Chandrababu Naidu : వైసీపీ ఒక్క సీటు గెలిచినా ఉరి వేసుకున్నట్లే- చంద్రబాబు

Chandrababu Naidu :ఆస్కార్ అవార్డు నాటు నాటు పాటకు కాదు జగన్‌కు ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చేది 10 రూపాయలు దోచుకునేది 100 రూపాయలని చెప్పారు.

Chandrababu Naidu : వైసీపీ ఒక్క సీటు గెలిచినా ఉరి వేసుకున్నట్లే- చంద్రబాబు

Chandrababu Naidu (Photo : Google)

Chandrababu Naidu : ఏపీలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది. ఏపీ సీఎం జగన్, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఛాన్స్ చిక్కితే చాలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా సీఎం జగన్ పై మరోసారి నిప్పులు చెరిగారు చంద్రబాబు. గుంటూరు జిల్లా మేడికొండూరులో బహిరంగ సభలో జగన్ పై విరుచుకుపడ్డారు చంద్రబాబు. నాయకులకు డబ్బే కాదు తెలివితేటలు కూడా ఉండాలని చంద్రబాబు అన్నారు. తెలివి లేని వాళ్లు అధికారంలోకి వస్తే దోపిడి తప్ప అభివృద్ధి ఉండదన్నారు.

పాతికేళ్ళ క్రితం యువత చేతికి ఐటి అనే ఆయుధం ఇచ్చానని, పిల్లలను బాగా చదవించాలని తల్లిదండ్రులకు చెప్పానని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఇబ్బందులు వచ్చాయన్నారు. అమరావతి నిర్మాణం చేసి ఇబ్బందులు లేకుండా చేయాలని కష్టపడ్డానన్నారు.
హైదరాబాద్ కు ధీటుగా అమరావతి మహా నగరాన్ని నిర్మించాలని ఆలోచించానన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానంలో 29వేల మంది 33వేల ఎకరాలు భూమి ఇవ్వటం ఓ చరిత్ర అన్నారు చంద్రబాబు.(Chandrababu Naidu)

”జాతీయ రహదారులు అధ్వాన్నంగా ఉన్న సమయంలో వాజ్ పేయికి చెప్పి వాటిని టోల్ గేట్ విధానంలో అభివృద్ధి చేశాం. దీంతో దేశంలో జాతీయ రహదారులు బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యాయి. రాష్ట్రంలో జగన్ మాటలు విని జనం మోసపోయారు. చివరికి అమరావతి రాజధాని ఉన్న తాడికొండలో కూడా జగన్ పార్టీని గెలిపించారు. ఇక్కడే ఇళ్లు కట్టుకున్నానని చెప్పి ప్రజలను మభ్యపెట్టాడు. అమరావతికి కులం ముద్ర వేసి తప్పుడు ప్రచారం చేశారు. అమరావతి ముంపు ప్రాంతమని మరో అబద్ధం చెప్పారు. అమరావతిలో అవినీతి జరిగిందని మళ్లీ తప్పుడు ప్రచారం. భూమి మొత్తం ప్రభుత్వం వద్ద ఉంటే మోసం ఎలా జరిగింది? విచారణలో కొండను తవ్వి ఎలుకను కాదు.. ఎలుక బొచ్చు కూడా పట్టుకోలేకపోయారు.

Also Read..AP CM Jagan: ఓ ముసలాయన అంటూ.. చంద్రబాబుపై ‘మోసపూరిత పులి’ కథ చెప్పిన జగన్‌

మనం కట్టిన అసెంబ్లీలో కూర్చుని అమరావతిని స్మశానం, భ్రమరావతి అంటారు. ఈ ముఖ్యమంత్రి ఫేక్ ఫెలో. అమరావతి గ్రాఫిక్స్ అన్న వారు అక్కడి భవనాలు పైకి ఎక్కి దూకండి. అప్పుడు రాష్ట్రానికి పట్టిన శని వదులుతుంది. అమరావతి మహిళలను పోలీసులతో దారుణంగా వేధించారు. ఎన్ని చేసినా అమరావతి రాజధానిగా ఉంటుంది. జగన్ మూడు ముక్కలాట సాగదు. రాజధాని రైతులు చేస్తుంది ధర్మ పోరాటం.

