ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు రంగం సిద్ధం 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు రంగం సిద్ధమైంది.

  • Published By: veegamteam ,Published On : January 29, 2019 / 06:13 PM IST
ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు రంగం సిద్ధం 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు రంగం సిద్ధమైంది.

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు రంగం సిద్ధమైంది. ఈ నెల 30వ తేదీన గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 6 పనిదినాల పాటు ఈ సమావేశాలు సాగనున్నాయి. ప్రధాన ప్రతిపక్షం ఈ సారి స‌మావేశాల‌కు గైర్హాజరవుతుండగా…. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలపై సభ ద్వారా గట్టిగా ప్రశ్నించేందుకు అధికారపక్షం సిద్ధమైంది. గవర్నర్‌ ప్రసంగం ద్వారా కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం సభలో ప్రస్తావనకు తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. 

సార్వత్రిక ఎన్నికల్లోపు జరిగే చిట్టచివరి అసెంబ్లీ సమావేశాలు గవర్నర్‌ ప్రసంగంతో బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు గవర్నర్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం సభ వాయిదా పడనుంది. 31న మృతి చెందిన‌ శాసనసభ్యులకు సంతాప తీర్మానం పెట్టనున్నారు. తర్వాత నాలుగురోజులు  ఫిబ్రవ‌రి 1, 2, 3, 4  సెలవు దినాలు. తిరిగి ఫిబ్రవరి 5న ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ఇది ఎంతకాలానికి పెట్టాలని అనేదానిపైనా కసరత్తు చేస్తున్న సర్కారు దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక ఆరో తేదీ నుంచి గవర్నర్‌ ప్రసంగంపై చర్చ జరుగనుంది. ఫిబ్రవరి 8వ తేదీతో సమావేశాలు ముగుస్తాయని స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు తెలిపారు.

అటు.. ఈ సారి కూడా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను అసెంబ్లీ సమావేశాలకు ఆహ్వానిస్తామని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తెలిపారు. అయితే మాట్లాడేందుకు జగన్‌ తనకు అవకాశం ఇవ్వడంలేదని అన్నారు. ప్రతిపక్షం లేదనే అసంతృప్తి సభాపతిగా తనకు ఉంటుందని.. వైసీపీ ఎందుకు అసెంబ్లీకి రావడంలేదో తెలియదన్నారు. ఇరుపక్షాలు ఉంటే సభాపతికి సవాల్‌గా ఉంటుందన్నారు. ఇటు సభ సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. శాసనసభకు వ‌చ్చే అన్ని మార్గాల్లోనూ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు.