మంత్రి అనీల్ కాళ్లు పట్టుకున్న ముంపు బాధితులు

  • Published By: madhu ,Published On : November 7, 2019 / 05:53 AM IST
మంత్రి అనీల్ కాళ్లు పట్టుకున్న ముంపు బాధితులు

నందికొట్కూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కాన్వాయ్‌ను శ్రీశైలం ముంపు బాధితులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ మంత్రి కాళ్లు పట్టుకున్నారు. పోలీసులు వీరిని నెట్టివేసేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. న్యాయం చేస్తానని, సమస్య పరిష్కరిస్తానని మంత్రి హామీనివ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. 

శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో తమకు న్యాయం చేయాలని కొన్ని రోజులుగా ముంపు బాధితులు ఆందోళన చేపడుతున్నారు. 60 రోజులుగా వీరి ఆందోళన కొనసాగుతోంది. జీవో నెంబర్ 98 అమలు చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో 2019, నవంబర్ 07వ తేదీ గురువారం ఉదయం మంత్రి అనీల్ కుమార్ యాదవ్ శ్రీశైలం నుంచి కర్నూలు వస్తున్నారు. ఈ సమాచారం ముంపు బాధితులకు తెలిసింది.

రహదారిపై చేరుకుని మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. పోలీసులు వీరిని అడ్డుకున్నారు. మంత్రి కాళ్లు పట్టుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గత టీడీపీ ప్రభుత్వం తమకు ఏమాత్రం న్యాయం చేయలేదని, 98 జీవో ప్రకారం కొంతమందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని, మిగిలిన వారికి న్యాయం చేయలేదన్నారు. ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని కోరారు. పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు. సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 
Read More : స్నేహితుడు పట్టించుకోవడం లేదని విద్యార్థి ఆత్మహత్య