సత్తెనపల్లి మండలం కంటిపూడిలో ఎస్సీ కాలనీకి వెళ్లాను. అక్కడ వారి పరిస్థితి చూసి చాలా బాధ వేసింది. ముఖ్యమంత్రి చెబుతున్న విద్యా దీవెన, వసతి దీవెన అక్కడి వారికి రావటం లేదు. ముగ్గురు పిల్లలు ఉంటే ఒకరికి మాత్రమే అమ్మఒడి అరకొరగా ఇచ్చారు. మిగతా ఇద్దరు పిల్లలు చదవాల్సిన పని లేదా? ఈ సైకో జగన్ ని అడుగుతున్నా. బీసీ యువకుడు అనిల్ చనిపోతే ప్రభుత్వ పరిహారంలో మంత్రి అంబటి రాంబాబు వాటా అడిగారు. ఇది శవాల మీద పేలాలు ఏరుకోవటం కాదా?(Chandrababu Naidu)

అందుకే పార్టీ తరపున రెండు లక్షలు, అనిల్ చెల్లెలిని చదివిస్తామని మాటిచ్చా. వికలాంగులకు కనీసం మూడు చక్రాల వాహనం కొనివ్వలేని సంక్షేమం ఎందుకు? అమరావతి నిర్మాణం జరిగి ఉంటే ఇక్కడి వారి ఆదాయం పెరిగేది? మిర్చి కూలీలను కలిసి మాట్లాడితే పెరిగిన నిత్యావసర ధరలు, గ్యాస్ ధరల గురించి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చేది 10 రూపాయలు దోచుకునేది వంద రూపాయలని వాళ్లు చెప్పారు. ప్రజల రక్తాన్ని తాగే ప్రభుత్వం ఇది. మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు లేవు. ఆ డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్తోంది. రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేశారు. ఈ సైకో ముఖ్యమంత్రి జీవితంలో మారడు.

Also Read..Chennakesava Reddy: జూనియర్ ఎన్టీఆరే టీడీపీకి నాయకుడు అవుతారు: ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి

బాబాయ్ ని గొడ్డలి పోటుతో వేసి డ్రామాలు ఆడారు. కోడి కత్తి పేరుతో ఇంకో నాటకం ఆడారు. జగన్ తల్లి, చెల్లి ఎక్కడ ఉన్నారు? షర్మిల జైలుకు వెళ్తే జగన్ కనీసం మాట్లాడలేదు. వివేకానంద రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు వద్దని షర్మిల చెప్పింది. జగన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఒక బాబాయ్ ని చంపారు, మరో బాబాయ్ ని జైలుకు పంపారు. కానీ ఒక కన్ను ఇంకో కన్నును పొడుచుకుంటుందా అన్నారు జగన్. ఆస్కార్ అవార్డు నాటు నాటు పాటకు కాదు జగన్ కు ఇవ్వాలి. పైగా జగన్ నన్ను ముసలాడు అంటారు. వయసు నాకు ఒక నంబర్ మాత్రమే. ఐటీ, అభివృద్ధి, సంక్షేమానికి చిరునామా తెలుగుదేశం పార్టీ” అని చంద్రబాబు అన్నారు.

మరోవైపు తాడికొండ రోడ్ షో లో చంద్రబాబు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో వైసీపీ ఒక్క సీటు గెలిచినా ఉరి వేసుకున్నట్లేనని ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రాన్ని కాపాడేందుకు 5కోట్ల మంది ఏకం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉపాధి లేక వలసలు పెరిగాయని చంద్రబాబు వాపోయారు. సింగపూర్, దుబాయ్ ని అక్కడి పాలకులు స్వర్గంలా మారిస్తే.. ఇక్కడి పాలకులు అమరావతిని స్మశానంలా మార్చారని చంద్రబాబు ధ్వజమెత్తారు.