త్వరలో నియామకాలు, తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు

  • Published By: naveen ,Published On : August 26, 2020 / 03:47 PM IST
త్వరలో నియామకాలు, తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు

తెలంగాణ టీడీపీలో జవసత్వాలు నింపేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్ కేంద్రంగానే ఇరు రాష్ట్రాల పార్టీ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. తెలంగాణలో రాష్ట్ర విభజన నాటి నుంచే పార్టీలో ఎక్కువ మంది సీనియర్ నేతలు అధికార టీఆర్ఎస్‌ పార్టీ గూటికి చేరారు. గత ఎన్నికల్లో గెలిచిన ఇద్దరిలో ఒక ఎమ్మెల్యే టీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పటికే తెలంగాణ టీడీపీ ఖాళీ అయ్యిందని అంటున్నారు. రాష్ట్రంలో అక్కడక్కడ పార్టీపై అభిమానం ఉన్న కార్యకర్తలే పార్టీ జెండాను అట్టి పెట్టుకుని ఉన్నారు.



మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నవారిని యాక్టివ్ చేసే ప్రయత్నాలు:
పార్టీకి లీడర్లు లేకపోయినా కేడర్ మాత్రం కొన్ని జిల్లాల్లో ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో పార్టీ అంటే అభిమానం ఉన్నవారున్నారు. ఇటీవల జరిగిన హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫు అభ్యర్థిని రంగంలోకి దింపింది. మరో మూడేళ్ళ పాటు రాష్ట్రంలో ఎన్నికలు లేవు. దీంతో పార్టీనే నమ్ముకుని మొదటి నుంచి ఉన్న వారిని పార్టీలో తిరిగి యాక్టివ్ చేసేందుకు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు.

తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయం:
ప్రతి రెండేళ్లకు ఒకసారి పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీలో సభ్యుల నియామకం.. రాష్ట్ర కమిటీలోకి కొత్త వారికి అవకాశం వంటివి ఉంటాయి. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ పైనే ఫోకస్ పెట్టారు. అడపాదడపా మాత్రమే తెలంగాణ పార్టీ నేతలతో సమావేశం అయ్యేవారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలు రావడంతో పార్టీ పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో చంద్రబాబు ఏపీతో పాటు తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారట.

కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని చంద్రబాబుకి సూచన:
కొద్ది నెలల క్రితం తెలంగాణ తెలుగు తమ్ముళ్లను వారంలో ఒక్క రోజు కలిసేలా ఒక్క కార్యక్రమం పెట్టారు. ఆ తర్వాత ఏపిలో రాజధాని తరలింపు అంశం తెర మీదకు రావడంతో తెలంగాణ టీడీపీ నాయకులతో సమావేశం వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా కరోనా నేపథ్యంలో చంద్రబాబు హైదరాబాద్‌లో ఇంటికే పరిమితం అయ్యారు. ఇటీవల పలుమార్లు తెలంగాణ టీడీపీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. రాష్ట్ర కమిటీలో ఖాళీలు భర్తీ చేయాలని, కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ పార్టీ నేతలు సూచించారు. గతంలో రాష్ట్ర కమిటీలో 140 మంది సభ్యులుండేవారు. కానీ, ఈసారి 70 మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

మళ్లీ కొత్త జోష్‌ వస్తుందా? పార్టీ బలోపేతానికి ఊతమిస్తుందా?
వీటితో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు పార్టీలో అన్ని కమిటీల నియామకాలు చేపట్టాలని అధినేత చంద్రబాబు డిసైడ్ అయ్యారట. ఆగస్టు నెల చివరిలో కానీ సెప్టెంబర్ మొదటి వారంలో కానీ కొత్త కమిటీలను ప్రకటించే అవకాశం ఉన్నటు తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎల్‌.రమణను మార్చకపోవచ్చు అంటున్నారు. మిగిలిన పదవుల్లో కొత్త వారి చోటు ఉంటుందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. మరి చంద్రబాబు తీసుకుంటున్న ఈ నిర్ణయంతో పార్టీలో మళ్లీ కొత్త జోష్‌ వస్తుందా? పార్టీ బలోపేతానికి ఊతమిస్తుందా? లేదా అన్నది తేలాలంటే వేచి చూడాల్సిందే.