మంత్రులను టెన్షన్ పెడుతున్న సీఎం జగన్ నిర్ణయం

  • Published By: veegamteam ,Published On : February 24, 2020 / 11:20 PM IST
మంత్రులను టెన్షన్ పెడుతున్న సీఎం జగన్ నిర్ణయం

మంత్రి పదవి రాగానే ఏసీ రూముల్లో కూర్చొని ఎంజాయ్‌ చేస్తామంటే కుదరదు.. పని చేసి ప్రజల్లో మార్కులు సంపాదించాలి. పరీక్షలు రాసి అధినేత దగ్గర మార్కులు తెచ్చుకోవాలి. ఈ రెండింటిలో ఏ మాత్రం తేడా వచ్చినా పదవి హుష్‌ కాకి. ఇప్పటికే యూనిట్‌ టెస్టులు రాసిన ఏపీ మంత్రులు.. ఇప్పుడు వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్నారు. సిలబస్‌ ఫిక్స్‌ చేసిన సీఎం ప్రశాంతంగా ఉన్నారు.. పరీక్షల ప్రిపరేషన్‌తో మంత్రులు మాత్రం టెన్షన్‌ పడుతున్నారు. 

పరీక్షలో పాసయ్యేందుకు మంత్రుల ఉరుకులు పరుగులు:
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులకు సీఎం జగన్ పరీక్ష పెట్టారట. అదేదో సాదాసీదా పరీక్ష కాదు. తేడా వస్తే పోస్టులు ఊస్ట్ అయ్యే అగ్నిపరీక్ష. దీంతో ఆ పరీక్షలో నెగ్గేందుకు కసరత్తు ప్రారంభించారు మంత్రులు. అసలే జగన్ ఇలాంటి విషయాల్లో కఠినంగా ఉంటారు కనుక పరీక్షలో పాసయ్యేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారట మంత్రులు. సాధారణ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన వైసీపీ.. ఇప్పుడు స్థానిక సమరంలోనూ అంతకు మించి మెజారిటీ సాధించాలనే లక్ష్యంతో ఉంది. దీంతో ఆ బాధ్యలను పూర్తిగా మంత్రులకు అప్పగించారట సీఎం జగన్‌. ముఖ్యంగా జిల్లాల్లో మెజారిటీ తప్పనిసరిగా సాధించాల్సిందేనంటూ ఇన్‌చార్జి మంత్రులను ఆదేశించారని అంటున్నారు. 

ప్రచారం, పోల్‌ మేనేజ్‌మెంట్‌ బాధ్యతలన్నీ మంత్రులదే:
అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం, పోల్‌ మేనేజ్‌మెంట్ వంటి అంశాల బాధ్యతలన్నీ మంత్రులకే అప్పగించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా స్థానిక నేతలను, ఎమ్మెల్యేలను సమన్వయపరచడం, విభేదాలను పరిష్కరించడం వంటి కీలకమైన బాధ్యలు కూడా మంత్రులదే. ఎన్నికలు ముగిసే వరకూ శాఖల విషయాలు పక్కన పెట్టి ఎన్నికలపైనే పూర్తి స్థాయి దృష్టి పెట్టాలని స్పష్టం చేసేశారట. ఇంచార్జ్ మంత్రులతో పాటు లోకల్ మంత్రులు జిల్లాలకే పరిమితమై ఎన్నికల కసరత్తు పూర్తి చేయాలని చెప్పారటంటున్నారు. 

See Also>>ప్రభుత్వం కీలక నిర్ణయం: ప్రజావేదిక పరికరాలు వేలం

మెజారిటీ రాకుంటే మంత్రి పదవి కోల్పోవలసిందేనా?
కేవలం బాధ్యతలే కాకుండా ఈ విషయంలో వారికి ఓ అగ్నిపరీక్ష పెట్టారట జగన్. స్థానిక సమరంలో మెజారిటీ దక్కించుకోలేకపోతే వారి పోస్ట్‌లకు ఊస్టింగ్‌ తప్పదనే వార్నింగ్ కూడా ఇచ్చారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతో లోకల్ వార్ అంటేనే మంత్రులు హడలిపోతున్నారట. ఆదేశాలు వచ్చినప్పటి నుంచి ఎక్కువ సమయం జిల్లాలకే పరిమితమై ఉరుకులు పరుగులు పెడుతున్నారు. జగన్‌ నిర్దేశించిన లక్ష్యాలను చేరేందుకు గట్టి ప్రయత్నాలు ప్రారంభించారని అంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా వార్‌కు సిద్ధంగా ఉన్నామంటున్నారు మంత్రులు. గత ఎన్నికల కంటే మెరుగైన పలితాలు సాధిస్తామని ధీమాగా చెబుతున్నారు.

వ్యతిరేకతను ఓట్లుగా మలచుకోవడంలో ప్రతిపక్షాలు సక్సెస్‌ అవుతాయా?
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు జగన్‌. వాటిలో కొన్నింటిపై ప్రజల్లో కొంత వ్యతిరేకత కూడా కనిపిస్తోంది. ప్రతిపక్షాలైతే ప్రభుత్వ నిర్ణయాలపై విస్తృతంగా ఆందోళనలు చేపడుతున్నాయి. విమర్శలు గుప్పిస్తున్నాయి. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకొనే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాయి. మరి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మలచుకోవడంలో ఆయా పార్టీలు ఎంత వరకూ సక్సెస్‌ అవుతాయన్న దానిపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. మరి వారి ప్రయత్నాలు ఎంత వరకూ వర్కవుట్ అవుతాయో చూడాలి. ఈ పరిస్థితులన్నింటి నుంచి మంత్రులు ఎలా గట్టెక్కుతారోనని జనాలు ఎదురు చూస్తున్నారు.