ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు

  • Published By: chvmurthy ,Published On : January 8, 2020 / 12:43 PM IST
ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు

ఏపీ రాజధాని తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండబోదని బీజేపీ నాయకుడు కె.మురళీ ధర రావు స్పష్టం చేశారు. అభివృధ్ధి అనేది ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదని, అభివృధ్ధి వికేంద్రీకరణ చేయటం మంచిదేనని బుధవారం, జనవరి 8న ఆయన నెల్లూరులో వ్యాఖ్యానించారు. విశాఖ, కర్నూలుతో పాటు రాష్ట్రంలోని ఇతర  ప్రాంతాలు కూడా అభివృధ్ది చెందాలని ఆయన ఆకాంక్షించారు.

ఏపీ రాజధాని ఎక్కడ ఉండాలనేది ఆయా రాష్ట్రాల పరిధిలోని అంశమని ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల విషయంలో స్పష్టత రావాల్సి ఉందని.. ప్రభుత్వ విధానం చెప్పిన తరువాత కేంద్రం దృష్టికి తీసుకువస్తే కేంద్రం వైఖరిని కూడా తెలియజేస్తామన్నారు. అంతేకాదు అమరావతికి భూములు ఇచ్చిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు కిషన్‌రెడ్డి. గతంలో చంద్రబాబు అమరావతిని నిర్లక్ష్యం చేశారని విమర్శించిన కేంద్రమంత్రి.. భారత చిత్రపటంలో అమరావతికి చోటు కల్పించేలా తానే కృషి చేశానని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు  కూడా స్పష్టం చేశారు. ఇది పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా అధికారికంగా చెప్పే మాట అని పేర్కొన్నారు.రాజధాని తరలింపు గురించి రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం దృష్టికి తీసుకొస్తే అప్పుడు ఏదైనా సూచన చేయొచ్చేమో గానీ, కేంద్రం తనంతట తాను జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు.    

అయినా.. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒక స్పష్టమైన ప్రతిపాదనను వెల్లడించలేదని చెప్పారు. ‘వ్యవస్థలో తనకున్న అధికారాలకు లోబడే కేంద్రం పని చేస్తుంది. రాజధాని అమరావతిలోనే పెట్టండని అప్పుడు కేంద్రం చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి మార్చండని, మార్చ వద్దని చెప్పదని జీవీఎల్ అన్నారు.