తమిళ పార్టీలను చూసి సిగ్గుపడాలి : సీఎం చంద్రబాబు

  • Published By: veegamteam ,Published On : January 30, 2019 / 10:46 AM IST
తమిళ పార్టీలను చూసి సిగ్గుపడాలి : సీఎం చంద్రబాబు

అమరావతి : తమిళనాడు రాజకీయ పార్టీలను చూసి ఏపీలోని రాజకీయ పార్టీలు సిగ్గు పడాలని సీఎం చంద్రబాబు అన్నారు. తమిళనాడులో రాజకీయ పార్టీల మధ్య మనకన్నా ఎక్కువ గొడవలు ఉన్నాయని, అయినా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం వస్తే అన్ని పార్టీలు ఏకమవుతాయని చంద్రబాబు చెప్పారు. వ్యక్తిగత విభేదాలు, గొడవలు, జెండాలు, అజెండాలు పక్కన పెట్టి తమిళ పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తాయని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయంలో వారు అస్సలు కాంప్రమైజ్ కారని, అనుకున్నది సాధిస్తారని చెప్పారు. ఏపీలో మాత్రం పార్టీలకు వ్యక్తిగత అజెండాలే ముఖ్యం కావడం బాధాకరమన్నారు.

 

ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే దిశగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి. వైసీపీ, కాంగ్రెస్, జనసేన, బీజేపీ, వామపక్షాలు అఖిలపక్ష సమావేశానికి హాజరుకాలేదు. దీంతో సీఎం చంద్రబాబు వారిపై అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి పట్టదా? అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీరుపైనా చంద్రబాబు మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఏపీకి తీరని అన్యాయం చేసిందని వాపోయారు. ప్రైవేట్ సంస్థలకు ఉన్న చిత్తశుద్ధి కేంద్రానికి లేకపోవడం శోచనీయమన్నారు.

 

* చంద్రబాబు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం
* ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు చంద్రబాబు వ్యూహం
* అఖిలపక్ష సమావేశానికి ప్రధాన పార్టీలు దూరం
* వైసీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు గైర్హాజరు
* బీఎస్పీ, ఎస్పీ, ప్రజాశాంతి పార్టీ నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు, ప్రజా సంఘాల నేతలు హాజరు
* సమావేశానికి హాజరైన ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్
* నాలుగేన్నరేళ్లలో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంప్రదింపులను వివరించిన చంద్రబాబు