దెబ్బ మీద దెబ్బ : చంద్రబాబు కోలుకోలేని విధంగా జగన్ వ్యూహం

దెబ్బకు దెబ్బ తీయడం రాజకీయాల్లో కామన్‌. కానీ దెబ్బ మీద దెబ్బ కొట్టడం.. కోలుకొనే లోపే మరో దెబ్బ వేయడం.. ఆ దెబ్బ నుంచి తేరుకొనే లోపే వెనుక నుంచి మరో దెబ్బ

  • Published By: veegamteam ,Published On : February 12, 2020 / 03:20 PM IST
దెబ్బ మీద దెబ్బ : చంద్రబాబు కోలుకోలేని విధంగా జగన్ వ్యూహం

దెబ్బకు దెబ్బ తీయడం రాజకీయాల్లో కామన్‌. కానీ దెబ్బ మీద దెబ్బ కొట్టడం.. కోలుకొనే లోపే మరో దెబ్బ వేయడం.. ఆ దెబ్బ నుంచి తేరుకొనే లోపే వెనుక నుంచి మరో దెబ్బ

దెబ్బకు దెబ్బ తీయడం రాజకీయాల్లో కామన్‌. కానీ దెబ్బ మీద దెబ్బ కొట్టడం.. కోలుకొనే లోపే మరో దెబ్బ వేయడం.. ఆ దెబ్బ నుంచి తేరుకొనే లోపే వెనుక నుంచి మరో దెబ్బ వేయడం.. ఇదే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో జరుగుతోంది. పరాజయ భారం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పార్టీని అష్ట దిగ్బంధనం చేసి ఊపిరి సలపనీయకుండా చేస్తోంది అధికార పార్టీ. శత్రువు ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా తీసుకోవాలని గతంలో ప్రతిపక్ష పార్టీ అధినేతగా చెప్పిన డైలాగ్‌నే ఇప్పుడు అధికార పార్టీ రూపంలో ప్రాక్టికల్‌గా చూపిస్తోంది. 

టీడీపీని అష్టదిగ్బంధనం చేసేందుకు వైసీపీ ప్లాన్‌:
ఏపీలో టీడీపీ ఇరకాటంలో పడుతోంది. ఆ పార్టీ నేతలను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒక పక్క ఐటీ దాడులు.. మరోపక్క కేసులతో పార్టీ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మెల్లమెల్లగా నిలదొక్కుకుంటున్న పార్టీని అష్టదిగ్బంధనం చేసేందుకు అధికార వైసీపీ పక్కా ప్లాన్స్‌తో ముందుకెళ్తోందని అంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను అందిపుచ్చుకొని ఎండగట్టడం ద్వారా బలపడదామని అనుకుంటున్న టీడీపీని కోలుకోలేని దెబ్బ తీసేందుకు పార్టీ నేతల ఆర్థిక మూలాలపైనే దాడులు చేయిస్తోందని జనాలు అనుకుంటున్నారు. దెబ్బ మీద దెబ్బ కొడుతూ మళ్లీ లేవకుండా చేయాలన్న లక్ష్యంతోనే సీఎం జగన్‌ ముందుకు దూకుడుగా వెళ్తున్నారని చెబుతున్నారు. 

ఆర్థిక మూలాలపై దాడులు:
అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చివేతలతో మొదలుపెట్టిన టీడీపీని దెబ్బతీసే పనిని.. అసలు గ్యాప్‌ లేకుండా కొనసాగిస్తూనే ఉంది వైసీపీ సర్కారు. ఒక పక్క కేంద్రం నుంచి రంగంలోకి దిగిన ఆదాయ పన్ను శాఖ అధికారుల దాడులు, మరో పక్క, రాష్ట్ర ప్రభుత్వ శాఖల దాడులతో తెలుగుదేశం పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతూ ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారట. ఒక్కొక్కటిగా అనుకున్నది అనుకున్నట్టుగానే ఆచరణలో పెడుతోంది వైసీపీ సర్కారు. వివిధ ప్రాజెక్టుల రివర్స్‌ టెండరింగ్‌లంటూ మొదలు పెట్టిన సర్కారు.. ఆ తర్వాత నేతలను ఆర్థికంగా దెబ్బ తీసే పని మొదలుపెట్టింది. 

