వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం, వైసీపీ ఎంపీ సన్నిహితుడి ఫోన్‌ స్వాధీనం

  • Published By: naveen ,Published On : September 24, 2020 / 12:24 PM IST
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం, వైసీపీ ఎంపీ సన్నిహితుడి ఫోన్‌ స్వాధీనం

మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నిన్న(సెప్టెంబర్ 23,2020) ఇద్దరు కీలక వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారించిన సీబీఐ అధికారులు… ఇవాళ(సెప్టెంబర్ 24,2020) పులివెందులకు చెందిన ఏడుగురిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి సన్నిహితుడి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అనుమానితుడిగా భావిస్తున్న చెప్పుల వ్యాపారి మున్నా బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. అతని లాకర్‌లో 48 లక్షల నగదు, 20 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మున్నాపై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సన్నిహితుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయ్ కుమార్ రెడ్డి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉదయ్ యురేనీయం కర్మాగారంలో ఉద్యోగి. అతడిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

చెప్పుల షాపు యజమాని బ్యాంకు లాకర్ లో రూ.48లక్షల డబ్బు, 25తులాల గోల్డ్:
అంతక ముందు పులివెందులలో పలువురు అనుమానితులను సీబీఐ విచారించింది. చెప్పుల షాప్‌ యజమాని మున్నా, అతడి కుటుంబ సభ్యులను సీబీఐ అధికారులు విచారించారు. చెప్పుల షాపు యజమాని మున్నా బ్యాంక్‌ లాకర్‌లో రూ.48 లక్షల డబ్బు, 25 తులాల బంగారాన్ని అధికారులు గుర్తించారు. మరికొన్ని బ్యాంక్‌ ఖాతాల్లో రూ.20 లక్షల ఎఫ్‌డీలు ఉన్నట్లు సీబీఐ తేల్చింది. భార్యాభర్తల వ్యవహారంలో చెప్పుల వ్యాపారి మున్నాను అప్పట్లో వైఎస్ వివేకా మందలించినట్లు తెలిసింది.

మున్నాను మందలించిన వివేకా:
మున్నా ముగ్గురిని వివాహం చేసుకోగా, వీరి మధ్య వివాదం వైఎస్ వివేకా ముందుకు రాగా, ఆయన మందలించినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో మున్నా మొదటి భార్యను రెండు రోజుల పాటు సీబీఐ అధికారులు విచారించారు. అనంతపురం జిల్లా కదరిలో నివాసం ఉంటున్న మున్నా ఇంటికి వెళ్లిన సీబీఐ బృందం.. ఆయన తల్లి సమక్షంలో బ్యాంక్ లాకర్ తెరిచి నగదు, అభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

వివేకానందరెడ్డి దారుణ హత్య:
2019 ఎన్నికలకు ముందు మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యపై రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేయగా.. అప్పటి టీడీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కానీ నిందితులు మాత్రం దొరకలేదు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్తగా సిట్‌ను ఏర్పాటు చేశారు.

సిట్ పలువురు అనుమానితులతో పాటు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని కూడా విచారణకు పిలిచింది. వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించాలని ఆయన సతీమణి సౌభాగ్యమ్మ, కూతురు సునీత.. అలాగే టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ తరుణంలో హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ఈ కేసును గత రెండు నెలలుగా విచారిస్తున్న సీబీఐ తాజాగా కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.