భావిస్తోంది. కొంత సమయం తీసుకొని రైతులు నష్టపోకుండా చూడాలని సీఎం జగన్ భావిస్తున్నారు. రైతులతో పాటు 29 గ్రామాల్లో ఉన్న రైతు కూలీల సంక్షేమం పట్ల కూడా మంత్రివర్గంలో చర్చిస్తారు. రైతులకు, రైతు కూలీలకు గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన సాయం కంటే రెట్టింపు చేయాలన్న భావనలో జగన్ ఉన్నారు. రైతులకు ఇచ్చే కౌలు, రైతు కూలీలకు ఇచ్చే పింఛను పెంచే అంశంపై మంత్రివర్గ భేటీలో చర్చ జరగనుంది.

a

రైతులు, రైతు కూలీలకు న్యాయం:
అసైన్డ్‌ భూముల రైతులకు కూడా సమ న్యాయం చేసేందుకు నిర్ణయం తీసుకోనుంది. అలాగే కేబినెట్‌ సమావేశంలో సీఆర్డీఏ చట్టంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. గతంలో అసెంబ్లీ ఆమోదించిన సీఆర్డీయే చట్టాన్ని రద్దు చేయడం లేదా కొన్ని సవరణలు ప్రతిపాదించవచ్చని అంటున్నారు. ఇందుకు కొన్ని నిర్ణయాలను కేబినెట్‌లో చర్చించి ఆమోదించనున్నారు. మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించనుంది.

కేబినెట్‌ ముగిశాక 10 గంటలకు అసెంబ్లీలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో అసెంబ్లీని ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం మాత్రం మూడు రోజులకు మించకుండా సమావేశాలు ముగించాలన్న ఉద్దేశంతో ఉంది. ఎంతో ముఖ్యమైన అంశాలపై చర్చ జరగాల్సి ఉన్నందున అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు జరపాలని… ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పట్టుబట్టనుంది.

రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న ఆందోళనల కారణంగా ఎక్కువ రోజులు జరిపితే శాంతి భద్రతల సమస్య ఏర్పడే ప్రమాదముందని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాక ఈ సమస్యను త్వరగా పరిష్కారం చేయాల్సిన అవసరముందని యోచిస్తోంది. రాజధానిపై రగడ వల్ల ప్రభుత్వం కూడా పాలనకు పూర్తిగా సమయం కేటాయించలేకపోతోంది. అంతేకాక అభివృద్దిపై, రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టలేకపోతోంది. అందుకే త్వరగా రాజధాని మార్పుకు ముక్తాయింపు ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నారు.

jagan

బిల్లుల విషయంలో ప్రభుత్వం గోప్యత:
అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బిల్లుల విషయంలో ప్రభుత్వం అత్యంత గోప్యత పాటిస్తోంది. ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు పెట్టాలనుకున్నప్పుడు.. ఏ బిల్లులు పెట్టాలనుకుంటున్నామో.. అందులో ఏముంటుందో.. ప్రకటించడం సంప్రదాయం. కానీ, జగన్ ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి.. ఏ బిల్లులు అందులో ప్రవేశ పెట్టబోతున్నామో.. అందులో ఏముంటుందో బయటకు పొక్కనీయడం లేదు. రాజధాని తరలింపు కోసం అనే విషయం కూడా అధికారికంగా ఎక్కడా చెప్పలేదు. సీఆర్డీఏ చట్టం రద్దు.. జోనల్ డెవలప్‌మెంట్ కౌన్సిళ్ల బిల్లులను పెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ.. అధికారికంగా మాత్రం అసలు ఏ బిల్లులుంటాయి.. అందులో ఏముంటాయన్న దాన్ని మాత్రం చెప్పడం లేదు. బిల్లుల రూపకల్పనలో.. అత్యంత విశ్వసనీయమైన అధికారుల్ని మాత్రమే వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. వారికి కూడా.. బిల్లులో ఉన్న విషయాలేమీ బయటకు వెళ్లకూడదని స్పష్టమైన సూచనలిచ్చినట్లు సమాచారం.

శాసనమండలిలో సవాలే:
మరోవైపు అసెంబ్లీలో బలంగా ఉన్న జగన్‌ ప్రభుత్వానికి తన నిర్ణయాలను ఆమోదింపజేసేకోవడం నల్లేరు మీద నడకే. కానీ శాసనమండలిలో ఆమోదం పొందడం సవాలే. ప్రతిపక్షానికి చెందిన యనమల రామకృష్ణుడు, డొక్కా మాణిక్య వరప్రసాదరావు, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కలిసి గట్టిగా చర్చించే అవకాశముంది. అంతేకాక బిజెపి ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్, టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ దూకుడుగా వ్యవహరించే అవకాశాలున్నాయి.

శాసనసభలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, రామానాయుడు గట్టిగానే ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. వీరికి అడ్డుకట్ట వేసేందుకు సీఎం జగన్ తన ప్రణాళికలతో సిద్దంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి సస్పెండ్ కాకుండా చర్చలో పాల్గొనాలని టీడీపీ భావిస్తోంది. స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా సభ బయట రాజధాని మార్పుకు తన మద్దతు తెలిపారు. విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ఏర్పాటు సరైందేనని… ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఎందుకు అడ్డుకొనే యత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీపై స్పీకర్ తమ్మినేని పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో స్పీకర్ వ్యవహార శైలి సభలో ఎలా ఉంటుందని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

* నేడు తేలిపోనున్న ఏపీ రాజధాని భవితవ్యం
* పరిపాలనా వికేంద్రీకరణలో కీలక ఘట్టం
* 9 గంటలకు ఏపీ కేబినెట్‌.. 11 గంటలకు అసెంబ్లీ
* మూడు రాజధానుల ప్రతిపాదనపై అసెంబ్లీలో చట్టం
* రాజధాని పేరెత్తకుండానే వికేంద్రీకరణ పేరుతో…
* కొత్త చట్టాన్ని తీసుకొస్తారని జోరుగా ప్రచారం

* బిల్లుల్లో ఏముంటుందో బయటకు తెలియకుండా గోప్యత
* కేబినెట్‌కు నివేదిక సమర్పించనున్న హైపవర్ కమిటి
* రైతులు నష్టపోకుండా చూడాలన్న భావనలో సీఎం జగన్‌
* రైతులు, 29 గ్రామాల్లోని రైతు కూలీల సంక్షేమంపై కేబినెట్‌లో చర్చ
* రైతులకు, రైతు కూలీలకు రెట్టింపు సాయం చేసే యోచన
* కేబినెట్‌ భేటీలో సీఆర్డీఏ చట్టంపై కీలక చర్చ
* సీఆర్డీఏ చట్టం రద్దు లేదా సవరణలు ప్రతిపాదించే ఛాన్స్‌

 

Also Read : మూడు వద్దు.. ఒకటే ముద్దు : రాజధానిపై చంద్రబాబు మాస్టర్ ప్లాన్