జగన్‌కు విష్ణుకుమార్ రాజు సపోర్టు : ఇంగ్లీష్ భాష అవసరమే

  • Edited By: madhu , November 14, 2019 / 01:16 PM IST
జగన్‌కు విష్ణుకుమార్ రాజు సపోర్టు : ఇంగ్లీష్ భాష అవసరమే

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధనపై తీసుకున్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి మెల్లిమెల్లిగా మద్దతు పెరుగుతోంది. టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ మద్దతు ప్రకటించారు. తాజాగా బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కూడా రెస్పాండ్ అయ్యారు. 2019, నవంబర్ 14వ తేదీ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు.

దేశ, విదేశీ స్థాయికి వెళ్లాలంటే..ఇంగ్లీషు భాష అవసరమన్నారు. ఇంగ్లీషు మీడియం ద్వారా మత మార్పిడిని ప్రోత్సాహిస్తున్నారని, తమ పార్టీ అధ్యక్షులు కన్నా ఎందుకు అన్నారో తనకు తెలియదని చెప్పారు. ఉప రాష్ట్రపతి ఇంగ్లీషు మీడియాన్ని వ్యతిరేకించడంపై తాను మాట్లాడనన్నారు. సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోసం తాను 6 సార్లు ప్రయత్నించినట్లు..కానీ దొరకలేదన్నారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్యా బోధనను ప్రవేశపెట్టడంపై అటు తెలుగు బాషాభిమానులు, ఇటు విపక్ష పార్టీల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. అయినా ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు వెళ్లడానికే డిసైడ్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల గ్రామాలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషు మీడియంలో విద్యా బోధనను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది.

ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలోనే బోధన కొనసాగనుంది. కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో చదివించలేక ఇబ్బంది పడుతున్న సామాన్యులు, పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు ఉపయోగకరంగా ఉండేలా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు బోధన చేయాలనే ప్రభుత్వ ఆలోచనను పలువురు ఆహ్వానిస్తున్నారు. తాజాగా బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు ఎలాంటి దుమారం రేపుతాయో చూడాలి. 
 

Read More : ఇసుక దీక్ష : పనికి రాని సీఎంను ఇప్పుడే చూస్తున్నా – బాబు