అసలేం జరిగింది : నెల్లూరు ఎమ్మెల్యేల అంతర్గత పోరుపై జగన్ సీరియస్

నెల్లూరు జిల్లా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరుపై అధినేత జగన్‌ ఆగ్రహంగా ఉన్నారు. ఇద్దరు నేతల పంచాయితీ జగన్‌ ముందుకు వచ్చింది. తరచూ వివాదాలకు,

  • Edited By: veegamteam , October 9, 2019 / 12:58 PM IST
అసలేం జరిగింది : నెల్లూరు ఎమ్మెల్యేల అంతర్గత పోరుపై జగన్ సీరియస్

నెల్లూరు జిల్లా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరుపై అధినేత జగన్‌ ఆగ్రహంగా ఉన్నారు. ఇద్దరు నేతల పంచాయితీ జగన్‌ ముందుకు వచ్చింది. తరచూ వివాదాలకు,

నెల్లూరు జిల్లా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరుపై అధినేత జగన్‌ ఆగ్రహంగా ఉన్నారు. ఇద్దరు నేతల పంచాయితీ జగన్‌ ముందుకు వచ్చింది. తరచూ వివాదాలకు, ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారుతున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డికి నడుమ విభేదాలు తారస్థాయికి చేరాయి. ఒకే పార్టీకి చెందిన వారు కావడంతో పాటు బంధువులైన ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పరిస్థితి ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి చేరడంతో అధినేత సీరియస్‌గా ఉన్నారు. సాయంత్రం క్యాంప్‌ ఆఫీస్ లో జరగనున్న ప్రత్యేక భేటీలో జిల్లా నేతల మధ్య సమన్వయ లోపంపై చర్చించనున్నారు. అక్టోబర్ 15న జరగనున్న రైతు భరోసా ప్రారంభ కార్యక్రమంపై కూడా చర్చించనున్నారు.

నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాల్లో జెండా ఎగరవేసిన వైసీపీ పార్టీలో అంతర్గత పోరు సాగుతోంది. అది కూడా వరుసకు బంధువులైన బావ బావమరుదులు కాకాని గోవర్ధన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఓ ప్రైవేటు లేఔట్‌కు వాటర్ పైప్ లైన్ కనెక్షన్ మంజూరు విషయమై తలెత్తిన వివాద౦ మరోసారి వీరి విభేదాలను తెరపైకి తీసుకొచ్చింది. దీనికి ఓ ప్రభుత్వ మండల అధికారి కూడా కేంద్ర బిందువుగా మారడం చర్చనీయాంశమైంది.

వెంకటాచలం మండలంలోని గొలగ మూడి దగ్గర ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి బందువులకు చెందిన లే అవుట్‌కు పంచాయితీ వాటర్ పైప్‌లైన్ పొడిగించాలని లే అవుట్ యజమాని వెంకటాచలం ఎంపీడీఓ కార్యాలయంలో ధరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ మండలానికి చెందిన వైసీపి నేత ఒకరు డబ్బులు ఆశించి దానికి వాటర్ పైప్ లైన్ అనుమతి ఇచ్చే విషయంలో అడ్డుపడ్డారు. ఇదంతా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన రెడ్డికి తెలిసే జరిగిందని ప్రచారం జరిగింది. దీనిపై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎంపీడీఓను నిలదీశారు. ఇది చినికి చినికి గాలివానలా మారి బంధువులైన ఇద్దరి ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్‌గా మారింది.

ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వలేదనే కారణంతో తనను దుర్భాషలాడాడని, తన ఇంటిపై దౌర్జన్యం చేశారని వెంకటాచలం ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై కేసు నమోదు కావడం జరిగిపోయింది. ఆ తర్వాత శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసి మొబైల్ అండ్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చడం..ఆ తరువాత బెయిల్ లభించడం జరిగాయి. ఈ కేసు వెనుక కాకాని గోవర్ధన్ రెడ్డి రాజకీయ కుట్ర దాగుందని కోటంరెడ్డి ఆరోపించారు. ఏకంగా ఒక ఎమ్మెల్యేపై మండల స్థాయి మహిళా అధికారి ఫిర్యాదు చేసేందుకు అర్ధరాత్రి స్టేషన్‌కు రావడం వెనుక కారణాలను పార్టీ చీఫ్ జగన్‌ పరిశీలించినట్లు తెలుస్తోంది. 

పదికి పది స్థానాలు ఇచ్చిన జిల్లాలో ఇలా ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల నడుమ ఏర్పడిన మనస్పర్ధలు పార్టీకి మంచిది కాదని భావించిన అధినేత జగన్‌ ఇద్దరి పంచాయతీపై చర్చించనున్నారు. అక్టోబర్ 15న నెల్లూరు జిల్లాకు సీఎం జగన్ రానుండటంతో పార్టీలో నెలకొన్న ఈ అంతర్గత పోరును ముందస్తుగానే పరిష్కరించేందుకు ప్రత్యేక భేటీ అయ్యారు.