మండలికి మంగళం : టీడీపీ కన్నా వైసీపీకే నష్టం ఎక్కువ..!

కొంత ఆవేశం.. మరికొంత అహం... ఇంకొంత పట్టుదల.. ఈ మూడు కలగలిస్తేనే ఆ నాయకుడు. మాట ఇవ్వరు.. ఇచ్చాడా తప్పడు. అంతెందుకు మడమ తిప్పడు.. ఇదీ

  • Published By: veegamteam ,Published On : January 27, 2020 / 03:44 PM IST
మండలికి మంగళం : టీడీపీ కన్నా వైసీపీకే నష్టం ఎక్కువ..!

కొంత ఆవేశం.. మరికొంత అహం… ఇంకొంత పట్టుదల.. ఈ మూడు కలగలిస్తేనే ఆ నాయకుడు. మాట ఇవ్వరు.. ఇచ్చాడా తప్పడు. అంతెందుకు మడమ తిప్పడు.. ఇదీ

కొంత ఆవేశం.. మరికొంత అహం… ఇంకొంత పట్టుదల.. ఈ మూడు కలగలిస్తేనే ఆ నాయకుడు. మాట ఇవ్వరు.. ఇచ్చాడా తప్పడు. అంతెందుకు మడమ తిప్పడు.. ఇదీ ఆయనకున్న పేరు. ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం ఆవేశంతో తీసుకున్నారా.. అహం దెబ్బతిని తీసుకున్నారా.. పట్టుదలకు పోయి తీసుకున్నారా? ఏదైతేనేం.. ప్రత్యర్థులకు ఎంత నష్టం జరుగుతుందో.. సొంత పార్టీకీ అంతే నష్టం జరుగుతుంది. ఇదంతా తెలియకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనుకుంటున్నారా? ఆయనకూ తెలుసు. కాకపోతే ముందే చెప్పాను కదా.. ఆవేశం, అహం.. పట్టుదల కాస్త ఎక్కువ అని! 

నష్టపోయే వాటిలో ఫస్ట్ టీడీపీ.. నెక్ట్స్ వైసీపీ, బీజేపీ:
మండలి రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం అటు విపక్షానికి, ఇటు అధికార పార్టీకి కూడా నష్టమేనని అన్ని పార్టీల నాయకులు అనుకుంటున్నారు. సీఎం జగన్ నిర్ణయం రాజకీయాల్లో సంచలనంగా మారగా.. మిగిలిన పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. రద్దు జరిగితే దాదాపు 55 మంది నేతలు ఎమ్మెల్సీ పదవులు కోల్పోతారు. మండలి రద్దు జరిగితే టీడీపీనే ఎక్కువ మంది ఎమ్మెల్సీ పదవులకు దూరమవుతారు. తర్వాత వైఎస్సార్‌ సీపీ, బీజేపీ, పీడీఎఫ్‌లు ఉన్నాయి. టీడీపీ సంగతి పక్కన పెడితే బీజేపీకి కష్టాలు తప్పేలా లేవంటున్నారు. ఆ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. రద్దు ఖాయమైతే పదవులు కోల్పోతారు. ఇది ఓ రకంగా ఆ పార్టీకి ఒకింత ఇబ్బందికర పరిస్థితి అనే చెప్పాలి.

హామీలిచ్చిన వారికి జగన్‌ ఏం చెబుతారు..?
మరోపక్క, వైసీపీకి ఈ పరిణామాలు ఇబ్బందికరమేనని జనాలు అంటున్నారు. ఎందుకంటే పాదయాత్ర సందర్భంగా, ఆ తర్వాత ఎన్నికల ముందు కూడా వైసీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవులు కట్టబెడతామని వైఎస్‌ జగన్‌ చాలా మందికి హామీలిచ్చారు. మాట తప్పను.. మడమ తిప్పనని చెప్పుకొనే జగన్‌.. ఇప్పుడు వారందరికీ ఏం చెబుతున్నారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి మండలి రద్దు చేయాలన్న నిర్ణయానికి అంత సులభంగా వైసీపీ అధిష్టానం మొగ్గు చూపించ లేదంట. సాధ్యమైనంత వరకూ టీడీపీ ఎమ్మెల్సీలను తమ వైపునకు తిప్పుకోవడానికి ఆ పార్టీ నేతలు ప్రయత్నించారట. కాకపోతే ఆ విషయంలో విఫలం కావడంత ఇక చేసేదేం లేక.. తన మూడు రాజధానుల పంతాన్ని నెగ్గించుకోవాలన్న ఉద్దేశంతో సీఎం జగన్‌ మండలి రద్దుకు మొగ్గు చూపించారని అంటున్నారు.

