గాంధీభవన్‌కు దూరంగా అజారుద్దీన్, విజయశాంతి.. టీఆర్ఎస్‌, బీజేపీతో టచ్‌లో ఉన్నారా?

  • Published By: naveen ,Published On : October 12, 2020 / 04:04 PM IST
గాంధీభవన్‌కు దూరంగా అజారుద్దీన్, విజయశాంతి.. టీఆర్ఎస్‌, బీజేపీతో టచ్‌లో ఉన్నారా?

azharuddin vijaya shanti: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జిగా మణిక్కమ్‌ ఠాగూర్ నియ‌మితులైన త‌ర్వాత తొలిసారిగా హైద‌రాబాద్‌లో ప‌ర్యటించారు. గాంధీభ‌వ‌న్‌లో నేత‌ల‌తో విడివిడిగా రెండు రోజుల పాటు చ‌ర్చించారు. పార్టీ కేడ‌ర్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఠాగూర్ దృష్టిలో ప‌డేందుకు నేత‌లు చాలా పాట్లు ప‌డ్డారు. కానీ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మాజీ ఎంపీ అజ‌హరుద్దీన్ మాత్రం ఎక్కడా క‌నిపించ‌ లేదు. పార్టీ నేత‌లు కూడా చాలా కాలంగా ఆయనను ప‌ట్టించుకోవ‌డం మానేశారట.

టీఆర్ఎస్‌ తో ట‌చ్‌లో ఉన్నార‌నే ప్రచారం:
హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ అధ్యక్షుడిగా ఎన్నికైన‌ప్పటి నుంచి అజ‌హర్‌.. టీఆర్ఎస్‌ పార్టీతో ట‌చ్‌లో ఉన్నార‌నే ప్రచారం సాగుతోంది. ఇటీవ‌ల స్సోర్ట్స్ పాల‌సీ రూపక‌ల్పన‌లో కూడా అజ‌హర్‌ను ప్రభుత్వం ఆహ్వానించింది. ఏఐసీసీ ఇన్‌చార్జ్ వ‌చ్చిన సంద‌ర్భంలో అజహర్‌ క‌లుస్తార‌ని కాంగ్రెస్ నేత‌లు అనుకున్నారు. కానీ ఆయన మాత్రం రాలేదు. ఠాగూర్‌ను కలవలేదు. ఇప్పుడు ఈ విషయం కాంగ్రెస్‌ పార్టీలో చర్చనీయాంశం అయ్యింది.

గాంధీభవన్‌కు దూరంగా రాములమ్మ:
ఇక, కాంగ్రెస్ పార్టీ ప్రచార క‌మిటీ చైర్‌పర్సన్‌గా ఉన్న విజ‌య‌శాంతి కూడా సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారని అంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనటం ‌లేదు. అడ‌పాద‌డ‌పా ప్రెస్‌ నోట్లు విడుద‌ల చేస్తూ ప్రభుత్వంపై విమ‌ర్శలు గుప్పిస్తున్నారే తప్ప.. గాంధీభవన్‌కు మాత్రం రావడం లేదు. దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో ఆమెను బ‌రిలో నిల‌పాల‌ని పార్టీ భావించినా.. ఆమె విముఖ‌త వ్యక్తం చేశార‌ని టాక్‌. గ‌త అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నిక‌ల్లో కూడా పోటీకి దూరంగా ఉన్నారామె. పార్టీ కార్యక్రమాల‌కు సైతం దూరంగా ఉంటున్నారు.

ఆ ఇద్దరూ కాంగ్రెస్ కి దూరమైనట్టేనా?
ఇటీవ‌ల‌ ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మణిక్కమ్‌ ఠాగూర్ హైద‌రాబాద్ వచ్చినప్పుడు నిర్వహించిన స‌మావేశంలో విజయశాంతి పాల్గొంటార‌ని అంతా భావించారు. కానీ ఆమె మాత్రం ఈ విషయాన్ని లైట్‌ తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకంగా స‌మాచారం పంపించినా విజ‌య‌శాంతి నుంచి స‌రైన స్పంద‌న రాలేద‌ని గాంధీభ‌వ‌న్ వ‌ర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

మొత్తానికి విజయశాంతి, అజహరుద్దీన్‌ పార్టీకి అంటీముట్టన‌ట్లుగా ఉండడంతో అసలు వారు పార్టీలో ఉంటారా లేదా అనే చర్చ జరుగుతోంది. వారిద్దరికీ ప్రత్యేకంగా స‌మాచారం పంపినా గాంధీభ‌వ‌న్ వైపు క‌న్నెత్తి చూడ‌లేదు. ఈ పరిస్థితుల్లో వారిద్దరూ పార్టీకి దూరమైనట్టే అని కాంగ్రెస్‌లో టాక్‌ వినిపిస్తోంది.