రాజధాని నిర్మాణాలపై బొత్స కీలక వ్యాఖ్యలు

  • Published By: chvmurthy ,Published On : August 29, 2019 / 02:27 PM IST
రాజధాని నిర్మాణాలపై బొత్స కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని బట్టి రాజధాని నిర్మాణలపై ముందుకు వెళ్తామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సీఎం జగన్ గురువారం సీఆర్డీఏ అధికారులతో  రాజధాని నిర్మాణం పై సమీక్ష నిర్వహించారు. అనంతరం పురపాలక శాఖమంత్రి బొత్స సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ… 13 జిల్లాలు అభివృద్ధి చెయ్యాలని తమ ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. రాజధాని పరిధిలో గతంలో  జరిగిన  అన్ని అంశాలపై చర్చించామని అన్నారు.  

నిర్మాణంలో ఉన్న అధికారుల  నివాసాలు, వాటికి సంబంధించిన పనుల పురోగతిపై సీఎం కు వివరించినట్లు బొత్స తెలిపారు.  రాజధానిలో  భూములు ఇచ్చిన రైతలకు 64 వేల ప్లాట్స్ రిజిష్ట్రేషన్ చేయాల్సి ఉండగా 43 వేల ప్లాట్స్ రిజిష్ట్రేషన్లు అయ్యాయని ఆయన వివరించారు. రాజధాని రైతులకు కూలీలకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం న్యాయం చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. . శుక్రవారం ఆగస్టు 30వ తేదీ నుంచి  సీఆర్డీఏ పరిధిలోని కౌలురైతులకు చెక్కులు పంపిణీ చెయ్యనున్నామని బొత్స చెప్పారు.

రాజదానిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని.. రాజధాని తరలిస్తామని నేను ఎక్కడ చెప్పలేదని పునరుద్ఘాటించారు.  టీడీపీ ప్రభుత్వం 35వేల కోట్లతో పనులకు టెండర్ల పిలిచారని … వాటికి బ్యాంకుల టైఅప్ లేక పోవటం చేత రద్దు చేశాం అని ఆయన వివరించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి రూ.2800 కోట్లు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని బొత్స తెలిపారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్కి వెళ్తే ఖర్చు తగ్గుతుందని…. తద్వారా  లబ్దిదారులకు మేలు చేకూరుతుందని ఆదిశగా కూడా ఆలోచిస్తున్నట్లు బొత్స చెప్పారు.