వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్లాన్ కేంద్రానిదా? జగన్ మరింత జోరు పెంచుతారా?

  • Published By: veegamteam ,Published On : March 24, 2020 / 09:47 AM IST
వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్లాన్ కేంద్రానిదా? జగన్ మరింత జోరు పెంచుతారా?

ఏపీ రాజకీయాలపై ఆ రెండు పార్టీలకు మాత్రమే క్లారిటీ ఉందా? ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ.. రెండోది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఈ పార్టీలతో పాటు కొందరు ఎమ్మెల్సీలకు మాత్రం అసలు  విషయం బోధపడిందా? అందుకే అధికార పార్టీలో చేరిపోతున్నారా? అసలు శాసనమండలి రద్దు వ్యవహారం ఎంతవరకూ వచ్చింది? కేంద్ర పెద్దలు ఈ విషయంలో జగన్‌కు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశారా?

టీడీపీ ఎమ్మెల్సీలను మేనేజ్‌ చేసుకోవాలన్న కేంద్ర పెద్దలు:
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్‌కు కేంద్ర పెద్దలు ఒక విషయాన్ని స్పష్టం చేశారనే ప్రచారం జోరందుకుంది. ఈ కీలక సూచనల మేరకు జగన్‌ అడుగులు వేస్తున్నారట. ఆంధ్రప్రదేశ్‌  శాసనమండలి రద్దు విషయంలో ఢిల్లీ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో మండలిని రద్దు చేయడం వీలయ్యేది కాదని తేల్చేశారని అంటున్నారు. అందుకే మండలిని రద్దు చేయకుండా, టీడీపీ  ఎమ్మెల్సీలను మేనేజ్ చేసుకోవాలని ఢిల్లీలోని కమలం పెద్దలు సీఎం జగన్‌కు సలహా ఇచ్చారట. రాష్ట్రంలో ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే ఆ ప్రచారం వాస్తవమేనని జనాలు అంటున్నారు. 

మండలి రద్దు బిల్లు పెట్టి పాస్‌ చేసే పరిస్థితులు లేవా?
దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావం నానాటికి పెరుగుతుండడంతో పార్లమెంటులో ఏపీ శాసనమండలి రద్దు బిల్లు పెట్టి పాస్‌ చేసే పరిస్థితులు లేవు. అందుకే టీడీపీ ఎమ్మెల్సీలను మేనేజ్‌ చేసుకోవాలని కేంద్ర పెద్దలు  జగన్‌కు సూచించారని చెబుతున్నారు. శాసనమండలిలో ప్రస్తుతం 58 మంది సభ్యులున్నారు. అందులో 26 మంది టీడీపీ ఎమ్మెల్సీలే. వారిలో ముగ్గురు ఇప్పటికే వైసీపీ కండువా కప్పుకొన్నారు. శాసనమండలిని రద్దు  చేస్తున్నట్టు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న తర్వాతే ఇద్దరు ఎమ్మెల్సీలు వైసీపీలో చేరిపోయారు. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే యామిని బాల టీడీపీని వీడి వైసీపీలో  చేరారు.

రెండేళ్లు ఆగమని జగన్‌కు చెప్పి కేంద్ర పెద్దలు ఒప్పించారా?
సీఎం జగన్ ఓ రెండేళ్లు తనవి కాదనుకుంటే, ఆ తర్వాత శాసనమండలిలో వైసీపీకి సంఖ్యాబలం పెరుగుతుంది. కాబట్టి, ఇప్పుడు తొందరపడి శాసనమండలిని రద్దు చేసుకోవడం కంటే, ఓ రెండేళ్లు ఆగడమే మంచిదని,  అప్పుడు పార్టీకి సంఖ్యాబలం పెరుగుతుందని కేంద్రం పెద్దలు జగన్‌కు నచ్చజెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ నేతలను పెద్ద ఎత్తున వైసీపీలోకి చేర్చుకుంటున్నారు. వారికి మండలి పదవులు  ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పారట. మండలిని రద్దు చేసుకోవడం కంటే ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా మెల్లమెల్లగా టీడీపీ ఎమ్మెల్సీలను తమ వైపు తిప్పుకుంటే లాభదాయకంగా ఉంటుందని చెప్పడంతో జగన్  కూడా కొంచెం మెత్తబడినట్టు చెబుతున్నారు. 

జగన్‌ మీద ఒత్తిడి తీసుకొచ్చిన ఢిల్లీ పెద్దలు:
మరోపక్క, శాసనమండలిని రద్దు చేసేస్తామన్న ధీమాతో ఎమ్మెల్సీలు, మంత్రులు అయిన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లను జగన్ రాజ్యసభకు పంపారు. ఆ ఎన్నికలు కూడా త్వరలోనే  జరగనున్నాయి. ఒకవేళ కేంద్రం పెద్దలు చెప్పినట్టు మండలి విషయంలో జగన్ కొంచెం ఆలోచించినా.. మరి వారిద్దరినీ ఎందుకు రాజ్యసభకు పంపుతారని వాదించే వారు కూడా ఉన్నారు. అయితే, మోపిదేవి, పిల్లి  నామినేషన్ వేసిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఈ చర్చ వచ్చిందని అంటున్నారు. మండలి రద్దు వ్యవహారం ప్రస్తుతం కేంద్రం కోర్టులో ఉంది. కేంద్రం పెద్దలు కూడా వద్దని చెబుతున్నారు కాబట్టి,  జగన్ ఢిల్లీ నేతల మీద ఒత్తిడి చేసే అవకాశం ఉండదని భావిస్తున్నారు. అందుకే మండలిలో తమ పదవులకు ఢోకా ఉండబోదని టీడీపీ నేతలు లెక్కలు వేస్తున్నట్టు తెలుస్తోంది.

ఆపరేషన్‌ ఆకర్ష్‌కే జగన్‌ మొగ్గు చూపిస్తున్నారా?
ప్రస్తుతం టీడీపీకి చెందిన ఎక్కువమంది సభ్యులను ఆకర్షిస్తే.. తమ పని సులువు అయిపోతుందనే ఆలోచనలో వైసీపీ అధినేత జగన్‌ ఉన్నారని అంటున్నారు. ఆ దిశగానే పావులు కదుపుతున్నారట. ఇప్పటికే  ముగ్గురిని చేర్చుకున్న జగన్‌.. రాబోయే రోజుల్లో మరింత మందిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తారని చెబుతున్నారు. కేంద్ర పెద్దల సలహాతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్లాన్‌ ప్రకారం ముందుకెళ్లడమే బెటర్‌ అనే  ఆలోచనలో జగన్‌ ఉన్నారని అంటున్నారు.

Also Read | ఆధార్-పాన్, GST, ITR గడువు తేదీలు జూన్ 30వరకు పొడిగింపు