టీడీపీకి వెన్నుపోటు పొడిచిన వారిని వదిలిపెట్టను : చంద్రబాబు వార్నింగ్

  • Published By: veegamteam ,Published On : May 4, 2019 / 11:07 AM IST
టీడీపీకి వెన్నుపోటు పొడిచిన వారిని వదిలిపెట్టను : చంద్రబాబు వార్నింగ్

అమరావతి : తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారి బండారం త్వరలోనే బయటపడుతుందని ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని వదిలిపెట్టనని ఆయన వార్నింగ్ ఇచ్చారు. కొందరు సీనియర్లు పార్టీకి వెన్నుపోటు పొడిచిన విషయాలు తన దృష్టికి వచ్చాయన్నారు. అలాంటి నేతల లెక్కలు తియ్యాల్సిన అవసరం ఉందన్నారు. కొందరు నేతలు సీనియర్ నేతల్లా మాట్లాడుతున్నారని, ఫోజులు కొడుతున్నారని చంద్రబాబు సీరియస్ అయ్యారు. కింద స్థాయిలో పని చెయ్యకుండానే బిల్డప్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారి వివరాలు తెలుసుకుంటున్నానని, వారికి బుద్ధి చెబుతానని చంద్రబాబు హెచ్చరించారు.

అమరావతిలో చంద్రబాబు ఆధ్వర్యంలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు ప్రారంభమయ్యాయి. శనివారం (మే 4,2019) ఉండవల్లిలోని హ్యాపీ రిసార్ట్స్ లో రాజమండ్రి పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 50మంది వరకు ముఖ్య నేతలు హాజరయ్యారు. పోలింగ్‌ సరళి, కౌంటింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈవీఎంలలో లోపాలు, అధికారుల వ్యవహారశైలి తదితర అంశాలపై చంద్రబాబు నేతలతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. వార్నింగ్ కూడా ఇచ్చారు.

సొంత బూత్ లో ఓట్లు కూడా రావు.. కానీ తాము రాష్ట్ర స్థాయి నేతలా కొందరూ పీల్ అవుతున్నారని చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇలాంటి నాయకులను పెట్టుకుని నేనేం చేయాలి అని  ప్రశ్నించారు. పార్టీ అధిష్టానం దృష్టిలో పని చేస్తున్నట్టు నటిస్తూ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారి బండారం త్వరలోనే బయటపడుతుందన్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారి వివరాలను ఈ ఏడు  నియోజకవర్గాలకు చెందిన నాయకులను అడిగి చంద్రబాబు తెలుసుకున్నారు. ఎన్నికల ఫలితాలపై మన అసెస్ మెంట్ సిన్సియర్ గా ఉండాలని చంద్రబాబు అన్నారు. 23న ఫలితాలతో మన  అంచనాలు బేరీజు వేసుకోవాలన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త తమ సొంత బూత్ లో ఓట్లు సాధించగలగాలని అన్నారు. రాజమండ్రి రూరల్, ఎంపీ అభ్యర్థులను ఓడించేందుకు సొంత పార్టీ  నేతలే కొందరు కుట్రలు చేశారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన ఆరోపణలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి.

పార్టీలో ఎవరు ఎలా పని చేశారో తనకు తెలుసు అని చంద్రబాబు అన్నారు. బూత్ లో ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి, టీడీపీకి ఎన్ని ఓట్లు వస్తాయి అనే అసెస్ మెంట్ మెంట్ కరెక్ట్ గా జరగాల్సిన  అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. 2009లో తమ బూత్ లో టీడీపీకి ఎన్ని ఓట్లు పడ్డాయి, 2014లో ఎన్ని ఓట్లు పడ్డాయి, 2019లో ఎన్ని ఓట్లు పడతాయి అనే అసెస్ మెంట్ కరెక్ట్ గా  చెయ్యగలిగితే ఆ నాయకుడికి తిరుగు ఉండదని చంద్రబాబు చెప్పారు.