జేసీ వ్యాపారాలు బంద్:
అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి సంబంధించిన పలు వ్యాపారాలపై దాడులు తీవ్రతరం చేసింది. అవకాశం చిక్కితే జగన్‌పై విరుచుకుపడే జేసీని… మాట్లాడనీయకుండా చేయడమే పని పెట్టుకుంది సర్కారు. ఇప్పటికే ఆయన ట్రావెల్‌ కంపెనీ బస్సులను, లారీలను సీజ్‌ చేసేసింది. త్రిశూల్‌ సిమెంట్‌ కంపెనీకి కేటాయించిన గనుల లీజ్‌ను రద్దు చేసేసింది. ఆయన ఆర్థిక మూలాలను పూర్తిగా నాశనం చేయాలని జగన్‌ కంకణం కట్టుకున్నారని ఆయనతో పాటు జనాలు కూడా అనుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వారికి అనుకూలంగా ఉన్న ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులపైనా దృష్టి పెట్టింది. ఇప్పటికే ఇంటెలిజెన్స్‌ విభాగం మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేసేసింది. మరో అధికారి జాస్తి కృష్ణకిశోర్‌పై కూడా చర్యలకు ఉపక్రమించింది. 

ఐటీ దాడులు, కేసులతో ఉక్కిరిబిక్కిరి:
రాజధాని భూముల వ్యవహారంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలపై సీఐడీ కేసులు నమోదయ్యాయి. నలు దిక్కుల నుంచి చుట్టుముట్టిన కేసులు, ఐటీ దాడులతో తెలుగుదేశం పార్టీ నేతలు సతమతమైపోతున్నారు. నేతలంతా తమ సమస్యలను చక్కబెట్టుకోవడంపైనే దృష్టి పెట్టేలా చేయడం ద్వారా తన పని ప్రశాంతంగా పూర్తి చేసుకోవచ్చని వైసీపీ సర్కారు భావిస్తోందంట. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టే అవకాశం చిక్కకుండా టీడీపీ నేతలను ఏదో ఒక కేసు, సమస్యల్లో బిజీబిజీగా ఉంచాలన్న ప్లాన్‌తో జగన్‌ ముందుకు వెళ్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

మాటలతో విరుచుకుపడే టీడీపీ నేతలే టార్గెట్:
రాజధాని వ్యవహారంపై టీడీపీ గట్టిగా పోరాడుతున్న నేపథ్యంలో ఆ పార్టీని బలహీనపరచాలని వైసీపీ చూస్తోంది. అందుకే ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకొనేలా ఒక పక్క చేస్తూనే.. మరోపక్క ఉన్న వారిపై కేసులు, ఆర్థిక మూలాలపై దాడులు చేయిస్తూ ఊపిరి తీసుకోనీయడం లేదని అంటున్నారు. జగన్‌పై మాటలతో విరుచుకుపడుతూ జోరు చూపించే నేతలను సైలెంట్ చేసేందుకు ఉన్న అన్ని మార్గాలను వాడుకుంటోంది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని జోరుకు అడ్డుకట్ట వేయడంలో సఫలమైందంటున్నారు. ఆయనను జైలుకు పంపించిన తర్వాత మెత్తబడిపోయారని చెబుతున్నారు. కొందరు నేతలకు భద్రతను కూడా తగ్గించేస్తోంది ప్రభుత్వం. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డితో పాటు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు సెక్యూరిటీని కూడా తగ్గించేస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద టీడీపీని కోలుకోలేని దెబ్బ తీయడమే ప్రధాన లక్ష్యంగా వైసీపీ పెట్టుకుందని జనాలు అంటున్నారు.