Balineni Srinivasa Reddy : సీఎం జగన్‌తో ముగిసిన బాలినేని కీలక భేటీ, ఏయే అంశాలపై చర్చించారంటే..
Balineni Srinivasa Reddy : పార్టీ మార్పు అనేది ప్రచారం మాత్రమే అన్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ప్రోటోకాల్ అనేది పెద్ద విషయం కాదన్నారు.

Balineni Srinivasa Reddy
Balineni Srinivasa Reddy To Meet CM Jagan : ఏపీ సీఎం జగన్ తో మాజీమంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి కీలక భేటీ ముగిసింది. అన్ని విషయాల మీద సీఎం జగన్ తో చర్చించినట్లు బాలినేని తెలిపారు. జిల్లాలో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులపైనా సీఎం జగన్ కి వివరించినట్లు వెల్లడించారు.
ప్రోటోకాల్ అనేది పెద్ద విషయం కాదన్నారు బాలినేని. దాని మీద ఫిర్యాదు చేయడానికి ఏం ఉంటుందని ప్రశ్నించారాయన. రీజినల్ కో-ఆర్డినేటర్ పదవిపైనా చర్చ జరగలేదన్నారు. గతంలోనే ఆ పదవి వద్దని రాజీనామా చేశానని ఆయన గుర్తు చేశారు. నియోజకవర్గం మీద దృష్టి పెట్టాలని జగన్ చెప్పారన్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు సీఎం సానుకూలంగా స్పందించారని బాలినేని చెప్పారు. పార్టీ మార్పు అనేది ప్రచారం మాత్రమే అన్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో బాలినేని శ్రీనివాస రెడ్డి భేటీ జరిగింది.
ప్రకాశం జిల్లా వైసీపీలో నెలకొన్న పరిస్థితులపై సీనియర్ నేత అయిన బాలినేని అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ బాధ్యతల నుంచి ఆయన తప్పుకోవడం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సుమారు నెల రోజుల క్రితం బాలినేని.. సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. మళ్లీ ఇప్పుడు సీఎంతో భేటీ కావడం పార్టీ శ్రేణుల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలినేని కంటతడి పెట్టడం చర్చకు దారితీసింది. తాను టికెట్లు ఇప్పించిన ఎమ్మెల్యేలే తనపై వివాదాలు సృష్టిస్తూ, సీఎంకు ఫిర్యాదు చేస్తున్నారని ఆయన కన్నీటిపర్యంతం అయ్యారు.