రెండో రోజూ రాలేదు : మంత్రి సోమిరెడ్డికి అధికారుల ఝలక్

  • Published By: veegamteam ,Published On : May 1, 2019 / 11:42 AM IST
రెండో రోజూ రాలేదు : మంత్రి సోమిరెడ్డికి అధికారుల ఝలక్

ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అధికారులు మరోసారి ఝలక్ ఇచ్చారు. రెండోరోజూ సమీక్షకు అధికారులు ఎవరూ హాజరవలేదు. బుధవారం (మే 1,2019) ఉదయం 11.30 గంటలకు  ఉద్యాన శాఖపై మంత్రి సోమిరెడ్డి సమీక్ష నిర్వహించాలని అనుకున్నారు. అధికారులు మాత్రం అటెండ్ అవ్వలేదు. ఇక ఎవరూ హాజరుకావడం లేదని సమాచారం రావడంతో చివరికి మంత్రి  సమీక్షను రద్దు చేసుకున్నారు. ఈసీ నిబంధనలతో అధికారులు సమీక్షలకు దూరంగా ఉంటున్నారు. సమీక్షలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని ఈసీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అధికారులు  రివ్యూస్ కి హాజరుకాకూడదని ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు.
Also Read : ఏపీలో జరిగినట్టే యూపీలో జరిగింది : ఎస్పీకి ఓటు వేస్తే బీజేపీకి పడింది

తొలి రోజు (ఏప్రిల్ 30,2019) వ్యవసాయ శాఖ, రెండో రోజు (మే 1,2019) ఉద్యాన శాఖకు సంబంధించి సమీక్ష నిర్వహించాలని సంబంధిత అధికార యంత్రాంగానికి మంత్రి సోమిరెడ్డి నోటీసులు  పంపారు. మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులు కానీ, బుధవారం ఉద్యాన శాఖ అధికారులు కానీ.. సమీక్షకు హాజరుకాలేదు. మంగళవారం మూడు గంటల పాటు సెక్రటేరియట్ లో అధికారులు కోసం మంత్రి వేచి చూశారు. అధికారులు ఎవరూ రాకపోవడంతో సమీక్షను రద్దు చేసుకున్నారు. బుధవారం కూడా అదే జరిగింది. తాను సమీక్ష చేయలేకపోతే పదవి నుంచి  తప్పుకుంటానని సోమిరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.

ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షలపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సమీక్షలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని ఈసీ చెప్పింది. ఈసీ తీరుపై మంత్రి సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.   ఈసీని ఆయన ఛాలెంజ్ చేశారు. తాను వ్యవసాయ శాఖకు సంబంధించి సమీక్షలు నిర్వహిస్తానని, ఏం చేస్తారో చూస్తానని అన్నారు. ఒక వేళ ఈసీ అడ్డుకునే ప్రయత్నం చేస్తే  సుప్రీంకోర్టుకి వెళ్తానని చెప్పారు. అంతేకాదు పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
Also Read : పీఎంకి ఒక రూల్.. సీఎంకి ఒక రూల్ ఉంటుందా