జగన్ కు షాక్ : పోలవరం పనులకు హైకోర్టు బ్రేక్

  • Edited By: chvmurthy , November 8, 2019 / 10:05 AM IST
జగన్ కు షాక్ : పోలవరం పనులకు హైకోర్టు బ్రేక్

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు మరోసారి బ్రేక్ పడింది. హైడల్ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవయుగ సంస్థ వేసిన పిటిషన్ ను నవంబర్ 8,2019 శుక్రవారం, విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశించింది. దీనికి తోడు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 12 మంగళవారానికి వాయిదా వేసింది. 

విచారణ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది వాదిస్తూ,పనులు నిలిచిపోతే అన్ని విధాలుగా నష్టం వాటిల్లుతుందని కోర్టుకు విన్నవించారు. వరదలు మళ్లీ మొదలైతే పనులు చేపట్టడం కష్టమవుతుందని చెప్పారు. అయితే, ఈ వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. మరో 15 రోజులు పనులు నిలిచిపోయినా ఎలాంటి నష్టం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. 

ఏపీ లో సీఎం జగన్ అధికారం  చేపట్టిన తర్వాత ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని  రివర్స్ టెండరింగ్ కు వెళ్లి పోలవరం ప్రాజెక్టుతో పాటుగా హైడల్ పవర్ ప్రాజెక్టు పనుల నుండి టీడీపీ హాయంలో పనులు దక్కించుకున్న నవయుగ సంస్థను తప్పించారు.  హైడల్ పవర్ ప్రాజెక్టు పనుల నుండి జగన్ ప్రభుత్వం తమను తప్పించగానే నవయుగ కోర్టును ఆశ్రయిచింది. పోలవరం జల విద్యుత్ ప్రాజక్టు పనుల విలు 3216 కోట్లు. మరో వైపు ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్, హైడల్ వర్క్స్ పనులను ఒకే కాంపోనెంట్ కింద  జగన్ ప్రభుత్వం  రివర్స్ టెండరింగ్ 4,987 కోట్లకు పిలవగా మెగా ఇంజనీరింగ్ కంపెనీ 12.6శాతానకి తక్కువుగా కోట్ చేసి 4,358 కోట్లకు పనులను దక్కించుకుంది. నవంబర్ 1 మంగళవారం నుంచి  మేఘ సంస్ధ ప్రాజెక్టు వద్ద పనులను చేపట్టింది.