తెలంగాణకు CM.. కేసీఆరా? ఒవైసీనా?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.. సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తెలంగాణకు సీఎం కేసీఆరా? ఒవైసీనా? అని ప్రశ్నించారు. పౌరసత్వ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని

  • Published By: veegamteam ,Published On : January 3, 2020 / 10:17 AM IST
తెలంగాణకు CM.. కేసీఆరా? ఒవైసీనా?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.. సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తెలంగాణకు సీఎం కేసీఆరా? ఒవైసీనా? అని ప్రశ్నించారు. పౌరసత్వ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. తెలంగాణకు సీఎం కేసీఆరా? ఒవైసీనా? అని ప్రశ్నించారు. పౌరసత్వ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని కేసీఆర్ ను నిలదీశారు. సీఏఏలో తప్పులు ఉన్నాయని, చట్ట వ్యతిరేకం అని కేసీఆర్ నిరూపిస్తే.. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని లక్ష్మణ్ సవాల్ విసిరారు. ఎంఐఎంతో టీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకుందని లక్ష్మణ్ ఆరోపించారు. ఎంఐఎం చెప్పినట్టు కేసీఆర్ నడుచుకుంటున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని, సీఏఏని వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పౌరసత్వ సవరణ చట్టం(CAA), జాతీయ పౌరసత్వ నమోదు(NRC)లపై శుక్రవారం(జనవరి 3,2020) బీజేపీ నిజామాబాద్ లో ప్రజా ప్రదర్శన సభ నిర్వహించింది. బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్ ధర్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ అరవింద్ ఇతరులు ఈ సభలో పాల్గొన్నారు. సీఏఏ, ఎన్నార్సీలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఏ కారణాలతో ప్రధాని మోడీ తెచ్చిన చట్టాలను కేసీఆర్‌ వ్యతిరేకిస్తున్నారని లక్ష్మణ్ ప్రశ్నించారు. మంత్రులకు కేనీసం మూడు నిమిషాల టైమ్‌ కూడా ఇవ్వని కేసీఆర్‌…ఒవైసీకి ఏకంగా 3 గంటల సమయమిచ్చారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలపైనా లక్ష్మణ్ స్పందించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు బీజేపీదే అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని చెప్పిన లక్ష్మణ్.. త్వరలోనే కాషాయ జెండా ఎగరేస్తామన్నారు.

మనందరం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని, మనకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామని లక్ష్మణ్ అన్నారు. సీఏఏను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో టీఆర్ఎస్ చెప్పడం లేదన్నారు. సీఏఏపై కాంగ్రెస్ వైఖరిని విమర్శిస్తూ… దేశాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీనే అని మండిపడ్డారు. అక్కడి నుంచి వచ్చిన మైనారిటీల కోసం మోడీ ప్రభుత్వం సీఏఏ తెస్తే కాంగ్రెస్ విమర్శిస్తోందని ధ్వజమెత్తారు. సీఏఏ కాంగ్రెస్ హయాంలో చేసిందేనని… దాన్ని బీజేపీ ప్రభుత్వం సవరించిందని లక్ష్మణ్ చెప్పారు. మీరు చేస్తే ఒప్పు.. మేము చేస్తే తప్పా? అని కాంగ్రెస్ ను నిలదీశారు.

ప్రతిపక్షాలు సీఏఏ, ఎన్నార్సీలపై ప్రజల్లో భయాందోళనలు కల్గిస్తున్నాయని మాజీ ఎంపీ వివేక్ అన్నారు. మన దేశానికి శరణార్థులుగా వచ్చిన ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలోని మైనారిటీలకు దీని వల్ల మేలు కలుగుతుందన్నారు. మోడీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు.

దేశంలో గత ఆరేళ్ల నుంచి మంచి పనులు జరుగుతున్నాయని ఎంపీ అరవింద్ అన్నారు. స్వాతంత్ర్యం కంటే ముందు మన దేశం హిందూ రాష్ట్రమని చెప్పారు. ఆ తర్వాతే సెక్యులర్ అయిందన్నారు. కేసీఆర్ ముల్లా అయ్యారని.. కేటీఆర్ నాస్తికుడని విమర్శించారు. సీఏఏను 80 శాతంపైగా దేశ ప్రజలు సమర్థిస్తున్నారని తెలిపారు. పాకిస్తాన్ లో 23శాతం ఉన్న హిందూ జనాభా ప్రస్తుతం 3 శాతానికి పడిపోయిందని వాపోయారు. బంగ్లాదేశ్ లో 22 శాతం ఉన్న హిందువుల జనాభా 8 శాతానికి పడిపోయిందన్నారు. ఆ దేశాల్లో ఉన్న హిందువులు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ అరవింద్.

సీఎం కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుందని లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో 4 పార్లమెంటు స్థానాలు గెలిచి ఉత్తర తెలంగాణలో బలపడ్డామని లక్ష్మణ్ చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ రూపాంతరం చెందుతోందన్నారు. సీఏఏను అడ్డుపెట్టుకొని దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతోందని కాంగ్రెస్ పై లక్ష్మణ్ మండిపడ్డారు. మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపుతున్నారని చెప్పారు.

కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేస్తే ఒప్పు.. అదే బీజేపీ చేస్తే తప్పా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, కమ్యూనిస్టులు, మజ్లిస్ అన్నీ ఒక్కటేనని అన్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో పోటీ చేస్తామని చెప్పారు. జనవరి 7న ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో మోత్కుపల్లి నర్సింహులుతో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ముఖ్యనేతలు బీజేపీలో చేరుతున్నారని.. ఇకపై చేరికల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని లక్ష్మణ్ వెల్లడించారు.

Also Read : నాలుగు కుర్చీలాట.. టీ-బీజేపీలో గ్రూపు పాలిటిక్స్!