ఇద్దరు భార్యలు : నిజం ఏంటో చెప్పిన ఓవైసీ

  • Published By: veegamteam ,Published On : January 18, 2020 / 02:12 PM IST
ఇద్దరు భార్యలు : నిజం ఏంటో చెప్పిన ఓవైసీ

కామారెడ్డిలో ఎంఐఎం బహిరంగ సభ జరిగింది. ఇందులో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. మజ్లిస్ ఒక్క హైదరాబాద్ కే పరిమితమైన పార్టీ కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రమంతా విస్తరిస్తోందన్నారు. ప్రస్తుతం మజ్లిస్ గాలి వీస్తోందని చెప్పారు. మజ్లిస్.. హిందూ-ముస్లింల మధ్య కొట్లాటలు పెడుతుందని కొందరు అంటున్నారని.. అది నిజం కాదని అసదుద్దీన్ చెప్పారు. నాకు ఇద్దరు భార్యలు ఉన్నారని ప్రచారం జరుగుతోందని ఓవైసీ చెప్పారు. దీనిపై స్పందించిన ఓవైసీ.. ఒక భార్యతోనే పరేషాన్ అవుతున్నా.. రెండో భార్యను ఎలా చేసుకుంటా, ఎలా ఏగేది అని వాపోయారు. ఇద్దరు భార్యల ప్రచారంలో వాస్తవం లేదన్నారు. దుష్ప్రచారం చేసి తనను అభాసుపాలు చేయాలని కొందరు చూస్తున్నారని ఓవైసీ ఆరోపించారు. కామారెడ్డిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఓవైసీ పాల్గొన్నారు. మజ్లిస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు.

కాంగ్రెస్.. అసలు సెకులర్ పార్టీనేనా?
కాంగ్రెస్ పార్టీపై ఓవైసీ ఫైర్ అయ్యారు. అసలు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీనేనా అని ప్రశ్నించారు. బీజేపీకి భయపడి.. కేరళకు వెళ్లి రాహుల్ పోటీ చేశారని ఎద్దేవా చేశారు. సొంత లీడర్ ను గెలిపించుకోలేని కాంగ్రెస్ ఇక తనపై ఏం పోటీ చేస్తుందన్నారు. బీహార్ లో నితీష్ కుమార్ ను ఓడించింది తానేనని చెప్పారు. అలాంటి నాకు కాంగ్రెస్ కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఓ శవమని అన్నారు. మహారాష్ట్ర రాజకీయాలను ఉద్దేశించి మాట్లాడిన అసద్.. దేశంలో పొలిటికల్ మ్యారేజ్ చట్టం వచ్చిందని ఎద్దేవా చేశారు. శివసేన, కాంగ్రెస్ పెళ్లి చేసుకుంటే… రిసెప్షన్ శరద్ పవార్ చేసుకున్నాడని సెటైర్ వేశారు.

modi

యూపీలో 25మంది ముస్లింలను ప్రభుత్వం చంపింది:
దేశంలో బీజేపీ పాలన హిట్లర్ పాలనను తలపిస్తోందని అసద్ అన్నారు. ముస్లింలకు తప్ప అందరికి పౌరసత్వం ఇస్తున్నారని ఆరోపించారు. కోటి 30 లక్షల మంది భారతీయులకు మోడీ అబద్ధాలు చెబుతున్నారని చెప్పారు. NPR, NRC ల పై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. మజ్లిస్ పార్టీ తిరంగా ర్యాలీ తీస్తే కాంగ్రెస్, బీజేపీలు పరేషాన్ అయ్యాయని చెప్పారు. తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ లో 25మంది ముస్లింలను యోగి ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని అసద్ ఆరోపించారు. ఇప్పటికి పోస్టుమార్టం రిపోర్ట్ కూడా ఇవ్వలేదన్నారు.

 

asad

ఇప్పటివరకు కామారెడ్డిలో మజ్లిస్ ఎందుకు ఓడిపోతుందో తనకు అర్థం కావడం లేదన్నారు ఓవైసీ. ఇప్పడు తాను వచ్చానని ప్రతి ఒక్కరూ గెలుస్తారని చెప్పారు. తన తండ్రి కాలం నుంచి కామారెడ్డిలో పార్టీ ఉందని తమకేమీ ఈ టౌన్ కొత కాదని చెప్పారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మజ్లిస్ కు పోయేదేమి లేదన్నారు. ఏ పార్టీకి బలం ఉంటే ఆ పార్టీ మాటే చెల్లుతుందన్నారు.

Also Read : CAA ఎఫెక్ట్ : బీజేపీ యువ ఎంపీ హత్యకు కుట్ర