రాజేంద్రప్రసాద్‌కి డబ్బులివ్వలేదు : రాజకీయాలు మానుకుంటా తప్ప వైసీపీలోకి వెళ్లను 

  • Edited By: veegamteam , November 16, 2019 / 06:59 AM IST
రాజేంద్రప్రసాద్‌కి డబ్బులివ్వలేదు : రాజకీయాలు మానుకుంటా తప్ప వైసీపీలోకి వెళ్లను 

వల్లభనేని వంశీపై టీడీపీ కౌంటర్‌ అటాక్‌కు దిగింది. వ్యక్తిగత విమర్శలు వంశీకి తగదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అన్నారు. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తన దగ్గర డబ్బులు తీసుకున్నాడని వంశీ ఆరోపించటాన్ని ప్రసాద్‌ ఖండించారు. రాజేంద్రప్రసాద్‌కి తనెప్పుడూ డబ్బులివ్వలేదని చెప్పారు. వైసీపీలోకి పరకాయ ప్రవేశం చేయటం వల్ల వారి ఒత్తిళ్ల మేరకు వంశీ మాట్లాడుతున్నారని బోడె ప్రసాద్‌ ఆరోపించారు. 

వంశీ తనకు మంచి స్నేహితుడు అని చెప్పిన బోడె ప్రసాద్.. స్నేహం వేరు.. రాజకీయం వేరు అని స్పష్టం చేశారు. ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు. తాను కూడా పార్టీ మారతానంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని.. అవసరమైతే రాజకీయాలు మానుకుంటా తప్ప పార్టీ మాత్రం మాననని బోడె ప్రసాద్‌ స్పష్టం చేశారు. చంద్రబాబుపై వంశీ వ్యాఖ్యలను బోడె ఖండించారు. వంశీలా నేను పార్టీని హేళన చేయను అన్నారు. వంశీ వ్యక్తిగత దూషణలకు దిగడం కరెక్ట్ కాదన్నారు.

అటు పార్టీ ఫిరాయింపులపై నీతులు చెప్పిన జగన్ ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. తమపై విమర్శలు చేసేందుకు 151మంది ఎమ్మెల్యేలకు ధైర్యం సరిపోవడం లేదని..అందుకే తమ నేతలను భయపెట్టి లొంగదీసుకుని వారితో తిట్టిస్తున్నారని దేవినేని మండిపడ్డారు.

150 సీట్లు గెలిచినా జగన్ అభద్రతతో ఉన్నారని దేవినేని ఉమ అన్నారు. సీబీఐ కోర్టు పరిణామాలతో వైసీపీలో అలజడి మొదలైందన్నారు. టీడీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పేదలకు సన్నబియ్యం ఇవ్వలేని వ్యక్తి మమ్మల్ని తిడుతున్నాడు అంటూ మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి దేవినేని ఉమ విమర్శలు చేశారు. అయ్యప్ప మాలలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని వల్లభనేని వంశీపై మండిపడ్డారు.హిందూ ధర్మాన్ని కించపరిచేలా వంశీ వ్యవహరించారని ఆగ్రహించారు. 

పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీలో శ్రీరంగనీతులు చెప్పిన సీఎం జగన్.. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేని వైసీపీలో ఎలా చేర్చుకుంటారని దేవినేని ఉమ నిలదీశారు. జగన్ పిచ్చి చర్యలకు తాము భయపడం అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలను జగన్ వేధిస్తున్నారని దేవినేని ఉమ వాపోయారు. సీఎం జగన్ ను చూసి జాలిపడుతున్నామన్నారు.

టీడీపీ నేతలను విమర్శించడానికి 150 మంది ఎమ్మెల్యేలకు ధైర్యం సరిపోవడం లేదన్నారు. అందుకే తమ పార్టీ నేతలను భయపెట్టి లొంగదీసుకుని వారితో తమను తిట్టిస్తున్నారని.. ఇదంతా జగన్ కనుసన్నల్లోనే జరుగుతోందని దేవినేని ఉమ అన్నారు. సిమెంట్ స్కామ్ బయటపడుతుందనే భయంతోనే సీఎం జగన్ ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని కుట్ర పన్నారని దేవినేని ఉమ ఆరోపించారు.