మీడియం గొడవ : వెంకయ్యకు జగన్ క్షమాపణ చెప్పాలి 

  • Edited By: chvmurthy , November 11, 2019 / 02:13 PM IST
మీడియం గొడవ : వెంకయ్యకు జగన్ క్షమాపణ చెప్పాలి 

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సీఎం జగన్‌ క్షమాపణ చెప్పాలని బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వెంకయ్యనాయుడుపై జగన్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టమన్నారు. వెంకయ్యనాయుడుని ఉద్దేశించి సీఎం స్ధాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు,ఉప రాష్ట్రపతిపై సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కన్నా అన్నారు.
 

ఏపీ అభివృద్ధిలో వెంకయ్యనాయుడు పాత్ర ఎనలేనిదని..మాతృభాషలో బోధన ఉండాలని మాత్రమే ఉపరాష్ట్రపతి సూచించారని కన్నా చెప్పారు. గతంలో టీడీపీ హయాంలో ఇంగ్లీషు మీడియం పాఠశాలల ఏర్పాటు  చేస్తే జగన్ తీవ్రంగా విమర్శించారని.. అప్పుడు ఇంగ్లీషు మీడియం వద్దని.. ఇపుడు ఎలా ప్రవేశపెడతార అని ప్రశ్నించారు.  మేం ఏ భాషకు వ్యతిరేకం కాదని… మాతృభాషలో కూడా భోదన ఉండాలనేది మా డిమాండ్  అని చెప్పారు.  

తెలుగు మీడియం కొనసాగిస్తూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టోచ్చు అని, నిర్బంధంగా ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నామని కన్నా వివరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలోనే తెలుగుకు ప్రత్యేక హోదా వచ్చిందని, అందుకు ఎన్నోఏళ్లు పోరాడామని కన్నా లక్ష్మినారాయణ గుర్తు చేసారు. మాతృభాషను చంపుతామంటే తాము వ్యతిరేకిస్తామని ఆయన తెలిపారు. 

ప్రజాసమస్యలపై పోరాటానికి బీజేపీ ఎప్పుడూ సిద్దంగా ఉంటుందని… ఇసుక సమస్యను మొదట లేవనెత్తింది బీజేపీ నే అని ఆయన చెప్పారు. రాష్ట్ర సమస్యలపై ఏ పార్టీ పోరాటం చేసినా తమ మద్దతు ఉంటుందని, అన్నారు. మద్యం పాలసీని వెంటనే అమలు చేసిన ప్రభుత్వం ఇసుక పాలసీని ఎందుకు అమలు చేయలేదని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.