నా కొడుకుకు టిక్కెట్ ఇవ్వమంటున్న మాజీ మంత్రి

  • Published By: vamsi ,Published On : February 21, 2019 / 06:34 AM IST
నా కొడుకుకు టిక్కెట్ ఇవ్వమంటున్న మాజీ మంత్రి

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సీట్ల కోసం నాయకులు అడుగులు వేస్తున్నారు. ప్రధాన పార్టీలు నియోజకవర్గాల వారీగా గెలుపు గుర్రాలని సిద్ధం చేసే పనిలో పడగా టిక్కెట్లు ఆశిస్తున్న నేతలు అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నారు. అధికార తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇప్పటికే పలుదఫాలు  తనదైన శైలిలో అభ్యర్ధుల గురించి క్షేత్ర స్థాయిలో సర్వేలు నిర్వహించారు.

ఈ క్రమంలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గంపై తెలుగుదేశం అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఆలోచనతో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి చంద్రబాబుతో చర్చలు జరిపారు.     వయోభారం రిత్యా,  అనారోగ్య కారణాలతో ఈసారి పొటీ నుండి తప్పించుకోవాలని భావిస్తున్న బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి సీటును తన కుమారుడు బొజ్జల సుధీర్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నారు. అయితే బొజ్జల పోటీ చేస్తేనే బాగుంటుందని చంద్రబాబు అభిప్రాయపడినట్లు తెలుస్తుంది.

ఒకవేళ పోటీ నుంచి బొజ్జల తప్పుకుంటే నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు అనేకమంది సిద్ధంగా ఉండడంతో ఆశావాహులు నిరుత్సాహపడుతారని, అప్పుడు ఓటు బ్యాంకు చీలుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గం నుండి బొజ్జలకు సమఉజ్జీగా ఎస్ సీవీ నాయుడు ఉన్నారు. గత ఎన్నికల రాజకీయ సమీకరణాల్లో భాగంగా కాంగ్రెస్ నుండి చంద్రబాబు ఆదేశాల మేరకు తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడం జరిగింది.

చంద్రబాబు సూచనలతో కాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని సూచించడంతో ఎస్ సీవీ నాయుడు పార్టీ అభ్యర్థుల గెలుపు విషయంలో అప్పట్లో కీలకపాత్ర పోషించారు. అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికలలో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఈమేరకు అధిష్టానం వద్ద పావులు కదుపుతున్నారు. అయితే ఇప్పుడు బొజ్జల పొటీ నుండి తప్పుకుంటే మాత్రం సుధీర్ రెడ్డి నాయకత్వానికి ఎస్ సీవీ నాయుడు సపోర్ట్ చేయరని అంటున్నారు. అయితే దీనిపై నిర్ణయం ఏంటో మరికొన్ని రోజుల్లో తెలియనుంది.