జగన్ మరో సంచలన నిర్ణయం : విశాఖ మెట్రోకు కొత్త డీపీఆర్

  • Published By: chvmurthy ,Published On : February 8, 2020 / 02:17 AM IST
జగన్ మరో సంచలన నిర్ణయం : విశాఖ మెట్రోకు కొత్త డీపీఆర్

ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా త్వరలో పని ప్రారంభించబోయే విశాఖలో మౌలిక సదుపాయాల కల్పనపై  ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే మిలీనియం టవర్స్-బి లో నిర్మాణం పనులకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. 

విశాఖలోని మెట్రో రైలు ప్రాజెక్టుకు కొత్త డీపీఆర్‌ రూపకల్పన కోసం ప్రతిపాదనల్ని పిలవాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కొటేషన్లు పిలిచేందుకు అమరావతి మెట్రో రైలు ఎండీకి ఆదేశాలు ఇచ్చింది. విశాఖలో 79.9 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం కోసం కొత్త డీపీఆర్‌లను రూపొందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టబోతుంది

గతంలో డీపీఆర్‌ రూపకల్పన కోసం ఎస్సెల్‌ ఇన్ఫ్రా కాన్సార్షియం కు ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రతిపాదనల రూపకల్పన కోసం ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌, రైట్స్‌, యూఎంటీసీ తదితర సంస్థలను సంప్రదించాల్సిందిగా ప్రభుత్వం ఉత్వరుల్లో పేర్కొంది. 

మూడు కారిడార్లలో మెట్రో రైలు నిర్మాణం  కోసం డీపీఆర్‌ల రూపకల్పనతో పాటు 60 కిలోమీటర్ల మేర మోడరన్‌ ట్రామ్‌ కారిడార్‌ ఏర్పాటుకు మరో డీపీఆర్‌ను సిద్ధం చేసేందుకు ప్రతిపాదనల్ని స్వీకరించాలని ప్రభుత్వం సూచించింది. 
 

ఇప్పటికే విశాఖపట్నంను కార్యనిర్వాహక రాజధానిగా చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడు మెట్రో రైలు ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లడంపై విశాఖవాసులు ఆనందం వ్యక్తం చేశారు. మెట్రోతో విశాఖ మరింత అందం, ఆకర్షణ వస్తుందని అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో మూడు రాజధానుల గురించి ప్రస్తావించిన సమయంలో పరిపాలనా రాజధానిగా విశాఖ గురించి మాట్లాడారు. ఆ సమయంలో విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తే పెద్దగా ఖర్చు ఉండదని చెబుతూనే..అక్కడ తక్కువ ఖర్చు తో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయవచ్చని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో విశాఖ లో మెట్రో రైల్ ఏర్పాటు చేస్తే చాలని వ్యాఖ్యానించారు.