ఆ ఎంపీ తీరుతో రగిలిపోతున్న ఎమ్మెల్యే శ్రీదేవి, అసలు వైరం ఎక్కడ మొదలైంది

  • Published By: naveen ,Published On : August 5, 2020 / 01:59 PM IST
ఆ ఎంపీ తీరుతో రగిలిపోతున్న ఎమ్మెల్యే శ్రీదేవి, అసలు వైరం ఎక్కడ మొదలైంది

ఉండవల్లి శ్రీదేవి.. వైద్య వృత్తిలో ఉన్న ఆమె 2019 ఎన్నికల్లో తాడికొండ ఎస్సీ అసెంబ్లీ స్ధానం నుంచి వైసీపీ తరఫున బరిలోకి దిగి గెలుపొందారు. రాజధాని ప్రాంత పరిధిలోని నియోజకవర్గం కావడంతో శ్రీదేవి తన హవా సాగించాలనుకున్నారు. అక్కడే అసలు సమస్య మొదలైంది. బాపట్ల ఎంపీగా గెలుపొందిన నందిగం సురేశ్‌ రాజధాని ప్రాంతానికి స్ధానికుడు కావటంతో శ్రీదేవికి కష్టాలు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గాన్ని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు తొలి నుంచి సురేశ్‌ ఎత్తులకుపై ఎత్తులు వేస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండడం శ్రీదేవికి ఏమాత్రం రుచించటం లేదట. బాపట్ల పార్లమెంట్ పరిధిలో రాజకీయ వ్యవహారాలు చూడాల్సిన ఆయన.. తన పరిధిలో లేని తాడికొండ నియోజకవర్గంలో వేలు పెట్టడాన్ని శ్రీదేవి జీర్ణించుకోలేకపోతున్నారట.

స్థానికుడు, పైగా అధిష్టానం అండదండలు:
తాడికొండ నియోజకవర్గ పరిధిలోనే కృష్ణా నది ప్రవహిస్తుండటం, నియోజకవర్గానికి ప్రధాన అదాయవనరైన ఇసుక రీచ్‌లు ఇక్కడే ఉండటంతో ఈ ఇద్దరు నేతలకు మధ్య వైరం ప్రారంభమైందని అంటున్నారు. స్థానికుడైన సురేశ్‌ అధిష్టానం అండదండలతో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ప్రమేయం లేకుండానే ఇసుక రీచ్‌ల వ్యవహారాలన్నీ చక్కబెడుతుండడంతో ఇద్దరి నడుమ ముసలం పుట్టిందని స్థానిక పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. ఇసుక రీచ్ ల వ్యవహారంలో గతంలోనే అధిష్టానం పెద్దల దగ్గర శ్రీదేవి పంచాయితీ కూడా పెట్టినట్లు తెలుస్తోంది. తన నియోజకవర్గ పరిధిలో సురేశ్‌ ఆగడాలు ఎక్కువయ్యాయని, కట్టడి చేయాలని శ్రీదేవి కోరినట్లు వార్తలు వినిపించాయి. అధిష్టానం వద్ద సురేశ్‌కు పరపతి బాగా ఉండటంతో శ్రీదేవి ఫిర్యాదులను పక్కనపెట్టి, నియోజకవర్గ పరిధిలోని ఒక ఇసుక రీచ్ మాత్రమే శ్రీదేవి కనుసన్నలో నడిచేలా సయోధ్య కుదిర్చారని అంటున్నారు.

చాన్స్ చిక్కినప్పుడల్లా ఎమ్మెల్యేని ఇబ్బంది పెడుతున్నారట:
అంతవరకు బాగానే ఉన్నా శ్రీదేవికి వ్యతిరేకంగా నందిగం సురేశ్‌ తాడికొండలో ఓ ప్రత్యేక వర్గాన్ని కూడగట్టి అవకాశం దొరికినప్పుడల్లా ఎమ్మెల్యేను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తొలినాళ్లలో నియోజకవర్గ పార్టీ కార్యకలాపాల్లో దూకుడుగా ముందుకువెళ్ళిన శ్రీదేవి…. రానురాను స్ధానికుడైన సురేశ్‌ను ఎదుర్కొలేకపోవటం, అధిష్టానం కూడా సురేశ్‌కే మద్దతుగా నిలుస్తుండటంతో కొంతకాలంగా ఆమె మౌనంగా ఉండిపోయారనేది ఆమె అనుచరుల మాట. తన నియోజకవర్గ పరిధిలో సురేశ్‌ ఊరూవాడా ఫ్లెక్సీలు కట్టించుకోవటం, నందిగం యువసేన పేరుతో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంశాన్ని శ్రీదేవి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట.

ఆ పేకాటరాయుడు ఎమ్మెల్యే శ్రీదేవి ముఖ్య అనుచరుడా?
ముఖ్యమంత్రి జగన్ యువసేన కాకుండా నందిగం సురేశ్‌ తన పేరుతో యువసేనను ఏర్పాటు చేయడం, నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టడమేంటని సజ్జల వంటి పెద్దల వద్ద మొర పెట్టుకున్నా శ్రీదేవికి ఓదార్పు మినహా పెద్దగా ఒరిగిందేమీ లేదంటున్నారు. తాజాగా మంగళగిరి సమీపంలోని ఓ పేకాట దుకాణంపై పోలీసుల దాడి వ్యవహారం రచ్చరచ్చగా మారింది. పేకాట శిబిరంపై దాడి చేసిన పోలీసులు పేకాటరాయుళ్ళను అరెస్ట్ చేయగా అందులో ఓ వ్యక్తిని తప్పించారని, అతను ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరుడంటూ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో తర్వాత రోజు పేకాట నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే శ్రీదేవి ఒత్తిడితోనే పోలీసులు అసలు సూత్రధారిని తప్పించే ప్రయత్నం చేశారని, ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు కావటం వల్లేనంటూ ప్రచారం సాగడంతో శ్రీదేవికి చిర్రెత్తుకొచ్చిందట.

అధిష్టానానికి తలనొప్పిగా మారిన నేతల లొల్లి:
ఈ ఎపిసోడ్ మొత్తానికి తెరవెనుక సూత్రదారి నందిగం సురేశ్‌ అనేది శ్రీదేవి భావిస్తున్నారట. ఎంపీ సురేశ్‌ను ఏమీ చేయలేక ఎమ్మెల్యే శ్రీదేవి మీడియాకు హెచ్చరికలు జారీ చేయటం పట్ల నియోజకవర్గంలోని పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ఈ గ్రూపు పోరుతో పోలీసు యంత్రాంగం నలిగిపోతోందని అంటున్నారు. నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఇప్పటికే శ్రీదేవి ఏం చెప్పినా చేయొద్దనే ఆదేశాలు చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో ఈ ఇద్దరు నేతల లొల్లి ప్రస్తుతం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. మరోవైపు శ్రీదేవి సైతం ఈ వ్యవహారంలో తాడేపేడో తెల్చుకోవాలన్న ఆలోచనతో ఉన్నారట. మరి అధిష్టానం ఈ విషయంలోఎలా వ్యవహరిస్తుందో చూడాల్సిందేనని కార్యకర్తలు అనుకుంటున్నారు.