ఆశావహుల ఆశలపై జగన్ నీళ్లు:
సార్వత్రిక ఎన్నికల సమయంలో అసంతుష్టులకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో టికెట్‌ ఆశించి, నిరాశ పొందిన వారు, తాము గెలిచిన సీట్లను స్థానిక సర్దుబాట్లు, సమీకరణాల్లో కోల్పోయిన వారిలో బలమైన నేతలకు జగన్‌ అప్పట్లో ఈ హామీలిచ్చారు. జిల్లా వారీగా అలాంటి నేతలను పిలిపించుకొని ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తానని బుజ్జగించారు. ఇప్పుడు వారంతా మండలిలో ఖాళీ అయ్యే స్థానాలపైనే ఆశలు పెట్టుకొన్నారు. తాజా రాజకీయ పరిణామాలు మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లేలా వేగంగా మారుతున్నాయి.

మాకే నష్టమంటున్న వైసీపీ నేతలు:
తమ అధినేత ఇచ్చిన హామీలు.. భవిష్యత్‌లో మండలిలో వైసీపీ సభ్యుల సంఖ్యను బేరీజు వేసుకున్న పార్టీ నేతలు.. అకస్మాత్తుగా కౌన్సిల్‌ రద్దు చేస్తే తమకే నష్టమని అనుకుంటున్నారట. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని యాదవ సామాజికవర్గ నేత రామారావుకు ఎమ్మెల్సీ ఇస్తానని ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ హామీ ఇచ్చారు. అలాగే మత్స్యకారులు అధికంగా ఉన్న ఈ జిల్లాలో ఆ సామాజికవర్గానికి కూడా ఎమ్మెల్సీని జగన్‌ వాగ్దానం చేశారు. విజయనగరం జిల్లాలో కూడా ఎమ్మెల్సీ పదవిపైన చాలా మందే ఆశలు పెట్టుకున్నారు. మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజుకు లేదా ఆయన కుమారుడికి ఇస్తామన్నారు. మంత్రి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు కూడా ఆశావహుల్లో ఉన్నారట.

కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన ఉప్పాల రాంప్రసాద్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ స్థానాన్ని జోగి రమేశ్‌కు కేటాయించిన అధిష్ఠానం.. రాంప్రసాద్‌కు ఎమ్మెల్సీని ఇవ్వడానికి అంగీకరించింది. గన్నవరానికి చెందిన యార్లగడ్డ వెంకట్రావు, విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన యలమంచిలి రవికి కూడా ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో ఆనం విజయకుమార్‌ రెడ్డికి ఎమ్మెల్సీ హామీ లభించింది. చిత్తూరు జిల్లాలో మాజీ ఐఏఎస్‌ చంద్రమౌళికి ఎమ్మెల్సీ ఇస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్సీ ఎస్పీవీ నాయుడుకూ ఇదే భరోసా లభించింది. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి ఆకేపాటి అమర్నాథరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. మేడా రఘునాథరెడ్డికీ ఇదే హామీ ఇచ్చారు.

జగన్.. ఎలాంటి న్యాయం చేస్తారు?
ఎమ్మెల్సీ ఆశావహుల ప్రస్తావన వచ్చిన వెంటనే గుంటూరు జిల్లా నేతలు గుర్తుకు వస్తారు. ఈ జిల్లాలో పెద్ద జాబితానే ఉందంటున్నారు. మరి వీరందరినీ జగన్‌ ఎలా సముదాయిస్తారన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారిందంటున్నారు. ఇక మంత్రులుగా ఉన్న ఎమ్మెల్సీలు మోపిదేవి వెంకట రమణారావు, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఇప్పుడు తమ పదవులను కోల్పోవలసి వస్తుంది. అలానే శాసనమండలిలో చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా తన పదవిని కోల్పోతారు. సొంత పార్టీలోని ఎమ్మెల్సీ ఆశావహుల ఒత్తిడికి తోడు, విపక్షాల నుంచి తగినంత సంఖ్యలో చేరికలు ఉంటే రద్దుపై సీఎం జగన్‌ వెనక్కి తగ్గవచ్చని భావించారు. కానీ, అలాంటి పరిస్థితులు కనిపించలేదు. ఇప్పుడు మండలి రద్దు తర్వాత హామీలు పొందిన ముఖ్యనేతలకు ఎలాంటి న్యాయం చేస్తారన్న విషయం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.